వరల్డ్‌ కప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై

ABN , First Publish Date - 2021-09-17T07:39:11+05:30 IST

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

వరల్డ్‌ కప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై

  • విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటన  
  • ఎంతో కాలంగా వస్తున్న ఊహాగానాలకు, 


జరుగుతున్న చర్చలకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెరదించాడు. దుబాయ్‌ వేదికగా వచ్చేనెలలో మొదలుకానున్న వరల్డ్‌ కప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్టు  వెల్లడించాడు. ఈమేరకు ట్విటర్‌లో సుదీర్ఘ, భావోద్వేగ ప్రకటన చేశాడు. విరాట్‌ తప్పుకోనుండడంతో పరిమిత ఓవర్లలో అతడి డిప్యూటీగా ఉన్న రోహిత్‌ శర్మకే పొట్టిఫార్మాట్‌ పగ్గాలుఅప్పగించే  అవకాశాలున్నాయి.


దుబాయ్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు వెల్లడించాడు. ‘దుబాయ్‌లో జరిగే ఈ ప్రపంచ కప్‌ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తన ట్విటర్‌ పేజీలో విరాట్‌ గురువారం పోస్ట్‌ చేశాడు. ‘వర్క్‌లోడ్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గత 8-9 సంవత్సరాలుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండడంవల్ల నాపై పడుతున్న తీవ్ర పనిభారం, అలాగే ఐదారేళ్లుగా మూడు విభాగాలకూ కెప్టెన్‌గా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకొని టెస్ట్‌, వన్డేల్లో జట్టును మరింత సమర్థంగా నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. టీ20 కెప్టెన్‌గా జట్టును శాయశక్తులా ముందుకు నడిపించా. 


ఇకపై బ్యాట్స్‌మన్‌గా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తా. ఎంతో అంతర్మథనం తర్వాత..ఆపై ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, నాయకత్వ గ్రూపులో ముఖ్యుడైన రోహిత్‌ శర్మ, బీసీసీఐ చీఫ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా, సెలెక్టర్లతో విస్తృతంగా చర్చించాకే కెప్టెన్సీని వదులుకోవాలన్న నిర్ణయానికి వచ్చా’ అని కోహ్లీ ఆ పోస్ట్‌లో వివరించాడు. ‘భారత్‌కు ఆడడమేకాదు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం అదృష్టంగా భావిస్తున్నా. టీమిండియా సారథిగా నా పయనంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. వారి మద్దతు లేకుండా ఆ బాధ్యతలను నిర్వర్తించలేను. సహచర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, సెలెక్షన్‌ కమిటీ, మా విజయంకోసం ప్రార్థించిన ప్రతి భారతీయుడికీ థ్యాంక్స్‌’ అని విరాట్‌ ఉద్వేగంగా పేర్కొన్నాడు. వచ్చేనెల 17న టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. 


ఆస్ట్రేలియా టూర్‌లో..

2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతలనుంచి వైదొలగడంతో కోహ్లీ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా  నియమితుడయ్యాడు. ఆపై రెండేళ్లకు పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను కూడా వదులుకోవాలని మహీ నిర్ణయించుకోవడంతో 2017లో విరాట్‌ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కోహ్లీ పగ్గాలు చేపట్టాక అతిపెద్ద టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. ఇక.. అక్టోబరు 24న దుబాయ్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ సమరాన్ని ఆరంభించనుంది. 


పగ్గాలు రోహిత్‌కే..!

ప్రస్తుతం పరిమిత ఓవర్లలో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న 34 ఏళ్ల రోహిత్‌ శర్మకు టీ20 జట్టు పగ్గాలు కట్టబెట్టే అవకాశాలున్నాయి. అదే జరిగితే నవంబరులో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో రోహిత్‌ సారథిగా పూర్తిస్థాయి బాధ్యతలతో జట్టును నడిపించనున్నాడు. ఈ సిరీ్‌సలో భారత్‌ రెండు టెస్ట్‌లతోపాటు మూడు టీ20లలో కివీ్‌సతో తలపడనుంది. 


కెప్టెన్సీలో విరాట్‌ రికార్డు..

సారథిగా ధోనీకంటే కోహ్లీకే విజయశాతం మెరుగ్గా ఉండడం విశేషం. విరాట్‌ సారథ్యంలో భారత్‌ 45 టీ20 మ్యాచ్‌ల్లో తలపడితే 27 విజయాలు సాధించింది. 2 మ్యాచ్‌లు టై కాగా.. మరో రెండు ర ద్దయ్యాయి. అంటే.. 65.11 శాతం అన్నమాట. విరాట్‌ నాయకత్వంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేకపోయినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీ్‌సలలో జట్టు సిరీ్‌సలు గెలుచుకోవడం విశేషం. 


ఎందుకింత అనూహ్యంగా..?

పనిభారం వల్లే తాను తప్పుకొంటున్నట్టు విరాట్‌ చెబుతున్నా..తెరవెనుక కారణాలు అనేకం ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వర్గాల ప్రకారం.. కెప్టెన్సీ ఒత్తిడి కాబోలు బ్యాట్స్‌మన్‌గా నిలకడగా భారీస్కోర్లు చేయడంలో విరాట్‌ విఫలమవుతున్నాడు. ఇక.. సారథిగా అతడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, వ్మూహాలు బోర్డు పెద్దలకు రుచించడం లేదు. ఇటీవల ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు వరల్డ్‌ నెం.1 ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ను పక్కనబెడుతూ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అలాగే జట్టు యువ ఆటగాళ్లతో కలివిడిగా ఉండడనేది కోహ్లీపై మరో విమర్శ. ఆ క్రికెటర్లు ఆట పరంగా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వారికి మార్గదర్శనం చేసేందుకు విరాట్‌ ఆసక్తి చూపడని అతడిని దగ్గరగా చూసిన వారు చెబుతారు. కుల్దీప్‌, పంత్‌ ఫామ్‌ కోల్పోయిన తరుణంలో వారికి అండగా నిలిచేందుకు కోహ్లీ ప్రయత్నించలేదు. నిరుడు ఆసీస్‌ పర్యటనలో అడిలైడ్‌ టెస్ట్‌ ముందువరకు ‘కింగ్‌’ అనే తరహాలో విరాట్‌ మాట చెల్లుబాటైంది. కానీ ఆ టెస్ట్‌లో జట్టు 36 రన్స్‌కే కుప్పకూలడంతో కోహ్లీ ప్రాభవం తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు ధోనీ స్టయిల్లో యువ ఆటగాళ్లతో రోహిత్‌ సంబంధాలు కొనసాగిస్తుండడం, కెరీర్‌పరంగా వారికి సమస్యలు ఎదురైనప్పుడు సలహాలు, సూచనలతో అండగా నిలుస్తున్నాడు. 


దాంతో జట్టులో ఎక్కువమంది హిట్‌మ్యాన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. సహచరులతో సరైన సంబంధాలు కొనసాగించక పోవడం కూడా కోహ్లీకి మైన్‌సగా మారింది. ఈ పరిణామాల క్రమంలోనే  కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ టైటిల్‌ కనుక సాధించకపోతే..వన్డేలలో విరాట్‌ను కెప్టెన్‌గా కొనసాగించడం అనుమానమే. సౌరవ్‌, షా ప్రకటనలు చూస్తే..వారు విరాట్‌ను అభినందించారేతప్ప భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ వరకూ కోహ్లీ సారథిగా కొనసాగుతాడని అనలేదు. అంటే.. వన్డేల్లోనూ అతడి నాయకత్వానికి ఢోకా లేదని చెప్పలేం. విరాట్‌ ప్రకటనపై మరో అభిప్రాయం కూడా వ్యక్తమైంది. డిసెంబరు 2020 తర్వాత భారత్‌ 8 టీ20లే ఆడింది. అన్ని మ్యాచ్‌లకే వర్క్‌లోడ్‌ ఎక్కువైందా.. అన్నది మరో ప్రశ్న. అలాగైతే ఐపీఎల్‌ పనిభారం దృష్ట్యా చూస్తే బెంగళూరు కెప్టెన్‌గా అతడు రాజీనామా చేయాల్సి ఉంటుందనేది కొందరి వ్యాఖ్య. 


ఒకవేళ రోహిత్‌ టీ20లలో జట్టును సమర్థంగా నడిపిస్తే వన్డేల్లోనూ అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని వారి వాదన. అది జరగకుండా ఉండేందుకే కోహ్లీ.. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం ద్వారా బోర్డుకు హెచ్చరిక పంపాడని అభిప్రాయపడుతున్నారు. విరాట్‌కు ఎల్లవేళలా అండగా నిలిచే రవిశాస్త్రి కూడా పొట్టి ప్రపంచ కప్‌ తర్వాత ప్రధాన కోచ్‌గా వైదొలగనుండడం కొసమెరుపు.


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2021-09-17T07:39:11+05:30 IST