Abn logo
Mar 27 2020 @ 03:13AM

సరుకు రవాణాకు హై పవర్‌ కమిటీ

  • మార్కెటింగ్‌ కార్యదర్శి నేతృత్వం
  • సభ్యులుగా డీజీపీ, నలుగురు కమిషనర్లు, ముగ్గురు ఎండీలు
  • సామాజిక దూరం పాటించేందుకు డోర్‌ డెలివరీ
  • 23 రకాల నిత్యావసరాలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ 

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): సరుకు రవాణాకు హై పవర్‌ కమిటీ, ధరల పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందిలేకుండా చూసేందుకు రాష్ట్రప్రభుత్వం ఒక హైపవర్‌ కమిటీని నియమించింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ కాలంలో సామాజిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. గత మూడు రోజుల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం జనం ఎగబడ్డారు. పైగా లాక్‌డౌన్‌తో సరుకు రవాణా నిలిచిపోవడంతో వాటి ధరలను వ్యాపారులు ఆమాంతం పెంచేశారు. జనం గుంపులుగుంపులుగా వచ్చేయడంతో కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, కిరాణా దుకాణాల వద్ద తీవ్ర రద్ధీ ఏర్పడింది. సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, మరోవైపు ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్న తీరుపై ‘ఆంధ్రజ్యోతి’.. గురువారం ‘ఆత్రంతో అనర్థం’ అని ప్రచురించిన ప్రత్యేక కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా డీజీపీ, పౌరసరఫరాలు, రవాణా, అగ్రికల్చర్‌మార్కెటింగ్‌, హార్టికల్చర్‌ కమిషనర్లు, డ్రగ్స్‌ అండ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌, కోఆపరేటివ్‌ డెయిరీస్‌ ఎండీ ఉన్నారు. కాగా.. గొలుసు కట్టుగా జనం క్యూలు పెట్టకుండా, రద్ధీ లేకుండా సామాజిక దూరం పాటించేందుకు డోర్‌ డెలివరీని ప్రోత్సహించాలని సర్కారు నిర్ధేశించింది. జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్లు నేతృత్వంలో మున్సిపల్‌ కమిషనర్లు, అదనపు ఎస్పీలు, ఇతర శాఖల జిల్లా అధికారుల బృందం నిత్యావసరాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


సర్కారు గుర్తించిన నిత్యావసరాలివే!

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం కొన్ని సరుకులు/వస్తువులను నిత్యావసరాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాగునీరు, కూరగాయలు, పండ్లు, పాలు, బియ్యం, కోడిగుడ్లు, చికెన్‌, మాంసం, చేపలు, పచారీ సామగ్రి, పశువుల దాణా, ఆక్వా ఫీడింగ్‌, రొట్టెలు, బిస్కెట్లు, మెడికల్‌ షాపులు, మాస్కులు, శానిటైజర్లు, మనుషుల వైద్యం, పశువైద్య సేవలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, బియ్యం, పప్పుధాన్యాలు, నూనెలు,.  పౌరసరఫరాల దుకాణాలు, ఆహార ధాన్యాల ఎగుమతులు, గోడౌన్లు, ఇంటర్నెట్‌, టెలికం సర్వీసులు, పోస్టల్‌, బ్యాంకులు, ఏటీఎంలు, బీమా కంపెనీలు.. ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు, డెలివరీ ఫుడ్స్‌ కింద స్విగ్గీ, జొమాటో వంటి ఆహార సరఫరా సంస్థల వంటి 23రకాలను నిత్యావసరాలుగా ప్రకటించింది.


Advertisement
Advertisement
Advertisement