వీటిని తింటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం..!

ABN , First Publish Date - 2020-11-05T17:34:19+05:30 IST

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీటిని తింటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం..!

ఆంధ్రజ్యోతి(05-11-2020)

ప్రశ్న: మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


- రామ్‌ప్రసాద్‌, విజయవాడ


డాక్టర్ సమాధానం: కాల్షియంతో ఆక్సలేట్లు కలిసి కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడతాయి. కొన్నిసార్లు యూరిక్‌ ఆసిడ్‌ అధికంగా ఉన్నా కూడా ఇవి ఏర్పడవచ్చు. మూత్ర పిండాల్లో రాళ్లు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త నీళ్లు ఎక్కువగా తాగడం. రోజుకు కనీసం రెండు లీటర్ల మూత్రం పోవడానికి సరిపడా నీరు తీసుకోవాలి. మాములుగా నీళ్లతో పాటు మజ్జిగ, నిమ్మరసం, బత్తాయి రసం లాంటివి కూడా తీసుకుంటే మంచిది. నిమ్మ జాతి పండ్లనుండి వచ్చే సిట్రేట్‌ కిడ్నీ స్టోన్స్‌ తయార వకుండా చూస్తుంది. ఆహారంలో కాల్షియం సరైన పాళ్ళలో లేక పోయినా కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం ఉండే పాలు, పెరుగు, పన్నీర్‌, చీజ్‌, పలు రకాల ఆకుకూరలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. అయితే సప్లిమెంట్ల రూపంలో అవసరమైన దానికంటే అధికంగా కాల్షియం తీసుకున్నా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. యూరిక్‌ ఆసిడ్‌ అధికంగా ఉన్నవారు మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీ స్టోన్స్‌ వస్తాయి. కాబట్టి వారానికి ఒకటి రెండుసార్లకు మించి మాంసాహారం మంచిది కాదు. సోడియం అధికంగా ఉన్న ఆహారం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్‌ వస్తాయి. బయటి చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్‌, రెస్టారెంట్‌ తిండిలో సోడియం పరిమాణం ఎక్కువ. కాబట్టి, వాటిని మితంగా తీసుకోవాలి. ఇంట్లో ఉప్పు వాడకం తగ్గించాలి. ఫాస్ఫరస్‌ అధికంగా ఉండే శీతల పానీయాలకు దూరంగా ఉంటే మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-11-05T17:34:19+05:30 IST