గూగుల్ పేలో స‌రికొత్త సౌక‌ర్యం.. ఇక‌పై అమెరికా నుంచి భార‌త్‌కు డబ్బు పంపుకోవ‌చ్చు

ABN , First Publish Date - 2021-05-12T20:05:02+05:30 IST

గూగుల్ పే తన అమెరికా వినియోగ‌దారుల కోసం స‌రికొత్త సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

గూగుల్ పేలో స‌రికొత్త సౌక‌ర్యం.. ఇక‌పై అమెరికా నుంచి భార‌త్‌కు డబ్బు పంపుకోవ‌చ్చు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: గూగుల్ పే తన అమెరికా వినియోగ‌దారుల కోసం స‌రికొత్త సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు ఇకపై అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది. ఈ మేర‌కు వినియోగ‌దారుల‌కు ఈ స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు టెక్‌క్రంచ్ మొద‌ట ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.


అనంత‌రం గూగుల్ పే కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది. అంతేగాక‌ ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్‌తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపే సౌక‌ర్యం కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గూగుల్ పే పేర్కొంది.


ఇది ఎలా ప‌ని చేస్తుందంటే..

మొద‌ట అమెరికాలోని వినియోగ‌దారులు ఎవ‌రికైతే డ‌బ్బులు పంపించాలో కాంటాక్ట్ లిస్ట్ ద్వారా వారిని సెల‌క్ట్ చేసుకోవాలి. అనంత‌రం త‌మ వాళ్ల‌కు న‌గ‌దు పంపించేట‌ప్పుడు ఏ సర్వీసు ద్వారా డబ్బులు పంపించాల‌ని గూగుల్ పే అడుగుతుంది. అంటే వెస్ట్రన్‌ యూనియన్‌ లేక వైజ్‌ నుంచి అనేది ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత ఎమౌంట్ ఎంట‌ర్ చేసి, మిగ‌తా ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇక‌ న‌గ‌దు బ‌దిలీ త‌ర్వాత‌ వచ్చే రిసిప్ట్‌లో ఈ వివరాలను పొందుపరుస్తారు. దాని వల్ల తర్వాత ఎప్పుడైనా ట్రాక్ చేయ‌డం చాలా సులువు అవుతుంది. ఇక‌పోతే గూగుల్‌ పే నుంచి వెస్ట్రన్‌ యూనియన్‌ ద్వారా డబ్బులు పంపిస్తే ఎలాంటి అదనపు రుసుము, ట్రాన్స్‌ఫర్‌ ఫీజులు ఉండవు. అయితే వైజ్‌ నుండి డబ్బులు పంపిస్తే ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేటు, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు ప‌డ‌తాయి. అయితే ఇది ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటుంది. 

Updated Date - 2021-05-12T20:05:02+05:30 IST