Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఉండవని తేల్చేసిన సజ్జల

ABN , First Publish Date - 2022-08-09T00:59:53+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ (video call) చేసి మాట్లాడారు.

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఉండవని తేల్చేసిన సజ్జల

అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ (video call) చేసి మాట్లాడారు. ఈ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. మాధవ్‌ వీడియో వ్యవహారం‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ, మహిళా సంఘాలు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ప్రభుత్వాన్ని కోరారు. సత్వర విచారణ చేపట్టాలని ఆమె డీజీపీకి లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. మాధవ్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఉండవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తేల్చేశారు. మాధవ్‌ వ్యవహారాన్ని ఓటుకి నోటు కేసుతో ఆయన పోల్చారు. గతంలో తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వాయిస్‌తో వచ్చిన.. ఆడియోకు సపోర్టింగ్‌గా డబ్బులు కూడా దొరికాయని తెలిపారు. ఆవాయిస్ చంద్రబాబుదో కాదో ఇప్పటికీ తేల్చలేదన్నారు. ప్రస్తుత ఇష్యూ కంటే చంద్రబాబు ఇష్యూ పెద్దదని చెప్పారు. గోరంట్ల వ్యవహారంలో మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజానిజాలు తేలేవరకూ ఆగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 


మాధవ్‌ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో మొదటి నుంచి సీఎం జగన్ (CM Jagan) నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు దాటినా ఇంకా జగన్ చర్యలు తీసుకోలేదు. ఫోరెన్సిక్ దర్యాప్తు పేరుతో కాలయాపన చేశారు. ఫోరెన్సిక్ దర్యాప్తుపై వైసీపీ నోరు మెదపడం లేదు. రాసలీలల వీడియో నిజమేనంటూ ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. లోక్‌సభ (Lok Sabha) సభ్యత్వానికి రాజీనామా చేయించినా.. భవిష్యత్‌లో ఇతరులపైనా ఆరోపణలొస్తే ఇదే ఒరవడి కొనసాగించి.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందేమోనని భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన వర్గానికి చెందినందునే తనపై వీడియో లీక్‌ చేశారంటూ మాధవ్‌ ఇప్పటికే బీసీ కార్డు ప్రయోగించారు. ఇది ప్రతిపక్షాలపై కంటే.. వైసీపీపైనే బాగా ప్రభావం చూపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో కొందరు వైసీపీ నేతల వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తాయని.. బీసీ కాబట్టే ఇప్పుడు మాధవ్‌పై వేటు వేశారని అంతా భావిస్తారని.. ఇది రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. మాధవ్‌ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.


మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ వైసీపీలో అత్యంత కీలక పదవులు అనుభవిస్తున్న వారిపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఆడియోలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబటి రాంబాబు జరిపిన శృంగార సంభాషణలు సంచలనం సృష్టించాయి. సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ జరిగింది. ‘అది నా గొంతు కాదు’ అని అంబటి ఖండించారు. ఈ వివాదాన్ని పార్టీ పట్టించుకోలేదు. పైగా... ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చి సత్కరించింది. అందులోనూ... ఆయనకు కీలకమైన జల వనరుల శాఖను అప్పగించింది. దీంతో... వివాదాల్లో చిక్కుకున్న వారికి వైసీపీలో ‘మంచి పదవులు వస్తాయి’ అనే సంకేతాలు వెళ్లాయి. 


మంత్రి పదవిలో ఉండగా అవంతి శ్రీనివాస్‌పై ఆరోపణలు వచ్చాయి. తన వద్దకు రావాలంటూ ఒక మహిళను వేధించారంటూ సామాజిక మాధ్యమాల్లో  విస్తృత ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలనూ, ప్రచారాన్నీ ఆయన ఖండించారు. ‘‘ఇది నాపై జరిగిన కుట్ర. నా గొంతు మిమిక్రీ చేశారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తాను’’ అని హూంకరించారు. ఈ విషయాన్ని పార్టీ పట్టించుకోలేదు. సవాళ్లు విసిరిన అవంతి శ్రీనివాస్‌ కూడా ఆ తర్వాత చల్లగా ఆ విషయాన్ని మరిచిపోయారు. ఆపై జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనను పక్కన పెట్టారు. అంబటి, అవంతిలను పట్టించుకోని వైసీపీ అధిష్ఠానం ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న నటుడు పృథ్వీపై మాత్రం చర్యలు తీసుకుంది. వీరిద్దరి వ్యవహారంకంటే ముందే పృథ్వీపై ఆరోపణలు వచ్చాయి. ఆయనను చైర్మన్‌ పదవి నుంచి తప్పించేశారు. అప్పట్లో ఈ చర్యను రాజకీయ పక్షాలు స్వాగతించాయి. ప్రజలూ హర్షించారు. కానీ... ఆ తర్వాత అంబటి, అవంతిలను మాత్రం వైసీపీ అధిష్ఠానం కాపాడుకుంటూ వచ్చింది. పృథ్వీకి రాజకీయ అండదండలు లేకపోవడం వల్లే పూచిక పుల్లలా తీసిపారేశారని... వైసీపీలో బలమున్న వారికి ఒక రకం న్యాయం, బలహీనులకు మరో రకం న్యాయం అమలవుతుందని విమర్శలు వచ్చాయి.

Updated Date - 2022-08-09T00:59:53+05:30 IST