బీపీ, షుగర్ పేషంట్లకు శుభవార్త

ABN , First Publish Date - 2022-08-27T17:44:35+05:30 IST

దీర్ఘకాల వ్యాధులకు క్రమంతప్పక వాడాల్సిన మందులవి.. కానీ, ధరలేమో పెరుగుతూ పోతున్నాయి. పోనీ మానేద్దామా అంటే..

బీపీ, షుగర్ పేషంట్లకు శుభవార్త

బీపీ, మధుమేహం మందుల ధరకు ముకుతాడు

గ్యాస్ట్రో, యాంటీ బయాటిక్స్‌వి కూడా

తగ్గనున్న రేట్లు.. బాధితులకు ఊరట

45 ఔషధాల ధరలపై నియంత్రణ!

రేట్ల పట్టికలను తప్పక ప్రదర్శించాలి

జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ


హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాల వ్యాధులకు క్రమంతప్పక వాడాల్సిన మందులవి.. కానీ, ధరలేమో పెరుగుతూ పోతున్నాయి. పోనీ మానేద్దామా అంటే.. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదంతా పేద, మధ్య తరగతి వారికి ఆర్థికంగా భారమవుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ-ఎన్‌పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మధుమే హం (షుగర్‌), రక్తపోటు (బీపీ)తో పాటు కొన్ని వ్యాధులకు సంబంధించి నిత్యం వాడే ఔషధాల ధరలకు కళ్లెం వేసింది. మొత్తం 45 రకాల మందుల రేట్లను సవరిస్తూ ఎన్‌పీపీఏ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో గ్యాస్ట్రో సమస్యలు, నొప్పులు, హీమోఫిలియా ఫ్యాక్టర్స్‌, కంటి సమస్యలు, అలర్జీ, ఆస్తమాలకు వాడే అతి ముఖ్యమైన ఔషధాలున్నాయి. కొంతకాలంగా బీపీ, షుగర్‌ మందుల ధరలు ప్రతి నెల పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌పీపీఏ నిర్ణయంతో ఊరట కలగనుంది. 25 నుంచి 35 శాతం మేర ఆర్థిక భారం తగ్గనుంది.


26 మధుమేహానికి సంబంధించినవే

ఎన్‌పీపీఏ తాజాగా ధరలు ఖరారు చేసిన 45 రకాల ఔషధాల్లో 26 మధుమేహానికి సంబంధించినవి కాగా, రక్తపోటు నియంత్రణకు వాడేవి ఐదు ఉన్నాయి. ఇందులో కొన్నికాంబినేషన్‌ డ్రగ్స్‌ ఉన్నాయి. సవరించిన ధరలకే ఈ ఔషధాలను విక్రయించాలని ఉత్పత్తిదారులను ఎన్‌పీపీఏ ఆదేశించింది. ఈ మందులను ఇతర ఫార్ములాతో మార్కెట్లోకి విడుదల చేయాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనివల్ల కొత్త ఔషధాల పేరు చెప్పి ఇష్టమొచ్చినట్లుగా అమ్మకుండా ఉండేందుకు అడ్డుకట్ట వేసినట్లు అయిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాంబినేషన్‌ డ్రగ్స్‌ రేట్లకు కళ్లెం పడిందని పేర్కొంటున్నారు. కాగా, జూలై 3న ఎన్‌పీపీఏ 84 రకాల ఔషధాల ధరలను, ఏప్రిల్‌ 19న 15 రకాల ఫార్ములేషన్‌ డ్రగ్స్‌ ధరలను సవరించింది. 


రేట్ల పట్టికను ప్రదర్శించాల్సిందే..

ఔషధ తయారీ సంస్థలు విధిగా నిర్ణీత ధరలను కచ్చితంగా పాటించాలని ఎన్‌పీపీఏ పేర్కొంది. ఇంటిగ్రేటెడ్‌ ఫార్మస్యూటికల్‌ డేటా బేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ధరల జాబితాను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. లేదంటే వడ్డీతో పాటు అధిక మొత్తంలో జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఇక ఔషధ దుకాణదారులు ధరల జాబితాను తప్పనిసరిగా దుకాణ ప్రాంగణంలో ప్రదర్శించాలని తెలిపింది.


ధరలు సవరించినవాటిలో కొన్ని..

  • బజాబ్‌ హెల్త్‌కేర్‌, ఎక్సేమ్డ్‌ ఫార్మా, ఇన్‌టాస్‌ ఫార్మా, మస్కత్‌ హెల్త్‌ సిరీస్‌, రవేన్‌బెల్‌ హెల్త్‌కేర్‌, సాయిప్రైముస్‌ లైఫ్‌ బయోటెక్‌ సంస్థలు ఉత్పత్తి చేసే సిటాగ్లిప్టిన్‌, మెటాఫార్మిన్‌ మాత్ర ధర ఒక్కొక్కటి రూ.16.07- రూ.21.56 (కంపెనీల ఆధారంగా రేట్లున్నాయి) మధ్య ఉండేలా నిర్ణయించారు. ఈ ఔషధాలను మధుమేహ రోగులు వాడతారు.
  • ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీ ఉత్పత్తి చేసే లింగ్లిప్టిన్‌ అండ్‌ మెటార్ఫిన్‌ హైడ్రోక్లోరైడ్‌ 2.5 ఎంజీ ట్యాబ్లెట్‌ ధరను రూ.16.37గా నిర్ణయించారు. ఇదే సంస్థ ఉత్పత్తి చేసే ఇదే ట్యాబ్లెట్‌ 5 ఎంజీ ధరను రూ.25.33గా నిర్దేశించారు. వీటిని మధుమేహ నియంత్రణకు వాడతారు.
  • ప్యూర్‌ అండ్‌ క్యూర్‌ హెల్త్‌ కేర్‌, ప్రైముస్‌ రెమిడీస్‌ ఉత్పత్తి చేసే సిల్నిడిపైన్‌ 10 ఎంజీ, టెల్మిసార్టాన్‌ 40 ఎంజీ, క్లోర్తాలిడోన్‌ 6.25 ఎంజీ  మాత్ర ధరను రూ.12.50గా నిర్ణయించారు. వీటిని బీపీ అదుపునకు వాడతారు. 
  • బాక్సాల్టా బయోసైన్స్‌ వారి ఫ్యూరిఫైడ్‌ ప్రీజ్‌డైడ్‌ హ్యూమన్‌ కోగ్లేషన్‌ ఫ్యాక్షర్‌, వైరస్‌ ఇన్‌యాక్టివేటెడ్‌ ఐపీ ఇంజక్షన్‌ ధరను రూ.11,606గా నిర్దేశించారు. దీనిని హీమోఫీలియా రోగుల కోసం వినియోగిస్తారు.
  • ప్యూర్‌ అండ్‌ క్యూర్‌ ఉత్పత్తి చేసిన ప్యాంటోప్రొజోల్‌ ట్యాబ్లెట్‌ ధరను రూ.15.49గా సవరించారు. దీన్ని గ్యాస్ట్రో సమస్యల్లో వాడతారు.
  • మైక్రో ల్యాబ్‌ ఉత్పత్తి చేసిన అమోక్సీలిన్‌ పొటాషియం క్లావులానేట్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ కాంబో ప్యాక్‌ ధరను రూ.168.43గా నిర్ణయించారు. ఇది యాంటీబయాటిక్‌.
  • మ్యాన్‌కైండ్‌ ఫార్మా, అక్సా పెరెంటెరల్స్‌ ఉత్పత్తి చేసిన బుడేసోనైడ్‌ ఫార్మొటెరోట్‌ రెస్పిరేటర్‌ సస్పెన్షన్‌ ఒక్క ఎంఎల్‌ ధరను రూ.22.75గా ఖరారు చేశారు. దీనిని ఆస్తమా రోగులు వినియోగిస్తారు.

Updated Date - 2022-08-27T17:44:35+05:30 IST