గుడ్డులేని.. గోరుముద్ద

ABN , First Publish Date - 2022-07-06T05:36:36+05:30 IST

గుడ్డు లేకుండా గోరుముద్ద.. విద్యార్థుల నిరాశ.. ఇదీ తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎదురైన ఘటన. ఆరంభంలోనే ఎదురైన ఈ పరిస్థితిపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గుడ్డులేని.. గోరుముద్ద

తొలి రోజే విద్యార్థులకు అందని వైనం

బడులకు సరఫరా కాని గుడ్లు, చిక్కీలు

జిల్లాలోని 1631 పాఠశాలల్లో ఇదే పరిస్థితి

 

నరసరావుపేట, జూలై 5: గుడ్డు లేకుండా గోరుముద్ద.. విద్యార్థుల నిరాశ.. ఇదీ తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎదురైన ఘటన. ఆరంభంలోనే ఎదురైన ఈ పరిస్థితిపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేశారు. అయితే తొలి రోజు ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు కాలేదు. గోరుముద్దలో గుడ్డు కనిపించలేదు. బడికి వచ్చిన రోజే భోజనంలో గుడ్డు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మెనూ ప్రకారం బుధవారం గుడ్డు, చిక్కీలు విద్యార్థులకు అందించాలి. అయితే ఇవి మంగళవారం సాయంత్రం వరకు పాఠశాలలకు సరఫరా కాలేదు. దీంతో రెండో రోజు కూడా మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఉండదని, చిక్కీలు కూడా అందవని తెలుస్తుంది. జిల్లాలో 1631 పాఠశాలల్లో గోరుముద్ద పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2,12,025 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. సోమవారం నుంచి శనివారం వరకు భోజన పట్టికను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం మంగళవారం అన్ని పాఠశాలల్లో పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు విద్యార్థులకు వడ్డించాలి. అయితే గుడ్డు  సరఫరా కాకపోవడంతో పులిహోర, పప్పుకూరను మాత్రం విద్యార్థులకు వడ్డించారు. బుధవారం కూరగాయలతో అన్నం, ఆలూకుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీలను అందించాలి. అయితే ఈ మెనూ కూడా అమలయ్యే పరిస్థితి కానరావడం లేదు. ప్రభుత్వం నియమించిన ఏజెన్సీలు గుడ్లు, చిక్కీలను పాఠశాలలకు సరఫరా చేయలేదు. పాఠశాలలు తెరిచే సమయానికి వాటిని సరఫరా చేయాలి. అయితే వీటిపై విద్యా శాఖాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఇవి పాఠశాలలకు సరఫరా కాలేదు. కనీసం గురువారం నుంచి అయినా ప్రభుత్వం ప్రకటించిన భోజన పట్టిక అమలయ్యేలా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. రెండు రోజుల్లో గుడ్లు, చిక్కీలు వస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 


 

Updated Date - 2022-07-06T05:36:36+05:30 IST