ధాన్యం కొనుగోలుపై దోబూచులాట!

ABN , First Publish Date - 2021-02-25T08:34:33+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రా (పీపీసీ)లను ఎత్తివేసే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం పేరు చెబుతూ రైతులతో దోబూచులాడుతోంది.

ధాన్యం కొనుగోలుపై దోబూచులాట!

  • ఎంతిచ్చినా ‘ఎఫ్‌సీఐ’ ఏనాడూ వద్దనలే.. 
  • ఆరేండ్లలో ఎప్పుడూ తిరస్కరించని కేంద్రం.. 
  • గతేడాది 68.50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు
  • కేంద్రం షరతులు విధిస్తుందంటూ కొర్రీలు
  • కొనుగోళ్లు చేయబోమంటున్న రాష్ట్ర సర్కారు
  • రేషన్‌ కోసం కొనుగోలు తప్పని పరిస్థితి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రా (పీపీసీ)లను ఎత్తివేసే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం పేరు చెబుతూ రైతులతో దోబూచులాడుతోంది. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని గతంలో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అసలు కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయబోమని, రైతుల నుంచి కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని తీసుకోవటానికి కేంద్రం నిరాకరిస్తోందని ప్రకటనలు చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో సేకరించిన ధాన్యా న్ని ఎప్పుడు కూడా ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) తిరస్కరించిన దాఖలాలు లేవు. ఆరేండ్లలో రాష్ట్రం నుంచి 225 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకుంది. కేంద్రం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రతినెలా చౌకడిపోల ద్వారా బియ్యం పంపిణీ చేయటానికి నెలకు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున ఏడాదికి 480 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ఇక రాష్ట్రం విషయానికి వస్తే.. జాతీయ ఆహారభద్రత చట్టం పరిధిలో ఉన్న రేషన్‌కార్డుదారులతోపా టు అంత్యోదయం(ఏఏవె)ౖ, అన్నపూర్ణ, హాస్టళ్లు, మధ్యా హ్న భోజనం, అంగన్‌వాడీలు, అన్ని సంక్షేమ పథకాలకు కలిపి నెలకు 1,25,755  మెట్రిక్‌ టన్నుల చొప్పున ఏడాదికి 15.09 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి అదనంగా ఇచ్చే కిలో బియ్యం (కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం 1 కిలో= మొత్తం 6 కిలోలు), అదనంగా ఆహార భద్రత కార్డులకు కలిపి మరో 3 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ‘ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ సిస్టమ్‌’(ఓఎంఎ్‌సఎస్‌) పథకంలో రైస్‌ మిల్లర్ల నుంచి క్వింటాలుకు రూ. 3,273 చొప్పున సేకరిస్తోంది. రాష్ట్రంలో ఉన్న రేషన్‌కార్డుదారుల ఆహార అవసరాలకు 18 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి.  


ఎఫ్‌సీఐ తిరస్కరించిన దాఖలాలే లేవు

వికేంద్రీకృత సేకరణ పథకం (డీసెంట్రలైజ్‌డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ స్కీమ్‌- డీసీపీ)ప్రవేశపెట్టి.. 11 రాష్ట్రాల నుంచి బియ్యం, 4 రాష్ట్రాల నుంచి గోధుమలను కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నోడల్‌ ఏజెన్సీగా ఉండి.. ఎఫ్‌సీఐ తరఫునే కొనుగోలు చేస్తుంది. కస్టమ్‌ మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని క్వింటాలుకు రూ. 3,273 చొప్పున కేంద్రమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో సేకరించిన ధాన్యాన్ని ఎప్పుడు కూడా ఎఫ్‌సీఐ తిరస్కరించిన దాఖలాలు లేవు. సెంటర్లు ఏర్పాటుచేసి ఎంత కొంటే.. అంత మొత్తాన్ని కేంద్రం తీసుకొంది.  గడిచిన ఆరేండ్లలో(2014-20) ఏకంగా 225.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేంద్రం రాష్ట్రం నుంచి తీసుకొంది.  ఈ ఏడాది కూడా 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం  కొనుగోలు చేయటానికి ఎఫ్‌సీఐ ప్రఽణాళిక తయారు చేసుకొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 48.42 లక్షల టన్నుల ధాన్యాన్నే రైతుల నుంచి కొనుగోలు చేయగలిగింది. 


డీసీపీపై తెలంగాణ వైఖరి ఏమిటి?

కేంద్రం అమలు చేస్తున్న డీసీపీ పథకంలో 15 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. 18 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి అయిన బియ్యాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాల (కేరళ, తమిళనాడు, కర్ణాటక) పీడీఎస్‌ కోసం పంపిస్తోంది. బాయిల్డ్‌ రైస్‌ను ఒడిసా, అసోం, పశ్చిమ బెంగాల్‌కు ఇక్కడి నుంచే కేంద్రం పంపిణీ చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే.. డీసీపీ నుంచి తెలంగాణ వైదొలగాల్సి వస్తుంది. డీసీపీ నుంచి వైదొలుగుతుందా? పునరాలోచన చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, యథాతదంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతుందా? అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడాల్సి ఉంది.

Updated Date - 2021-02-25T08:34:33+05:30 IST