మున్సిపల్‌ స్కూళ్లకు మహర్దశ

ABN , First Publish Date - 2021-10-20T06:31:59+05:30 IST

మున్సిపల్‌ స్కూళ్లకు మహర్దశ

మున్సిపల్‌ స్కూళ్లకు మహర్దశ
కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో కోటేశ్వరమ్మకు ఒప్పంద పత్రాన్ని అందజేస్తున్న హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ నిధి పుంధీర్‌

 ‘నాడు-నేడు’ కింద 106 పాఠశాలల అభివృద్ధికి ఎంవోయూ చేసుకున్న హెచ్‌సీఎల్‌ 

విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. త్వరలో వాటి రూపురేఖలు మారిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మున్సిపల్‌ పాఠశాలలన్నింటినీ దశల వారీగా అభివృద్ధి చేసి, వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చింది. వీఎంసీ పరిధిలోని మొత్తం 106 మున్సిపల్‌ పాఠశాలలను విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ సంస్థ మంగళవారం కనెక్ట్‌ టూ ఆంధ్ర సంస్థతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. విజయవాడలోని కనెక్ట్‌ టూ ఆంధ్ర సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ నిధి పుంధీర్‌.. కనెక్ట్‌ టూ ఆంధ్ర సంస్థ సీఈవో వి.కోటేశ్వరమ్మకు ఒప్పంద పత్రాలను అందజేశారు. తొలి విడతలో నగరంలోని 15 మున్సిపల్‌ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, తర్వాత విడతల వారీగా మిగిలిన పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఇంతకుముందు రాష్ట్రంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు ముందుకు వచ్చి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు, పల్స్‌ ఆక్సీమీటర్లను ఆయా జిల్లాల వైద్యాధికారులకు అందజేశారని కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ డిప్యూటీ మేనేజరు శామ్యూల్‌, సౌత్‌ మేనేజర్‌  ఫ్రిజోయ్‌, విజయవాడ యూనిట్‌ బిజినెస్‌ హెడ్‌ శివప్రసాద్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.                                                       


Updated Date - 2021-10-20T06:31:59+05:30 IST