గుడ్‌విల్‌ ఇస్తేనే లైసెన్స్‌

ABN , First Publish Date - 2022-01-05T06:03:57+05:30 IST

మద్యం నూతన పాలసీ ప్రకారం దుకాణాల కేటాయింపు, వాటి ప్రారంభం, మద్యం విక్రయాలు మొదలై నెలరోజులైనా ఎక్సైజ్‌శాఖ అధికారులు కొందరికి లైసెన్సులు నేటికీ జారీ చేయలేదు. వాస్తవానికి మద్యం దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే లైసెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

గుడ్‌విల్‌ ఇస్తేనే లైసెన్స్‌

ముడుపులివ్వని వారికి నిలిపివేత

ఇప్పటికే డబ్బుమూటను సిద్ధం చేసిన సిండికేట్లు

నేడో, రేపో ముట్టజెప్పేందుకు సన్నాహాలు

ఇదీ ఆబ్కారీశాఖలో అవినీతి కహానీ


నల్లగొండ/రామగిరి, జనవరి 4: మద్యం నూతన పాలసీ ప్రకారం దుకాణాల కేటాయింపు, వాటి ప్రారంభం, మద్యం విక్రయాలు మొదలై నెలరోజులైనా ఎక్సైజ్‌శాఖ అధికారులు కొందరికి లైసెన్సులు నేటికీ జారీ చేయలేదు. వాస్తవానికి మద్యం దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే లైసెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉండగా, అందులో 60శాతానికి పైగా దుకాణాలకు లైసెన్సులు ఇవ్వలేదు. దీనికి మద్యం సిండికేట్‌దారుల నుంచి అధికారులకు గుడ్‌విల్‌ ముట్టకపోవడమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు

జిల్లా కేంద్రంలో ఉన్న మద్యం దుకాణాదారుల నుంచి ఓ ఆబ్కారి అధికారికి రూ.1.10లక్షలను వసూలు చేసి నేడో రేపో అప్పగించేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం. లైసెన్స్‌ ఇవ్వాలంటే గుడ్‌విల్‌ ముట్టజెప్పాల్సిందేనని అధికారు లు కరాఖండిగా చెప్పడంతో దుకాణదారులు ఏం చేయలేకపోతున్నారు. రూ.50లక్షల వరకు దుకాణాల కోసం ఖర్చు చేసినవారు. రూ.1.10లక్షలు ఇవ్వలేరా అంటూ ముక్కుపిం డి వసూలు చేసినట్టు తెలిసింది. హాలియా, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్‌, చండూరు, నాంపల్లి వంటి ప్రాంతా ల్లో రూ.2లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. 


ఆ సారుకు సెప‘రేటు’

జిల్లా కేంద్రంలోని ఎక్సై జ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సారు మాత్రం తనకు సెప‘రేటు’ ఇవ్వాలని హుకూం జారీచేశా రు. ఆఫీసులో ఎంతైనా ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో దుకాణాదారులు ఎంతో కొంత ముట్టజెబుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈఎస్‌ కార్యాలయం నుంచిలైసెన్స్‌ తీసుకోవాలంటే రూ.50వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తోందని ఓ దుకాణాదారుడు వాపోయాడు.


నెలవారీ మామూళ్లు సరేసరి

లైసెన్స్‌కు ముక్కుపిండిన వసూలు చేసిన అధికారులు నెలవారీగా మామూళ్లను సైతం ఫిక్స్‌ చేసినట్టు వినికిడి. ఎక్సైజ్‌శాఖకు రూ.16వేలు, పోలీ్‌సశాఖకు రూ.15వేలు ప్రతీ నెల ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పినట్లు సమాచారం. పండుగలు, ఇతర సందర్భాల్లో మామూళ్లు వేరుగా ఉంటాయని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికే లక్షల్లో అప్పు తెచ్చి దుకాణాలు ప్రారంభిస్తే ఇదేంటని మద్యం దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వసూళ్ల విషయం దృష్టికి రాలేదు : వై.హిమశ్రీ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

దుకాణాలకు లైసెన్సు ఇవ్వడం ఇప్పటికే దాదాపు పూర్తయింది.  లైసెన్స్‌ మంజూరులో గుడ్‌విల్‌గా వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. మామూళ్ల విషయంపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2022-01-05T06:03:57+05:30 IST