తాండూరులో తాగునీటి గోస!

ABN , First Publish Date - 2022-05-14T05:22:05+05:30 IST

తాండూరులో తాగునీటి గోస!

తాండూరులో తాగునీటి గోస!


  • ఓ వైపు వృధా.. మరో వైపు వ్యధ
  • కొన్ని ప్రాంతాల్లో దాహం తీర్చని  మిషన్‌ భగీరథ
  • ఎస్సీ హాస్టల్‌ సమీపంలో ఇంకా వేయని పైప్‌లైన్‌

తాండూరు, మే13 :  మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీటి ఘోస తీర్చామని, ప్రజలకు నీటి ఇబ్బందులు ఉండవని, ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నా.. తాండూరు పట్టణ ప్రజలకు సరిగా అందడం లేదు. పట్టణ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి పాత తాండూరు రైల్వే గేటు వరకు 20 రోజులుగా మిషన్‌ భగీరథ నీరు వృఽథాగా పోతోంది. దానిని అరికట్టేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. మరో పక్క తాండూరు పట్టణం భవానీ నగర్‌లో  ఆరు నెలలుగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ఏడాది క్రితం పైపులు వేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ ఈ లైన్లకు నీటి సరఫరా చేయడం లేదు. పైప్‌లైన్లు స్టకప్‌ కావడంతో నీరు రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాటిని సరి చేసేందుకు చొరవ చూపడం లేదు. పాలకులు మాత్రం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పరస్పర విమర్శలకే పరిమితమయ్యారు. ఒకపక్క భవానీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో దాహం తీరక జనాలు అల్లాడుతున్నారు. అటు మిషన్‌ భగీరథ నీరు ఇటు మున్సిపల్‌ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో నీటి సరఫరా కావడం లేదు. పలుచోట్ల పైప్‌లైన్‌ లీకేజీల వల్ల  కాలనీల్లో చివరి వరకు నీరందడం లేదు. పట్టణంలో చాలా మంది తాగునీటి కోసం వాటర్‌ క్యాన్లను కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ల వద్ద జనం గుమిగూడుతున్నారు. పట్టణంలో ఈ  పరిస్థితి ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్‌ భగీరథ పైప్‌లకు కనెక్షన్‌ ఇచ్చినా, పైప్‌లైన్లు వేసినా తాగునీరు సరఫరా కావడం లేదు. మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ లోపంతో  వేసవిలో నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. సాయిపూర్‌లోని ఎస్సీ హాస్టల్‌ సమీపంలో ఇప్పటి వరకు కూడా మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు వేయకపోవడం విశేషం.

ఆరు నెలలుగా మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు

మా కాలనీలో 6 నెలల క్రితం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ వేశారు.  కానీ ఇప్పటి వరకు కాలనీకి నీటి సరఫరా లేదు. నీటి సరఫరా లేకపోవడంతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మున్సిపల్‌ అధికారులు నీరు సరఫరా చేయడం లేదు. డబ్బులు వెచ్చించి వాటర్‌ టిన్‌లు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి కాలనీలో నీటిసరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి. 

                                                                       - పార్వతమ్మ, భవానీ నగర్‌, 

ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నాం

భవానీనగర్‌, మైసమ్మ దేవాలయం సమీపంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ నీటి కోసం కొన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా ఆరు నెలలుగా తాగునీరు సరఫరా కావడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లే ఇవ్వలేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కాలనీకి వారానికోసారి  ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. 

                                                         - పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్‌, భవానీగర్‌, 

Read more