చీకటిలో గూడేలు

ABN , First Publish Date - 2022-05-14T05:02:42+05:30 IST

నల్లమలలో చెంచులు చీకట్లో బతుకుతున్నారు. గూడేలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో లైట్లు వెలగడం లేదు.

చీకటిలో గూడేలు
విద్యుత్‌ సరఫరాకు నోచుకోని కృష్ణాతీరంలోని జానాల చెంచుగూడెం

విద్యుత్‌ సరఫరా లేక ఇక్కట్లలో చెంచులు  

అభివృద్ధిపట్ల శ్రద్ధ చూపని పాలకులు 

ఐటీడీఏ పని తీరుపట్ల అసంతృప్తులు


నల్లమలలో చెంచులు చీకట్లో బతుకుతున్నారు. గూడేలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో లైట్లు వెలగడం లేదు. చెంచుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఐటీడీఏ పని చేస్తున్నా వారి  కష్టాలు తీరడం లేదు. కరెంట్‌ లేక చెంచులు గూడేల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొన్ని గూడేల్లో ఐటీడీఏ అధికారులు సోలార్‌ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి వల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. 1985లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న మజరా గ్రామాలు, చెంచుగూడేలను అభివృద్ధి చేయాలి. అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం చెంచుగూడేల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులన్నింటినీ గ్రామాల అభివృద్ధికే కేటాయించడంతో గిరిజన గూడేల పరిస్థితి అధ్వానంగా మారింది. నల్లమలలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలకు 40శాతం వరకు విద్యుత్‌ అందుతోంది. కానీ ఆ పక్కనే ఉన్న గూడేల్లో చిరు వెలుగులు కూడా కరువయ్యాయి. నేటికి జిల్లాలోని ఆరు చెంచుగూడేలకు విద్యుత్‌ సరఫరా లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

-ఆత్మకూరు


చెంచు గూడేలకు విద్యుత్‌ కరువు 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమలలో సుమారు 17 గ్రామ పంచాయతీల పరిధిలో  దాదాపు 50గూడేలకు విద్యుత్‌ సరఫరా లేదు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోనే పెచ్చెర్వు, జానాల, చదరం పెంట, బలపాలతిప్ప, చీమలతిప్ప, సిద్ధ్దేశ్వరం చెంచు గూడేలకు విద్యుత్‌ సదుపాయం లేదు. అలాగే నాగలూటి గూడేనికి విద్యుత్‌ సరఫరా వున్నప్పటికీ చెంచులకు దాని వల్ల అంతంత మాత్రమే ప్రయోజనం ఉంది. 18 ఏళ్ల క్రితం కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం గూడేనికి కపిలేశ్వరం గ్రామం నుంచి విద్యుత్‌ సరఫరా చేసేందుకు అధికారులు స్తంభాలు ఏర్పాటు చేశారు. అయితే అటవీశాఖ అభ్యంతరాలతో ఆ పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో గూడేలకు విద్యుత్‌ సరఫరా ప్రక్రియ ముందుకు సాగలేదు. 


సాంకేతిక పరిజ్ఞానం మాటలకేనా..? 


విద్యుత్‌ సరఫరాకు నోచుకోని పెచ్చెర్వు, చీమల తిప్ప గూడేల్లో సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసి పుష్కలంగా విద్యుత్‌ను అందించవచ్చు. 2013లో అప్పటి కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి జానాల, సిద్ధేశ్వరం గూడేల్లో సోలార్‌ వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. అయితే అవి కొద్ది కాలమే పని చేశాయి. ప్రస్తుతం సిద్ధ్దేశ్వరం, బలపాలతిప్ప, జానాల చెంచు గూడేలకు రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ దారి వెంట విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి గూడేలకు విద్యుత్‌ సరఫరా చేయడానికి అవకాశం ఉంది. శ్రీశైలం ఐటీడీఏ, విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తే చెంచు గూడేలకు తప్పక విద్యుత్‌ సరఫరా అవుతుంది. వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.  


అటవీశాఖ అభ్యంతరాలే కారణం


నల్లమలలోని జానాల, సిద్ధేశ్వరం, బలపాలతిప్ప గూడేలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఐటీడీఏ గతంలో ప్రయత్నించింది. అయితే అటవీశాఖ అభ్యంతరాల వల్ల పనులు ముందుకు సాగలేదు. పెచ్చెర్వు గూడెంలో ఇటీవలే సోలార్‌ దీపాలను ఏర్పాటు చేశాం. 


 - కేజీనాయక్‌, ఐటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌ 

Read more