సాగు భలా!

ABN , First Publish Date - 2021-05-11T04:25:32+05:30 IST

పెరిగిన సాగునీటి వనరులు, బీడు భూములు సైతం సాగులోకి రావడం, కరోనా నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి జనం తిరిగి సొంతూళ్లకు వచ్చి సేద్యం చేయడం వంటి కారణాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

సాగు భలా!
నారాయణపేట జిల్లాలో గత వానాకాలంలో సాగు చేసిన కంది పంట

నీటి లభ్యత పెరగడంతో గణనీయంగా పెరిగిన విస్తీర్ణం

వచ్చే వానాకాలం ఉమ్మడి జిల్లాలో 21.47 లక్షల ఎకరాల సాగుకు ప్రణాళిక

వరి తగ్గించాలని వ్యూహం

పత్తి, కంది సాగుపైనే అంచనాలు

మొక్కజొన్న వైపు రైతులు మొగ్గుచూపితే పత్తి తగ్గే ఛాన్స్‌


పెరిగిన సాగునీటి వనరులు, బీడు భూములు సైతం సాగులోకి రావడం, కరోనా నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి జనం తిరిగి సొంతూళ్లకు వచ్చి సేద్యం చేయడం వంటి కారణాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గత వానాకాలం కంటే ఈ వానాకాలం అదనంగా 3.11 లక్షల ఎకరాలు కలుపుకొని, 21.47 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ అధికారులు పత్తి సాగుకే మొగ్గుచూపడంతో అత్యధికంగా 11.88 లక్షల ఎకరాల్లో ఖరారు చేశారు. వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం చెప్పగా, ఆ మేరకు కంది, పత్తి, ఇతర పప్పుదినుసులు, తృణధాన్యాలను సాగు చేయాలని ప్రణాళిక ఖరారు చేశారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి

ఉమ్మడి జిల్లాకు సంబం ధించి వానాకాలం సాగు ప్రణాళిక ఖరారయ్యింది. నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పత్తి, వనపర్తి జిల్లాలో వరి, నారాయణపేట జిల్లాలో కంది సాగును ఎక్కువగా ప్రతిపాదించారు. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లాలో వరి, కంది, నారాయణ పేటలో వరి, కంది సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా రెండుదశల ఎత్తిపోతల పథకాల కింద అందుబాటులోకి వచ్చిన ఆయకట్టులో అత్యధికంగా వరి సాగుకు ప్రాఽధాన్యం ఇవ్వడంతో గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఆ సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద స్వల్పంగా వరి, ఆపై పత్తి, కంది పంటలు నిర్ధేశించడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. బోరుబావుల కింద సాగయ్యే ప్రాంతాల్లో ఎక్కువగా వానాకాలంలో వరికే  ప్రాధాన్యం ఇస్తుండడంతో ఆమేర వరిసాగు బాగా పెరిగింది. ప్రభుత్వం గతేడాది నిర్ధేశిత సాగును ప్రతిపాదించి, ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాగు చేయకుండా నిరోధించగా, ఈసారి అలాంటి ఆంక్షలేమీ లేకపోవడంతో ఆ పంట సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ఆముదం, జొన్న వంటి ఇతర పంటలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 


వాణిజ్య పంటల సాగు పెంచడమే లక్ష్యం

అధిక నీటి వినియోగంతో పాటు పెద్దగా లాభాలు రాని వరి సాగును పరిమితం చేసి, లాభాలు అధికంగా వచ్చే వాణిజ్య పంటలైన పత్తితో పాటు పప్పు దినుసులైన కందుల సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు, వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. తప్పనిసరి వరి సాగు చేయాల్సిన భూముల్లో వరినే సిఫార్సు చేసినా, ఇతర సాగునీటి వనరులున్న చోట పత్తి, కంది పంటలను సూచించారు. బోరుబావుల కింద సైతం వరి సాగు తగ్గించుకొని వాణిజ్య పంటలు సాగుచేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ రైతుల మాత్రం వరి సాగుకే మొగ్గుచూపుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ సీజన్‌లో గతేడాది కంటే  కనీసం 50 వేల ఎకరాల వరకు వరి విస్తీర్ణం తగ్గించిన అధికారులు, పత్తిని 1.55 లక్షల ఎకరాల్లో, కందిని 1.31 లక్షల ఎకరాల్లో అదనంగా సాగ ుచేయాలని ప్రతిపాదించారు. జొన్న, మొక్కజొన్న, ఆముదం ఇతర పంటలను సైతం సుమారు 50 వేల ఎకరాలలో అదనంగా సాగు చేయాలని సంకల్పించారు. ప్రణాళికపరంగా అధికార యంత్రాంగం ఈ సూచనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంటను ఏ మేర సాగుచేస్తారో వేచి చూడాలి. బోరుబావుల కింద వరి తగ్గిస్తే మాత్రం కంది, పత్తి సాగు మరింత పెరిగే అవకాశముండగా, మొక్కజొన్నకు మొగ్గుచూపితే పత్తి సాగు ఆమేర తగ్గిపోతుందని అంచనా వెలువడుతోంది.

Updated Date - 2021-05-11T04:25:32+05:30 IST