WhatsApp యూజర్లకు గుడ్‌న్యూస్.. ఫోన్‌, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా వాడొచ్చు..!

ABN , First Publish Date - 2021-07-15T17:19:27+05:30 IST

వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఇప్పటి వరకు యూజర్లు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు వాట్సప్ శాశ్వత పరిష్కారం తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

WhatsApp యూజర్లకు గుడ్‌న్యూస్.. ఫోన్‌, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా వాడొచ్చు..!

వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఇప్పటి వరకు యూజర్లు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు వాట్సప్ శాశ్వత పరిష్కారం తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సప్‌ను ఏకకాలంలో ఉపయోగించుకునే వెసులుబాటు యూజర్లకు ఉండేలా వాట్సప్ ఓ సంచలనాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వాట్సప్‌ను వినియోగించాలంటే మొబైల్‌లో తప్పనిసరిగా వాట్సప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తీరాల్సిందే. దాన్ని ఉపయోగించి మన దగ్గర ఉన్న కంప్యూటర్‌కో, లేక ల్యాప్‌టాప్‌కో ‘వెబ్ వాట్సప్’ ఫెసిలిటీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే అలా కనెక్ట్ చేసుకుని వాట్సప్‌ను ఇతర డివైజ్‌లలో ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా ఆ వాట్సప్ యాప్‌ను కలిగిన మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండి తీరాల్సిందే. 


పొరపాటున ఆ ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా లేక స్విచాఫ్ అయినా ఇతర డివైజ్‌లలో ‘వెబ్ వాట్సప్‌’ను ఉపయోగించుకోలేము. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వాట్సప్ సంస్థ ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఒకే సమయంలో నాలుగు డివైజ్‌లలో వాట్సప్‌ను వాడగలిగేలా నూతన ఆవిష్కరణను తీసుకొస్తోంది. అదే సమయంలో ఒక వేళ ఫోన్‌ స్విచాఫ్ అయినా, నెట్ కనెక్టివిటీ లేకున్నా కూడా ఇతర డివైజ్‌లలో వాట్సప్‌ను వినియోగించుకోవచ్చు. అయితే ఆయా డివైజ్‌లకు వేరు వేరే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సప్ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-15T17:19:27+05:30 IST