కొంపముంచిన గూగుల్‌ సెర్చ్‌!

ABN , First Publish Date - 2021-03-07T13:15:10+05:30 IST

ఆర్డర్‌ డెలివరీ ఆలస్యం కావడంతో గూగుల్‌లోకి వెళ్లి అమెజాన్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ కోసం...

కొంపముంచిన గూగుల్‌ సెర్చ్‌!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువు ఆర్డర్‌ చేసింది. అయితే సదరు ఆర్డర్‌ డెలివరీ ఆలస్యం కావడంతో గూగుల్‌లోకి వెళ్లి అమెజాన్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ కోసం వెతికింది. అందులో ఒక నెంబర్‌ కనిపించడంతో వెంటనే కాల్‌ చేసి తన ఆర్డర్‌ వివరాలు చెప్పింది. కొద్దిసేపు తర్వాత మహిళకు తిరిగి కాల్‌ చేసిన అవతలి వ్యక్తి తాను అమెజాన్‌ ప్రతినిధిని అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆర్డర్‌ ట్రాక్‌ చేశామని, అయితే సదరు వస్తువు స్టాక్‌ లేకపోవడంతోనే ఆలస్యమైందని తెలిపాడు. 


ఆర్డర్‌ను రద్దుచేసి, ఆమె చెల్లించిన డబ్బును తిరిగి చెల్లిస్తామని మహిళకు చెప్పాడు. మహిళ ఫోన్‌కు ఒక క్యూఆర్‌ కోడ్‌ వస్తుందని, అది క్లిక్‌చేసి స్కాన్‌చేస్తే డబ్బులు మహిళ బ్యాంక్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయని నమ్మబలికాడు. అతడు చెప్పినట్లే ఫోన్‌కు వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను క్లిక్‌ చేయడంతో మహిళ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.3.10లక్షలు డెబిట్‌ అయ్యాయి. ఆమె వెంటనే సదరు ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయడంతో స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన మహిళ శనివారం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2021-03-07T13:15:10+05:30 IST