Google: సుందర్ పిచాయ్‌పై గూగుల్ ఉద్యోగుల ప్రశ్నల వర్షం.. సంస్థ లాభాల్లో ఉంది.. అయినా ఎందుకిలా..

ABN , First Publish Date - 2022-09-26T02:02:36+05:30 IST

సుందర్ పిచాయ్‌పై గూగుల్ ఉద్యోగుల ప్రశ్నల వర్షం.. సంస్థ లాభాల్లో ఉంది.. అయినా ఎందుకిలా..

Google: సుందర్ పిచాయ్‌పై గూగుల్ ఉద్యోగుల ప్రశ్నల వర్షం.. సంస్థ లాభాల్లో ఉంది.. అయినా ఎందుకిలా..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగిస్తోందన్న అంచనాల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్(Google) ఖర్చులు తగ్గించుకునేందుకు వివిధ చర్యలు చేపడుతోంది. కొత్త నియామకాల విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తోంది. మునుపటి లాగా కొత్తవారిని నియమించుకునేది లేదని సంస్థ సీఈఓ సుందార్ పిచాయ్(Sundar Pichai) గతంలోనే ప్రకటించారు. 


ముఖ్యంగా ఉద్యోగుల పర్యటనలపై పెట్టే ఖర్చులు, వారి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసే వ్యయాలకు గూగుల్ కత్తెర వేస్తోంది(Cost cutting). ఇక ఉద్యోగుల ఉత్పాదకత(Productivity) పెంచేందుకు చేపడుతున్న చర్యలు, త్వరలో ఉద్యోగులను తొలగిస్తారన్న(Potential lay-offs) వార్తలు కూడా ఉద్యోగుల్లో ఆందోళన రేపుతున్నాయి. దీంతో.. ఉద్యోగులందరూ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. సంస్థ లాభాల్లోనే ఉన్నప్పుడు.. పర్యటనలు, ఎంటర్‌టైన్‌మెంట్‌పై పెట్టే ఖర్చుల్లోనూ కోత పెట్టాలా అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు. 


దీంతో.. వారి సందేహాలను నివృత్తి చేసేందుకు సుందర్ పిచాయ్ సవివరమైన సమాధానం చెప్పారు. ‘‘మీరు వార్తలు చదువుతున్నారనే అనుకుంటున్నా. గత పదేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు సంభవిస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో గూగుల్ బాధ్యతాయుత వైఖరి అవలంభిస్తోంది. ఇందులోంచి బయటపడేందుకు మనందరం కలిసికట్టుగా వ్యవహరించాలి. నాకు గూగుల్ చిన్న సంస్థగా ఉన్నప్పటి పరిస్థితులు తెలుసు. అప్పట్లో ఉద్యోగంలో ఫన్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మీరు ఏ స్టార్టప్ సంస్థకు వెళ్లిచూసినా అక్కడ ఉద్యోగులు కష్టించి పనిచేస్తున్నా కూడా సంతోషంగానే కనిపిస్తారు. అక్కడ డబ్బు ఉండదు కానీ  ఉద్యోగులు తమ పనిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. కాబట్టి.. అన్నీ డబ్బుతో ముడిపెట్టకూడదు. సంస్థ అభివృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. మీ టీంలలో అదనపు ఉద్యోగుల అవసరం ఉండొచ్చు. దీంతో.. మరో ఆరుగురిని నియమించుకోవాలని టీం లీడర్లు భావిస్తూ ఉండొచ్చు. కానీ.. ఆరుగురి బదులు నలుగురికే ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి.. వివిధ స్థాయిల్లో ఉండే ఉద్యోగులందరూ తమ వంతు కృషి చేయాలి’’ అని ఆయన వివరించారు.

Updated Date - 2022-09-26T02:02:36+05:30 IST