గొర్రెలకాపరి ముఖం

ABN , First Publish Date - 2022-09-26T06:18:49+05:30 IST

ఇంతవరకూ చేరి-చేరి నేను చాలా మరచిపోయాను వేటిని గుర్తుంచుకోవడం చాలా అవసరమో వాటిని కూడా...

గొర్రెలకాపరి ముఖం

ఇంతవరకూ చేరి - చేరి

నేను చాలా మరచిపోయాను

వేటిని గుర్తుంచుకోవడం చాలా అవసరమో

వాటిని కూడా


ఇంతకాలం తర్వాత కూడా

ఒక వృద్ధ గొర్రెలకాపరి ఉదాసీన ముఖం

ఇంకా నాకు ఎందుకు గుర్తుందో

చెప్పడం కష్టం

ఒకసారి ఆ ముఖాన్ని నేను

నదిలో చూసాను

అప్పుడు అతని గొర్రెలు నీళ్ళు తాగుతున్నాయి

అతని ముఖం ముడుతల్లో

ఇంకా చోటుండడం

నేను చూసాను

అక్కడ ఒక పక్షి

గూడు కట్టుకోవచ్చు


గొర్రెలు అక్కడే ఉండిపోయాయి

నీళ్ళూబురద సమేతంగా ఆ సజీవముఖం

నాతో పాటు ఎలా నడచి వచ్చిందో

నాకు ఎరుక లేదు

ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్నుంచి

నా లోపల చుక్కలు చుక్కలు పడుతున్నాయి


నేను ఈ ముఖాన్ని ఏం చెయ్యను?

మళ్ళీ వెనక్కి వెళ్ళి

ఆ నదిలో దాన్ని విడచి రావడం

కుదురుతుందా?

దాన్ని గోడమీద వేలాడదియ్యనా?

ఆ సజీవ ముఖాన్ని పొందికగా ఉంచే

కిటుకు ఏదైనా ఉందా?

ఏం చెయ్యాలి?


మిత్రులారా,

కిటకిటలాడుతున్న రోడ్డు మీద

ఒక ఆకులా ఎగరడం

ఎంత కష్టం?

ఈ ఢిల్లీ నగరంలో

ఒక వృద్ధ గొర్రెలకాపరి ఉదాసీన ముఖాన్ని

మన చైతన్యంలో ఉంచుకొని

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ

తిరగడం ఎంత కష్టం?

(గడరియే కా చెహరా, 1983)

హిందీ మూలం : కేదార్‌నాథ్‌ సింగ్‌

తెలుగు అనువాదం: కిల్లాడ సత్యనారాయణ

83339 87838

Updated Date - 2022-09-26T06:18:49+05:30 IST