ఆందోళన పోయేదెలా.. తలనొప్పి తగ్గేదెలా?

ABN , First Publish Date - 2020-05-24T17:58:08+05:30 IST

నాకు పందొమ్మిదేళ్లు. హాస్టల్‌లో ఉంటాను. ఆందోళన వల్ల తరచూ తలనొప్పి వస్తుంది. చక్కటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆందోళన పోయేదెలా.. తలనొప్పి తగ్గేదెలా?

ఆంధ్రజ్యోతి(24-05-2020)

ప్రశ్న: నాకు పందొమ్మిదేళ్లు. హాస్టల్‌లో ఉంటాను. ఆందోళన వల్ల తరచూ తలనొప్పి వస్తుంది. చక్కటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- శ్రీలక్ష్మి, చిత్తూరు 


డాక్టర్ సమాధానం: ఆందోళన వల్ల అప్పుడప్పుడూ తలనొప్పి రావడంతో పాటు, దీర్ఘకాలికంగా రోగనిరోధక వ్యవస్థ పనితీరు పాడవుతుంది. యోగా, ధ్యానం, ఏవైనా ఆటలాడడం, హాబీ అలవాటు చేసుకుంటే ఆందోళన తగ్గుతుంది. మంచి శక్తినిచ్చే ఆహారమూ ముఖ్యమే. హాస్టల్లో ఉంటే అన్ని పూటలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం  ఇబ్బందే. అయినా బయట తేలికగా దొరికే కొన్ని ప్రత్యామ్నాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. పళ్ళు, పెరుగు, మజ్జిగ ఎప్పుడైనా, ఎక్కడైనా లభిస్తున్నాయి. రోజూ కనీసం రెండు లేదా మూడు పళ్ళు (అరటి, ఆపిల్‌, కమలా, నారింజ, సపోటా, దానిమ్మ మొదలైనవి) తప్పనిసరిగా తీసుకోవాలి. రెండు లేదా మూడు సార్లు మజ్జిగ తాగండి. ఉదయం అల్పాహారానికి ముందే పది బాదం గింజలు, నాలుగు ఆక్రోట్‌ గింజలు తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. సాధారణంగా హాస్టల్లో ఉంటే హోటల్లో కానీ రెస్టారెంట్‌ లో కానీ తినే అవకాశాలు ఎక్కువ. ఇలా తరచుగా బయటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. హాస్టల్లో భోజనం సమయానికే పెడతారు కాబట్టి అదే ఉత్తమం. అలాగే రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా అలవాటు చేసుకోండి.


డా. లహరి సూరపనేని న్యూట్రిషనిస్ట్,

వెల్‌నెస్ కన్సల్టెంట్ nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-24T17:58:08+05:30 IST