Abn logo
Sep 21 2021 @ 12:05PM

భారతీయులకు గుడ్‌న్యూస్.. బైడెన్ సర్కారు కీలక నిర్ణయం..

2 డోసులు వేయించుకుంటే.. అమెరికా వెళ్లొచ్చు

నవంబరు నుంచి ప్రయాణ ఆంక్షల సడలింపు

వెళ్లే ముందు కరోనా పరీక్ష తప్పనిసరి

నెగెటివ్‌ రిపోర్టు, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌

ఉన్నవారికి క్వారంటైన్‌ ఆంక్షలు వర్తించవు

యూకే, యూరప్‌ దేశాల అసహనం నేపథ్యంలో

సడలింపుపై బైడెన్‌ సర్కారు కీలక నిర్ణయం

ఏ టీకాలు తీసుకున్న వారిని అనుమతించాలనే

అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీడీసీ

అమెరికాలో రోజూ 2000 కరోనా మరణాలు

5-11 ఏళ్లవారికీ మా టీకా సురక్షితం: ఫైజర్‌


న్యూయార్క్‌, సెప్టెంబరు 20: దాదాపు 18 నెలలుగా ప్రపంచంలోని 33 దేశాలపై విధించిన కఠిన ప్రయాణ ఆంక్షలను సడలించేందుకు అమెరికా సిద్ధమైంది. రెండు డోసుల టీకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా అయితే ఒక డోసు.. వేయించుకున్నవారు నవంబరు నుంచి అమెరికాలోకి నిరభ్యంతరంగా అడుగుపెట్టొచ్చు. అయితే, అమెరికాకు బయల్దేరడానికి ముందు మూడు రోజులలోపు కరోనా పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రిపోర్ట్‌ కలిగి ఉండాలి. ఈ రెండింటితో అమెరికాకు వచ్చేవారు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.అయితే, మన దేశంలో తయారైన కొవాగ్జిన్‌కు.. చైనాలో తయారైన టీకాలకు అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర అనుమతులు లేవు. కాబట్టి ఈ టీకాలు వేయించుకున్నవారిని అనుమతించాలా వద్దా అనే విషయంపై అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

ప్రస్తుతం అమెరికా అమలు చేస్తున్న ప్రయాణ విధానం ప్రకారం.. ఇతరదేశాల్లో ఉన్న అమెరికా పౌరులు, వారి కుటుంబసభ్యులు, గ్రీన్‌కార్డుదారులు, అమెరికా ప్రయోజనాలను కాపాడేవారికి మాత్రం మినహాయింపులు ఉన్నాయి.  కొత్తవిధానం ప్రకారం నవంబరు నుంచి.. టీకాలు వేయించుకున్నవారిపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను సులభతరం చేయడం కోసం విమానయాన సంస్థలకు సీడీసీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం విమానయాన సంస్థలు తమ విమానాల్లో అమెరికా గడ్డపై అడుగుపెట్టేవారి ఈమెయిల్‌ చిరునామా, ఫోన్‌ నంబర్లను సేకరించాల్సి ఉంటుంది.  ట్రంప్‌ హయాంలో గత ఏడాది జనవరిలో అమెరికా ప్రయాణ ఆంక్షలను ప్రారంభించింది. తొలి దశలో చైనా నుంచి విమానాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించింది.  యూరప్‌ దేశాల్లో కేసుల సంఖ్య బాగా తగ్గి, వ్యాక్సిన్‌ వేయించుకున్నవారి సంఖ్య బాగా పెరిగినా అమెరికా ప్రయాణ ఆంక్షలను సడలించకపోవడంతో ఆయా దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్‌ సర్కారు ఈ అంశంపై దృష్టి సారించి ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైంది.

అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాలు ఏవంటే.. చైనా, బ్రెజిల్‌, ఇరాన్‌, దక్షిణాఫ్రికా, భారత్‌, యూకే, ఐర్లండ్‌, ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఎస్తోనియా, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, జర్మనీ, గ్రీస్‌, హంగరీ, ఐస్‌లాండ్‌, ఇటలీ, లాత్వియా, లీచ్‌టెన్‌స్టీన్‌, లిథువేనియా, లగ్జెంబర్గ్‌, మాల్టా, నెదర్లాండ్స్‌, నార్వే, పోలండ్‌, పోర్చుగల్‌, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌.


అమెరికాలో రోజూ 2వేల  మరణాలు

అమెరికాను కరోనా మరణాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు సగటున 2,012 మంది మృత్యువాత పడుతున్నారు. సెప్టెంబరు 17న రోజువారీ మరణాలు భారీగా పెరిగి 2,579కు చేరడంతో కలకలం రేగింది. ప్రధానంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో మరణాలు ఎక్కువ  సంభవిస్తున్నాయి. సెప్టెంబరు 13న కొత్తగా 2.85 లక్షల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ సంఖ్య నాలుగు రోజుల వ్యవధిలోనే భారీగా తగ్గిపోయింది.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...