చిత్రం: సీటీమార్
విడుదల తేదీ: 10, సెప్టెంబర్ 2021
నటీనటులు: గోపీచంద్, తమన్నా, దిగంగన సూర్యవంశీ, భూమిక, రావు రమేష్, తరుణ్ అరోరా తదితరులు
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: తమ్మిరాజు
కెమెరా: ఎస్. సౌందర్ రాజన్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి సినిమాలైతే వస్తున్నాయి కానీ.. గట్టిగా హిట్టు సౌండ్ మాత్రం వినబడటం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులని థియేటర్లకి రప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి. మంచి మాస్ సినిమా పడితేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ఇది అలాంటి చిత్రమే అని ‘సీటీమార్’ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతూ వస్తున్నారు. హీరో గోపీచంద్ కూడా ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూస్తూనే మజా వస్తుందనే.. థియేటర్లలో విడుదల చేస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులని థియేటర్లకు రప్పిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ ఎంత వరకు నిజమైంది? థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈ సినిమా సీటీలు కొట్టిస్తుందా? వినాయక చవితి పర్వదినాన వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యిందో మన రివ్యూలో చూద్దాం.
కథ:
కార్తీక్ (గోపీచంద్) ఆంధ్ర మహిళల కబడ్డీ టీమ్ కోచ్. ఊరిలో తన తండ్రి స్థాపించిన స్కూల్‌కి ఓ సమస్య వస్తుంది. తన కబడ్డీ టీమ్‌ని జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, తద్వారా ఆ ఊరి స్కూల్ సమస్యను పరిష్కరించాలనే ఆశయంతో ఉన్న కార్తీక్ ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఊరిలో ఉన్న రాజకీయ నాయకులే కాకుండా, ఢిల్లీలో పోలీసు ఆఫీసర్‌గా ఉన్న మాకన్‌సింగ్(తరుణ్ అరోరా) తన దారికి ఎందుకు అడ్డుపడ్డారు? తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలారెడ్డి(తమన్నా).. కార్తీక్ ఆశయానికి ఏ విధంగా హెల్ప్ చేసింది? చివరికి కార్తీక్ తన టీమ్‌ని గెలిపించాడా? ఊరి స్కూల్ సమస్యను తీర్చాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘సీటీమార్’ సినిమా విషయానికి వస్తే.. కబడ్డీ నేపథ్యంలో పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఊరి స్కూల్ సమస్య అనగానే రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రం, ఇంద్రగంటి తెరకెక్కించిన ‘గోల్కోండ హైస్కూల్’ వంటి సినిమాలు గుర్తుకు రావడం సహజమే. అయితే రాజమౌళి సమస్యను హైలెట్ చేస్తూ ఆటకి లింక్ పెట్టి ప్రేక్షకులని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయిస్తే.. ఇంద్రగంటి ఇష్యూనే హైలెట్ చేస్తూ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘సీటీమార్’ సంగతికి వస్తే.. ఎంచుకున్న కబడ్డీ క్రీడను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా.. సంపత్ నంది ఆ దిశగా అడుగులు వేయకుండా.. తన ల్యాండ్ మార్క్ అయిన కమర్షియల్ పంథాలోనే చిత్రాన్ని నడిపించాడు. ఒక దశలో ఈ చిత్రానికి క్రీడా నేపథ్యం అవసరమే లేదు అని ప్రేక్షకులు అనుకునేలా కూడా సినిమా నడిచింది. ‘విజిల్’ సినిమా తరహాలో అమ్మాయిలను హైలెట్ చేయాలనేలా హీరోతో భారీ డైలాగులైతే చెప్పించారు కానీ.. ఆ సినిమాలో ‘ఆట’కి ఇచ్చిన ప్రాధాన్యత పరంగా చూస్తే మాత్రం ఇందులో అంతంత మాత్రమే. ఫస్టాఫ్ రావు రమేష్ కామెడీతో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో నడిచిన ఈ చిత్రం.. సెకండాఫ్‌కి వచ్చేసరికి కిడ్నాప్ అయిన క్రీడాకారుల్ని హీరో ఎలా కనిపెట్టాడు? అనే దానిపైనే ఫోకస్ చేశారు. అయితే అది కూడా అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అనిపించదు.. కానీ బోర్ కొట్టదు. కాకపోతే ఏం జరుగుతుందనే విషయం ముందుగానే ప్రేక్షకులకి అర్థమైపోతుంది. క్లైమాక్స్‌లో కొత్తదనం ఏమీ లేకపోయినా.. భారీతనం మాత్రం బాగా కనిపించింది. గోపీచంద్ నటన విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. గోపీచంద్ అనగానే అంతా అరుపులు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు.. కానీ ఈ సినిమాలో గోపీచంద్‌తో దర్శకుడు మంచి మంచి డైలాగులు చెప్పించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో గోపీచంద్ విజృంభించాడు. తెలంగాణ యాసలో తమన్నా డైలాగ్స్ చెబుతుంటే బాగుంది. ఆమె పాత్రకు తమన్నా పూర్తి న్యాయం చేసింది. ఎంటర్టైన్మెంట్ వే లో రావు రమేష్ పాత్ర హైలెట్‌గా ఉంది. భూమిక, రెహ్మన్, దిగంగన వంటి వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా తరుణ్ అరోరాని మరీ భయానకంగా చూపించారు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా ఓకే. కబడ్డీ టీమ్‌లలో ఉన్న అమ్మాయిలు కూడా వారి పరిధిమేర చక్కగా నటించారు. మూడు పాటలు బాగున్నాయి. మణిశర్మ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఈ చిత్రానికి హైలెట్. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా చిత్రీకరణలో కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడు సంపత్ నంది.. తన దారిలో వెళుతూనే క్రీడా నేపథ్యాన్ని మిళితం చేశాడు. దీనికి నిజాయితీ ఆఫీసర్లకు ఉండే కష్టాలు, స్కూల్ సమస్య వంటి వాటితో ముడిపెట్టి కథను నడిపించాడు. కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది. ప్రేక్షకులని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే విధంగా ఇంకొన్ని సీన్లు ఉంటే ఈ సినిమా రూపురేఖలు మారిపోయి.. చూసిన ప్రతి ఒక్కరూ సీటీలూ కొట్టేవారు. అయినా కూర్చున్న ప్రేక్షకులు లేచి సీటీలు కొట్టేలా కొన్ని సీన్లు బాగానే పండాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ అటువంటివే. ఓవరాల్‌గా పండగ టైమ్‌లో ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయితే చూడాలని అనుకుంటారో.. అలాంటి సినిమానే ఇది. కాకపోతే అన్నివర్గాల ప్రేక్షకులకు కాకుండా కొందరినే టార్గెట్ చేసినట్లుగా అక్కడక్కడా అనిపిస్తుంది.
బోటమ్ లైన్: బొమ్మ.. మాసమ్మా!