‘గొరక’రాని కొయ్య

ABN , First Publish Date - 2022-05-25T05:43:21+05:30 IST

‘గొరక’రాని కొయ్య

‘గొరక’రాని కొయ్య
గొరక చేపలతో దిగాలు పడుతున్న గుండెపూడి మత్స్యకారులు

నాటు చేపలకు చేటుగా గొరక చేపలు

సీడ్‌ చేపలను మింగుతున్న వైనం

ఆర్థికంగా నష్టపోతున్న మత్స్యకారులు 

జిల్లావ్యాప్తంగా రూ.కోట్లల్లో నష్టం

ప్రభుత్వం ఆదుకోవాలని వినతి


మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), మే 24: గొరక చేపలతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. నాటు చేపలకు చేటు చేస్తున్న గొరక చేపలతో ఆర్థికంగా నష్టపోతున్నారు. అసలే చేపల దిగుబడి అంతంతమాత్రం ఉన్న ఈ సమయంలో గొరక చేపలతో వేగలేకపోతున్నారు. దీంతో పెట్టుబడి రాక మత్స్యపారిశ్రామిక సొసైటీలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయని మత్స్యకార్మికులు కన్నీంటి పర్యంతం అవుతున్నారు. 


నాటు చేపలకు చేటు

గ్రామాల్లోని చెరువుల్లో మత్స్యకారులు కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు (సీడ్‌) కొనుగోలు చేసి పోస్తున్నారు. అయితే ఈ చేపలను గొరక చేపలు మింగేస్తున్నాయి. చెరువుల్లో పోసిన చేపలకు ముళ్ల నాసు, లొట్టపీసు చెట్లు, ఇతర వ్యర్థ పదార్థాలతో ముప్పు ఉండగా, ఇప్పుడు గొరక చేపలతో అవి కరువు అయ్యే ప్రమాదం ఏర్పడిందని ముదిరాజ్‌ కులస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల ద్వారా వచ్చే నీటితో గొరక చేపలు చెరువుల్లోకి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. ఈ చేపలు ఇతర చేపల గుడ్లు తినేసి వాటిని ఎదుగనివట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


రూ.కోట్లల్లో నష్టం 

గొరక చేపలతో జిల్లా వ్యాప్తంగా ముదిరాజ్‌ సొసైటీలకు ఈ యేడు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. జిల్లాలోని 16 మండలాల్లో 163 సొసైటీలు ఉండగా, అందులో 136పారిశ్రామిక సహకార సొసైటీలు, 11 మహిళ పారిశ్రామిక సొసైటీలు, 15 గిరిజన మత్స్యపారిశ్రామిక సొసైటీలు చొప్పున మొత్తం 163 సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 10,949 కుటుంబాలు వ్యాప్తం గా జీవనోపాధి పొందుతున్నారు. 1,148 చెరువులు, కుంటలు సొసైటీల కింద ఉన్నాయి. ప్రభుత్వం ఉచితంగా 4.24కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. దీంట్లో 2.11కోట్లు 30ఎంఎం నుంచి 40ఎంఎం, 2.13కోట్ల చేప సీడ్స్‌,  80ఎంఎం నుంచి 100ఎంఎం సైజ్‌ కలిగిన పిల్లలు ప్రభుత్వం ముదిరాజ్‌ సొసైటీలకు సరఫరా చేసింది. ఇవి కాక సొసైటీల తరపున ప్రతీ చెరువు, కుంటకు ఒక్కొక్క సొసైటీ వారు రూ.లక్ష విలువైన చేప (సీడ్స్‌) పిల్లలను ప్రైవేట్‌ మార్కెట్లో కోనుగోలు చేసి చెర్లల్లో వదిలారు.


పట్టేటోళ్ల కూలి గిట్టల్లే... : ఓర వీరన్న, గుండెపూడి సొసైటీ  అధ్యక్షుడు 

చెరువుల్లో చేపపిల్లలు పోసి కష్టపడి పెంచితే అసలు చేపలు బదులు గొరక చేపలు పడుతున్నాయి. ఇవి కొనేటోళ్లు లేక చెరువు కట్టల వద్ద క్వింటాళ్లకొద్దీ పారబోస్తున్నాం. గుండెపూడి పెద్ద చెరువులో రూ.2లక్షలు వెచ్చించి పోసిన చేపలను ఇవి మింగేశాయి. కచ్చు వలలతో చేపలు పట్టేటోళ్ల కూలి కూడా గిట్టడం లేదు. 


మత్స్యకారులను ఆదుకోవాలి : సూరబోయిన ఉప్పలయ్య, మరిపెడ మండల ముదిరాజ్‌ సంఘ బాధ్యుడు

అప్పులు తెచ్చి లక్షలకు లక్షలు పెట్టుబడి చేపలు పెంచితే గొరక చేపల వల్ల తీవ్రంగా నష్టపోయాం. మత్స్యకార పారిశ్రామిక సం ఘాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చెరువుల్లో ముళ్ల నాసు, లొట్టపీసు చెట్లను తొలగించి చేపల పెరుగుదల కు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.


జిల్లా వ్యాప్తంగా భారీగా నష్టం : గొడుగు శ్రీనివాస్‌, ముదిరాజ్‌ మహసభ రాష్ట్ర కార్యదర్శి

గొరక చేపల వల్ల జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. తొర్రూరు మండలం వెలికట్టె, కేసముద్రం మండలం ఇనుగుర్తి, చిన్నగూడూరు మండలం జయ్యారం, మరిపెడ మండలం ఎల్లంపేట, చిల్లంచర్ల, కురవి మండలం నేరడ, తట్టుపల్లి తదతర గ్రామాల మత్స్యకారులకు తీరని నష్టం జరిగింది. మత్స్య సంపద రక్షణకు  ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి.


అరికట్టడం అసాధ్యం : నాగమణి, జిల్లా మత్స్యశాఖ సంక్షేమ అధికారి

గొరక చేపలను అరికట్టడం అసాధ్యం. చెరువులోని నీరు మొత్తం ఇంకిన తర్వాతనే వీటిని వేరేయాలి. మత్స్యకారులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి కట్టడికి జిల్లా మత్స్యశాఖ తగు సూచనలు, సలహాలు ఇస్తోంది. 



Updated Date - 2022-05-25T05:43:21+05:30 IST