మనలో నుంచి మేలుకొందాం...

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

మానవాళి కోసం ఏసు ప్రభువు శిలువను ఎక్కిన రోజు... తన మరణం ద్వారా ఒక ప్రేమ సందేశాన్ని, ఒక త్యాగ సందేశాన్ని ఆయన అందించిన రోజు...

మనలో నుంచి మేలుకొందాం...

మానవాళి కోసం ఏసు ప్రభువు శిలువను ఎక్కిన రోజు... తన మరణం ద్వారా ఒక ప్రేమ సందేశాన్ని, ఒక త్యాగ సందేశాన్ని ఆయన అందించిన రోజు... గుడ్‌ ఫ్రైడే. మరణయాతనతో శిలువపై ఉన్న క్రీస్తుతో ఈ రోజు ప్రతి విశ్వాసి మనసు విప్పిమాట్లాడతాడు. ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఈ వారాన్నంతటినీ ‘పవిత్ర వారం’ అంటారు. మరణానికి ముందు రోజైన గురువారం ప్రభువు తన శిష్యుల పాదాలు కడగడం ఒక విశేష సందర్భం. గుడ్‌ ఫ్రైడే తరువాత... మూడవ రోజు... ఆదివారం పరిశుద్ధ విశ్రాంతి దినం. ఆ రోజున ఏసు పునరుత్థానుడు అవుతాడు. అదే ‘ఈస్టర్‌’. మనిషి ఎలా ఉండాలి అనే సందేశాన్ని ఏసు ప్రభువు వినిపించడమే కాదు, స్వయంగా చేసి చూపించాడు. త్యాగపూరితమైన విశాల భావాన్ని ఈ వారం మనకు బోధిస్తుంది. 


‘ఈస్టర్‌’ అంటే తిరిగి రావడం. పతనావస్థ నుంచి పునరుత్థానం కావడం. మరణించి, మళ్ళీ సజీవంగా లేవడం. ఎండిన విత్తనాన్ని చీల్చుకుంటూ, కొంగొత్త చివురై మొక్క మొలకెత్తడం. గతించిన పాత జీవితం నుంచి కొత్తగా పుట్టడం. కలువరిగిరి శిలువ మీద గుడ్‌ ఫ్రైడే నాడు ప్రాణాలు విడిచిపెట్టిన క్రీస్తు మూడో రోజున... ఈస్టర్‌ నాడు తిరిగి లేచాడు. ఇదో అద్భుతం. కానీ ‘ఈస్టర్‌ అంటే ఇంతే’ అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. మన పతనావస్థను గుర్తించి జీవితాన్ని సమన్వయం చేసుకోకపోయినా, మన తప్పులు సరిదిద్దుకోకపోయినా, ఇతరులకు ఆదర్శంగా మెలగకపోయినా... క్రీస్తు త్యాగానికీ, ఈస్టర్‌ సందర్భానికీ అర్థం లేదు. ఏసు క్రీస్తు పేరు వినగానే గుర్తుకు వచ్చేవి ఆయన అనుభవించిన శిక్షలు. అవి ఆయనకు అన్యాయంగా విధించినవి. పునరుత్థానం వెనుక జరిగిన కథలో క్రీస్తు పడిన శ్రమలు ఉన్నాయి. ఎన్నో నిందలను ఆయన భరించాడు. ‘పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడు’ అనే నానుడిని నిజంచేస్తూ... నిందల్లోంచే నిరుపమాన ప్రశంసా కాంతి పెల్లుబికి వస్తుందనే సందేశాన్ని ఇచ్చాడు. 


ఏసు ప్రభువు ఒక సాధారణ మానవుడిగా వుట్టాడు. కానీ మానవుడు చేయగలిగేవన్నీ చేశాడు. మానవాతీత శక్తులను ప్రకటించాడు. వాటిని ఆయన చేసింది తన ఔన్నత్యాన్ని ప్రకటించుకోవడానికో, తన ఉనికిని చాటుకోవడానికో కాదు. తనపై అపనమ్మికను తొలగించడానికీ... విశ్వాసాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించడానికీ మాత్రమే. అయితే, అంధులకు చూపు తెప్పించడం. నడవలేని వాళ్ళను నడిపించడం. మూగవారితో మాట్లాడించడం, నీటిపై నడవడం, కుష్టు వ్యాధిని నయం చెయ్యడం. మరణించిన వారిని బతికించడం... ఇవన్నీ ఆయనలోని దైవత్వాన్ని చాటిచెప్పేవే. 


దేన్నీ మూఢంగా నమ్మవద్దనీ, హేతుబద్ధమైన దృక్పథంతో సాగాలనీ, మనిషిని మనిషిగా చూడాలనీ ఏసు ప్రభువు చేసిన బోధలు ఆనాటి రోమన్‌ పాలకులకు తిరుగుబాటులా కనిపించాయి. చిన్న చిన్న మాటల్లో ఆయన ఇచ్చిన సందేశాలు వాళ్ళకు హడలెత్తించాయి. ఆయనను వారు దోషిగా చిత్రీకరించారు. ఆశ్చర్యమేమిటంటే, క్రీస్తుకు విరోధి ఇయన హేరోదు ‘‘ఈ నిర్దోషికి శిక్ష విధించిన పాపం నాకు ఎప్పుడూ అంటకుండా ఉండుగాక!’’ అంటూ చేతులు కడిగేసుకున్నాడు. కానీ ఆయన స్వీయమతానికే చెందిన ఛాందసులు రాచరికంతో కలిసి కుట్ర పన్నారు, దేశ ద్రోహ నేరం మోపారు. మరణ శిక్ష విధించేలా చేశారు. రాజాజ్ఞ ప్రకారం... సైనికులు క్రీస్తును చిత్రవధ చేసి చంపారు. అలాంటి దారుణమైన మరణం నుంచి ఆయన ప్రాణాలతో తిరిగి లేచాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ముందుగా చెప్పిన ప్రకారమే కచ్చితంగా జరిగింది.


క్రీస్తును నమ్మినట్టు నటించిన వారే ఆయన మరణానికి కారకులయ్యారు. అందుకే ‘‘నా దోషాలే కదా ప్రభూ... నిన్ను కలవరిగిరి రాళ్ళపై శిలువను మోయిస్తూ నడిపించాయి. నా తప్పులే కదా... కొరడాలై  బాధించాయి. నా పాపాలే ముళ్ళ కిరీటాలై నిన్ను దుఃఖింపజేశాయి’’ అని చర్చి వాకిట మతబోధకులు, విశ్వాసులు విలపిస్తారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడం, తప్పును తెలుసుకొని, మళ్ళీ చేయకుండా సరిదిద్దుకోవడం... ఈస్టర్‌ మనకు ఇచ్చే అవకాశం. ఈస్టర్‌ రోజున... మనలోంచి మనం మేలుకోవాలి.


క్రిస్మస్‌ ఏసు ప్రభువు జననానికి సూచిక అయితే... ఈస్టర్‌ ఆయన మహిమకు, విజయానికి చిహ్నం. ప్రభుని మృత్యుంజయ మ్మెంచి భాగ్య మంది చలువ వెన్నెలల్‌  పుడమినే పలకరించె మల్లియ ల్పూచెనే మంచి మనసు లందు చీకటు ల్రాతి బండలో చేరి పోయె


డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌రాజు

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST