టీఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్‌ ఉపాధ్యక్షుడి గుడ్‌బై

ABN , First Publish Date - 2020-09-21T07:42:03+05:30 IST

సహచర సభ్యుల్లోని కొందరి వేధింపులు భరించలేక, వారితో ఉన్న బేదాభిప్రాయాల కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ

టీఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్‌ ఉపాధ్యక్షుడి గుడ్‌బై

సహచర సభ్యుల వేధింపులు, బేదాభిప్రాయాలే కారణమని వెల్లడి 

కేసీఆర్‌, కేటీఆర్‌, తలసాని, పద్మారావు, సాయన్నలకు థ్యాంక్స


సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌ 20(ఆంధ్రజ్యోతి): సహచర సభ్యుల్లోని కొందరి వేధింపులు భరించలేక, వారితో ఉన్న బేదాభిప్రాయాల కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ ప్రకటించారు. ఈమేరకు ఆదివారం మహేంద్రాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తనకు రాజకీయంగా అండదండలు అందించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌, స్థానిక శాసనసభ్యుడు జి.సాయన్న, తన పనితీరు నచ్చి బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడ్ని చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన బోర్డు సభ్యులు పాండుయాదవ్‌, నళినికిరణ్‌, లోకనాథంలను తానెప్పుడూ మరిచిపోలేనని, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయడం ద్వారా వారికి దూరం కావడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, దీనిని లక్ష్యంగా నిర్ధేశించుకుని ముందుకు సాగుతానని అన్నారు. ప్రజలు, సహచరులు, శ్రేయోభిలాషులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్‌ నిర్ణయం తీసుకుంటానని రామకృష్ణ వెల్లడించారు. 


ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయని రామకృష్ణ 

బోర్డు పాలక మండలి ఉపాధ్యక్ష పదవికి రామకృష్ణ రాజీనామా చేయకపోవడంగమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి ఈనెల 20వ తేదీలోపు రాజీనామా చేస్తారని, ఆయన స్థానంలో 1వ వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిని ఎన్నుకుంటారని మంత్రి తలసాని ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రామకృష్ణ పార్టీకి గుడ్‌బై చెప్పడం, తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం విశేషం. బోర్డులోని మిగతా ఏడుగురు సభ్యులు పార్టీకి అనుకూలంగా ఉండడంతో, పార్టీ నాయకత్వం ఆదేశిస్తే రామకృష్ణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి సభ్యుల పదవీ కాలాన్నికేంద్ర రక్షణ శాఖ రెండోసారి పొడిగించడంతో వారు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఒకవేళ రక్షణ శాఖ తలచుకుంటే ఈలోపు ఎన్నికలు కూడా నిర్వహించవచ్చు.  


మారిన రాజకీయ సమీకరణలు 

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెనువెంటనే రామకృష్ణ కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, మరో మాజీ ఉపాధ్యక్షురాలు బాణుక నర్మద భర్త, సీనియర్‌ నాయకుడు బాణుక మల్లిఖార్జున్‌లకు ఫోన్‌ చేసి, పికెట్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు రమ్మని ఆహ్వానించారు. వారితో కలిసి మరి కొన్ని వార్డుల్లో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. కుల సంఘాలు, స్వచ్ఛంద, సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాంతో ఒక్కసారిగా కంటోన్మెంట్‌ రాజకీయ సమీకరణాలు మారినట్టయింది. రాజీనామా, జంపన, బాణుక మల్లిఖార్జున్‌లతో కలిసి ఆయా వార్డుల్లో రామకృష్ణ పర్యటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యక్ష పదవికి రామకృష్ణ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ నిరీక్షిస్తున్న బోర్డు పాలక మండలికి, టీఆర్‌ఎస్‌ పెద్దలకు పార్టీకి రాజీనామా చేయడంతో ఊహించని పరిణామం ఎదురుకావడం స్థానికంగా ఆసక్తిగా మారింది. 

Updated Date - 2020-09-21T07:42:03+05:30 IST