Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది.. ఎందుకలా?

ఆంధ్రజ్యోతి(14-07-2020)

ప్రశ్న: మా అమ్మకు 65 ఏళ్లు. ఆకలి అంటుంది కానీ కొద్దిగా తినగానే కడుపునిండిపోయింది చాలంటుంది. ఆమెకు పౌష్టికాహారం అందించడం ఎలా?


- లక్ష్మీ ప్రసూన, విజయవాడ


డాక్టర్ సమాధానం: వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో జరిగే అనేక మార్పుల్లో జీవన క్రియ వేగం తగ్గుతుంది. జీర్ణశక్తి తగ్గి, ఆహారాన్ని శోషించుకునే గుణం మందగిస్తుంది.  వీటితో పాటు వాసన, రుచి గ్రహించే శక్తీ కొంత తగ్గుతుంది. అందువల్ల ఆహారంలోనే కాక జీవన విధానం లోనూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రోజులో శారీరక శ్రమకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. బియ్యం, గోధుమలు లాంటి ధాన్యాలను కొంత తగ్గించి పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా,  మూడు గంటలకు ఓసారి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవచ్చు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. రోజుకు కనీసం  మూడు లీటర్ల నీరు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం నడక, యోగా చేస్తే మంచిది. వయసు పెరిగేకొద్దీ కండరాల పటుత్వం తగ్గే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు మంచివి. జ్ఞాపకశక్తిని, మెదడు పనితనాన్ని కాపాడే ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు ఉన్న చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలు లాంటివి రోజూ తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. బరువు తగ్గడం, పోషకాహార లోపాలు ఏర్పడితే మాత్రం నిపుణుల సలహా మేరకు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)


Advertisement
Advertisement