Google doodle: అది.. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించిన డైరీ..దాన్ని రాసింది ఓ టీనేజ్ బాలిక..!

ABN , First Publish Date - 2022-06-26T01:58:02+05:30 IST

ఆ అమూల్య ఘడియల్ని గుర్తు చేసుకుంటూ గూగుల్.. ఆనీ డైరీలోని విశేషాలతో ఓ డూడుల్ విడుదల చేసింది.

Google doodle: అది.. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించిన డైరీ..దాన్ని రాసింది ఓ టీనేజ్ బాలిక..!


ఎన్నారై డెస్క్: జర్మనీ నియంత హిట్లర్ యూదులపై సాగించిన దమనకాండను(Holocaust) కళ్లకు కట్టినట్టు చూపించింది ఆన్నీ ఫ్రాంక్(Anne Frank) డైరీ! హిట్లర్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆన్నీ ఫ్రాంక్ అనే టీనేజ్ బాలిక తాను, తన కుటుంబసభ్యులు అనుభవించిన కష్టాలను తన డైరీలో రాసుకుంది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఆ డైరీ 75 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజునే తొలిసారిగా ప్రచురితమైంది. ఆ అమూల్య ఘడియల్ని గుర్తు చేసుకుంటూ గూగుల్.. ఆనీ డైరీలోని విశేషాలతో ఓ డూడుల్ విడుదల చేసింది. ప్రజల మనసులకు చేరువైన పుస్తకంగా ఆ డైరీకి సాహిత్య ప్రపంచంలో ఓ అరుదైన గుర్తింపు ఉంది. తన చరిత్రను సమాజం ఎన్నటికీ మర్చిపోకూడదన్న లక్ష్యంతో గూగుల్ డూడుల్ ఆర్ట్ డైరెక్టర్ ఆనీ ఫ్రాంక్  డైరీలోని విశేషాలతో ఈ డూడుల్‌ను సృష్టించారు. 


ఆన్నీ ఫ్రాంక్ జీవనం ప్రయాణం సాగిందిలా.. 

1929 జూన్ 12న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఆన్నీ ఫ్రాంక్ జన్మించింది. ఆ తరువాత కొన్నేళ్లకే హిట్లర్ సైన్యం దౌర్జన్యాల నుంచి తప్పించుకునేందుకు ఆమె కుటుంబం జర్మనీని వీడి నెదర్‌ల్యాండ్స్‌కు వెళ్లింది. కానీ.. అక్కడ కూడా వారికి హిట్లర్ పీడ తప్పలేదు. నాజీ సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఆన్నీ, ఆమె కుటుంబసభ్యులు ఎవరికీ కనబడకుండా దాక్కునే వారు. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను ఆన్నీ ఓ డైరీలో రాసుకొచ్చింది. దానికి ఆమె ‘‘ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్’’ అని పేరు పెట్టుకుంది. అయితే..కాలక్రమంలో ఆ డైరీ, సాహిత్య ప్రపంచంలో తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 67 భాషల్లోకి అనువాదమైన ఆ డైరీ ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుపోయింది. ఆనీ ఫ్రాంక్ రాసుకున్న అనేక విషయాలు ఇప్పటికూ ఏదోక సందర్భంలో ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఆమె తన మనసులోని మాటకు డైరీలో అక్షర రూపం ఇస్తూ.. ‘‘నాకు పధ్నాలుగేళ్లే కావచ్చు గానీ.. నాకు కావాల్సిందేంటో నాకు బాగా తెలుసు. మంచి ఏదో చెడు ఏదో నేను అర్థం చేసుకోగలను. నా కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఓ చిన్నారి ఇలా అంటోందేంటి అని మీకు అనిపించవచ్చు. కానీ నేను ఓ చిన్నపిల్లలాగా కాకుండా పూర్తిస్థాయిలో ఎదిగిన వ్యక్తిగా భావిస్తున్నాను. ఎవరి సాయంలేకుండా స్వతంత్రగా జీవించగలనన్న నమ్మకం నాకుంది’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక 1944 ఆగస్టులో ఆన్నీ ఫ్రాంక్ కుటుంబం జర్మనీ నిఘా అధికారులకు చిక్కింది. అధికారులను వారిని నరకప్రాయమైన కాన్సంట్రేషన్ క్యాంపులకు(జైళ్లు) తరిలించారు. ఆ తరువాత కొద్ది నెలలకే ఆనీ, ఆమె సోదరి మార్గాట్ ఫ్రాంక్ మరణించారు. 




Updated Date - 2022-06-26T01:58:02+05:30 IST