భక్తులకు శుభవార్త.. చిదంబరంలో కనకసభ పైనుంచి దర్శనం

ABN , First Publish Date - 2022-05-20T13:46:40+05:30 IST

కడలూరు జిల్లా చిదంబరంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం నటరాజస్వామివారి ఆలయంలో గతంలా కనకసభ (సిట్రంబళ మేడై) వేదికపై నుంచి భక్తులు స్వామివారిని దర్శించడానికి

భక్తులకు శుభవార్త.. చిదంబరంలో కనకసభ పైనుంచి దర్శనం

- పాత విధానం అమలు 

- ప్రభుత్వం ఉత్తర్వులు


చెన్నై: కడలూరు జిల్లా చిదంబరంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం నటరాజస్వామివారి ఆలయంలో గతంలా కనకసభ (సిట్రంబళ మేడై) వేదికపై నుంచి భక్తులు స్వామివారిని దర్శించడానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరమేశ్వరుడు కొలువుదీరిన పంచభూత క్షేత్రాల్లో ఆకాశ క్షేత్రంగా భాసిల్లే నటరాజస్వామివారి ఆలయాన్ని దర్శించేందుకు దేశవిదేశాల నుంచి రోజూ భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలోనూ మూలవర్లే ఉత్సవమూర్తిగా ఆలయ వేడుకల్లో వివిధ వాహన సేవల్లో పాల్గొనటం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ మూలవర్లను భక్తులు సభానాయకుడిగా పిలుస్తుంటారు. ఈ సభానాయకుడిని గర్భాలయం ఎదుట ఉన్న కనకసభలో ఎత్తయిన వేదికపై నిలిచి భక్తులు దర్శించేవారు.. మూలవర్లను దర్శించిన తర్వాత పక్కనే ఉన్న చిదంబర రహస్యాన్ని కూడా తిలకిస్తారు. గత రెండేళ్లుగా కరోనా నిబంధనల కారణంగా ఆ ఆలయంలో ఈ విధానంలో దర్శనాలపైౖ నిషేధం విధించారు. భక్తుల నుంచి పూజద్రవ్యాలను స్వీకరించడం, అంగ ప్రదక్షిణలు వంటివి కూడా నిలిపివేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగించడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో గతంలో మాదిరిగానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే దీక్షితార్ల ఆధీనంలో ఉన్న చిదంబరం నటరాజస్వామివారి ఆలయంలో కనససభ వేదికపై నుంచి భక్తులను దర్శించేందుకు అనుమతించలేదు. దీక్షితార్లంతా కలిసి సమావేశమై కనకసభ వేదిక నుంచి దర్శించే విధానానికి స్వస్తిపలుకుతూ తీర్మానం కూడా చేశారు. కొద్ది నెలలకు ముందు కనకసభ వేదికపై ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ను దీక్షితారుల్ల అడ్డుకుని బలవంతంగా కిందకు నెట్టారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు 20 మంది దీక్షితార్లపై పోలీసులు అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి వెళ్లే భక్తులందరూ స్వామివారిని దూరంగా నిలిచి చూడటం తమకు సంతృప్తికరంగా లేదంటూ దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలా కనకసభ వేదికపై నిలిచి స్వామివారిని దర్శించేందుకు అనుమతించాలంటూ కోరారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో చిదంబరం ఆలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో విచారణ జరపాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఇతర అధికారులు ఇటీవల ఆ ఆలయానికి వెళ్ళి విచారణ జరిపారు. భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. దీక్షితార్లను కూడా విచారించారు. ఈ విచారణ పూర్తయిన సమయంలో హైకోర్టులో కనకసభ వేదికపై నుండి భక్తులను మునుపటిలా దర్శనానికి అనుమతించాలంటూ ఉత్తర్వుకూడా జారీ చేసింది. ఈ పరిస్థితులలో దేవాదాయ శాఖ అధికారుల విచారణ మేరకు ఆ ఆలయంలో పాతపద్ధతిలో స్వామివారిని, చిదంబర రహస్యాన్ని దర్శించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ మేరకు గురువారం ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

Updated Date - 2022-05-20T13:46:40+05:30 IST