‘పావలా వడ్డీ’కి మంగళం!

ABN , First Publish Date - 2022-08-13T09:45:06+05:30 IST

పావలా వడ్డీ పథకం కొండెక్కింది. తెలంగాణ రాష్ట్రం తన వాటా ధనం చెల్లించడంలేదని.. కేంద్రం కూడా వాటా డబ్బులు ఇవ్వడం లేదు.

‘పావలా వడ్డీ’కి మంగళం!

  • అటకెక్కిన పథకం.. ఊసేలేని జీరో వడ్డీ!.. 
  • వాటాధనం చెల్లించని తెలంగాణ సర్కార్‌
  • 2015-17 వరకు  బకాయిలు రూ.415 కోట్లు
  • రాష్ట్రం వాటా ధనం ఇవ్వకపోవడంతో.. కేంద్రం కూడా వెనక్కి
  • రాష్ట్ర సర్కార్‌ తీరుతో సహకార సంఘాలకు వడ్డీల భారం
  • సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు దక్కని పథకం


హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పావలా వడ్డీ పథకం కొండెక్కింది. తెలంగాణ రాష్ట్రం తన వాటా ధనం చెల్లించడంలేదని.. కేంద్రం కూడా వాటా డబ్బులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంచాయితీ మధ్య రైతులు నలిగిపోతున్నారు. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకొని, నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించే రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పావలా వడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పక్కాగా అమలైన ఈ పథకం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. ‘ఎంకి పెళ్లి... సుబ్బి చావుకొచ్చినట్లు!’ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంతో.. ఆ ప్రభావం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై పడుతోంది. పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు రెన్యూవల్‌ చేసుకునే రైతులకు 7% వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో కేంద్రం 3% వడ్డీని భరిస్తుంది. మరో 3% వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఒక శాతం వడ్డీని సదరు రైతు చెల్లిస్తే సరిపోతుంది. 2014-15 సంవత్సరం వరకు ఈ ఉమ్మడి ప్రక్రియ సజావుగా సాగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాధనాన్ని ఎగ్గొట్టడంతో.. పథకం అమలు కష్టతరంగా మారింది. 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించి రూ.415 కోట్ల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించలేదు. ఈ రెండేళ్లకు సంబంధించిన తన వాటా ధనాన్ని కేంద్రం చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాధనాన్ని చెల్లించకపోవటంతో.. మరుసటి ఏడాది(2017-18) నుంచి కేంద్రం కూడా వాటా నిధులు ఇవ్వడంలేదు. దీంతో రాష్ట్రంలో ఏడేళ్లుగా పావలా వడ్డీ పథకం అమలు కావడంలేదు.


జీరో వడ్డీ పథకమంటూ ప్రగల్బాలే!

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పావలా వడ్డీ పథకాన్ని కాస్తా ‘జీరో వడ్డీ’ పథకంగా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రైతు చెల్లించాల్సిన ఒక శాతం కలిపి.. మొత్తం 4ు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అంటే రైతులు నయా పైసా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అసలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ జీరో వడ్డీ పథకానికి మోక్షమే కలగలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. 


బకాయిలతో పీఏసీఎస్‌లపై వడ్డీ భారం

బ్యాంకులతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కూడా రైతులకు పంట రుణాలు చెల్లిస్తుంటాయి. రాష్ట్రంలో సహకార సంఘాలు, సహకార వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవటంతో సహకార సంఘాలు కూడా నీరసించిపోతున్నాయి. 2015-17 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ బకాయిలు రూ.415 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయకపోవటంతో.. బ్యాంకులు ప్రత్యామ్నాయ చర్యలకు దిగాయి. ఏ సొసైటీ పరిధిలో ఎంత బకాయిలు ఉన్నాయో లెక్కలు తీసి.. ఆ సొసైటీల ఖాతాల్లో అప్పుగా జమ చేశాయి. ఉదాహరణకు నిజామాబాద్‌ జిల్లాలోని సహకార సంఘాలకు రూ.57 కోట్లు అప్పు జమ చేశాయి. ఒక్క మునిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంపై రూ.31 లక్షల ఆర్థిక భారాన్ని మోపినట్లు చైర్మన్‌ సాయిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు లేకపోవడం, రైతుల నుంచి వసూలుచేసే పరిస్థితి లేకపోవడంతో సొసైటీలు ఇరకాటంలో పడ్డాయి. 


సకాలంలో రుణాలు చెల్లించినా..

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో వెనకో, ముందో రైతులు లబ్ధి పొందుతున్నారు. సకాలంలో రుణాలను రెన్యూవల్‌ చేయని రైతులకూ ప్రయోజనం కలుగుతోంది. కానీ, నిర్ణీత వ్యవధిలో రుణాలు చెల్లిస్తున్న రైతులు పావలా వడ్డీ పథకం ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు వాటా ధనం జమ చేయకపోవటంతో బ్యాకింగ్‌, సొసైటీ, రుణ వ్యవస్థంతా గాడితప్పుతోంది. 

Updated Date - 2022-08-13T09:45:06+05:30 IST