వొడాఫోన్ ఐడియాపై గూగుల్ నజర్

ABN , First Publish Date - 2020-05-29T06:25:34+05:30 IST

భారత మార్కెట్‌పై పట్టు కోసం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ వం టి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు తహతహలాడుతున్నాయి. మన దేశంలో వాటి సేవలను విస్తరించడంతోపాటు ఇతర టెక్నాలజీ వ్యాపారాల్లోకీ ప్రవేశించేందుకు...

వొడాఫోన్ ఐడియాపై గూగుల్ నజర్

భారత మార్కెట్‌పై పట్టు కోసం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ వం టి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు తహతహలాడుతున్నాయి. మన దేశంలో వాటి సేవలను విస్తరించడంతోపాటు ఇతర టెక్నాలజీ వ్యాపారాల్లోకీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా దేశీ టెలికాం కంపెనీల్లో వాటాల కొనుగోలుపై దృష్టి సారించాయి. రిలయన్స్‌ జియో మాతృసంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఫేస్‌బుక్‌ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌  సైతం  వాటాల కొనుగోలు వేటలో ఉన్నాయి.


ఇంటర్నెట్‌ సేవల దిగ్గజం గూగుల్‌ త్వరలో  టెలికాం సేవల్లోకి ప్రవేశించబోతున్నట్లు సమాచారం. దేశీయ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్ల్లు తెలిసింది. ప్రస్తుతానికైతే ఇరు వర్గాలూ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ పీఎల్‌సీకి చెందిన వొడాఫోన్‌ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ ఐడియా సెల్యులార్‌ విలీనం ద్వారా వొడాఫోన్‌ ఐడియా ఏర్పాటైంది. వాటా విక్రయానికి సంబంధించి వొడా ఐడియా ప్రమోటర్లు, గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు మధ్య ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గూగుల్‌ కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ, ఫేస్‌బుక్‌ సహా బడా ఇన్వెస్టర్లు జియోలో వాటాలు చేజిక్కించుకున్నాయి. దాంతో గూగుల్‌.. వొడాఫోన్‌ ఐడియాలో వాటాపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.



 


భలే చౌక బేరం!

జియోతో పోలిస్తే వొడా ఐడియా మార్కెట్‌ విలువ చాలా తక్కువ. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌ మార్కెట్‌ విలువ రూ.4.87 లక్షల కోట్లు కాగా.. వొడాఫోన్‌ ఐడియా విలువ రూ.16,724 కోట్లు. దాంతో గూగుల్‌కు ‘వొడా’లో వాటా చాలా చౌకగా లభించనుంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా అప్పుల భారం, నిధుల కొరతతో తీవ్రంగా సతమతం అవుతోంది. ఇందుకు తోడు, సుప్రీంకోర్టు తీర్పుతో రూ.58,000 కోట్ల ఏజీఆర్‌ బకాయిల భారం నెత్తిన పడింది. ఇలాంటి సమయంలో గూగుల్‌తో డీల్‌.. కంపెనీ పాలిట సంజీవని కానుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్‌లో గూగుల్‌ ఈ కంపెనీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకూ అవకాశాలుంటాయని వారు అభిప్రాయపడ్డారు. రిలయన్స్‌ జియోతో పాటు అందులో పెట్టుబడులు కలిగిన ఫేస్‌బుక్‌కు ఈ డీల్‌ ద్వారా గూగుల్‌ గట్టిపోటీ ఇవ్వాలనుకుంటోంది.




జియోలో మైక్రోసాఫ్ట్‌లో పెట్టుబడులు?


ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.5 శాతం వాటాను 200 కోట్ల డాలర్లకు (రూ.15,000 కోట్ల పైమాటే) దక్కించుకునే అవకాశం ఉంది. ఈ డీల్‌ గనుక ఖరారైతే, జియో ప్లాట్‌ఫామ్‌లోకి రానున్న ఆరో పెట్టుబడి కానుంది. కంపెనీలో 10 శాతం వాటా కోసం రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ గత నెల 21న ప్రకటించింది. గడిచిన నెల రోజులకు పైగా కాలంలో మరో 4 కంపెనీలు వాటాలు కొనుగోలు చేశాయి. సిల్వర్‌ లేక్‌ 1.15 శాతం, విస్టా ఈక్విటీ 2.23 శాతం, జనరల్‌ అట్లాంటిక్‌ 1.34 శాతం, ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌ కేకేఆర్‌ 2.23 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. తాజాగా మైక్రోసా్‌ఫ్టతోపాటు అబుదాబీ ప్రభుత్వానికి చెందిన ‘ముబదాలా ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ’తోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. జియోలో ముబదాలా 100 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టవచ్చని సమాచారం. 


జియో ఐపీఓకు దోహదం

వచ్చే 1-2 ఏళ్లలో రిలయన్స్‌ జియోను అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ‘నాస్‌డాక్‌’లో లిస్ట్‌ చేయాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ పెట్టుబడులు కలిగి ఉన్న కంపెనీలో మైక్రోసాఫ్ట్‌ కూడా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంది. రిలయన్స్‌ జియో విదేశీ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు ఇది బాగా కలిసిరానుందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. అంతేకాదు, మైక్రోసాఫ్ట్‌ ఈ డీల్‌ ద్వారా అమెరికన్‌ కంపెనీలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌, గూగుల్‌కు పరోక్షంగా పోటీనివ్వాలనుకుంటోంది. 


మైక్రోసా్‌ఫ్టతో ఇదివరకే భాగస్వామ్యం 

మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘అజుర్‌’కు చెందిన దేశీయ సర్వర్లలో రిలయన్స్‌ జియో డేటా హోస్టింగ్‌ కోసం ఇరు సంస్థల మధ్య 2019 ఆగస్టులోనే భాగస్వామ్యం కుదిరింది. 

Updated Date - 2020-05-29T06:25:34+05:30 IST