పసిడికి మళ్లీ మంచి రోజులు

ABN , First Publish Date - 2022-05-03T07:23:59+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) బులియన్‌ మార్కెట్‌కు బాగానే కలిసి రానుంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి నగల అమ్మకాలు ఎంత లేదన్నా 11 శాతం పెరుగుతాయని ‘ఇక్రా రేటింగ్స్‌’ సంస్థ అంచనా.

పసిడికి మళ్లీ మంచి రోజులు

2022-23లో 11% పెరగనున్న అమ్మకాలు

కలిసిరానున్న అక్షయ తృతీయ

భయపెడుతున్న ధర

ఇక్రా రేటింగ్స్‌ వెల్లడి 


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) బులియన్‌ మార్కెట్‌కు బాగానే కలిసి రానుంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి నగల అమ్మకాలు ఎంత లేదన్నా 11 శాతం పెరుగుతాయని ‘ఇక్రా రేటింగ్స్‌’ సంస్థ అంచనా. గత ఏడాది సాధించిన 26 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. అయితే కొవిడ్‌కు ముందున్న 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం 2022-23 అమ్మకాల వృద్ధి రేటు 40 శాతం అధికంగా ఉంటుం దని తెలిపింది. 


ట్రెండ్‌ మారుతోంది: కాలంతో పాటు కొనుగోలుదారుల అభిరుచులూ మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు చిరపరిచుతులైన స్థానిక నగల వ్యాపారులకు బదులు.. పెద్దపెద్ద రిటైల్‌ సంస్థల మాల్స్‌లో కొనేందుకు వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  దీంతో ఈ ఆర్థిక సంవత్సరం జువెలరీ రిటైల్‌ సంస్థలకు మరింత కలిసి రానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వీరి ఆదాయాల వృద్ధి రేటు 14 శాతం ఎక్కువగా ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. దీంతో ఈ రిటైల్‌ సంస్థలు పెద్ద ఎత్తున తమ స్టోర్లను విస్తరిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాలు, పెద్దపెద్ద పట్టణాలకే పరిమితమైన జువెలరీ రిటైల్‌ సంస్థలు ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరిస్తూ మంచి మంచి ఆఫర్లు, డిజైన్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. 


అక్షయ తృతీయతో జోరు: మంగళవారం నాటి అక్షయ తృతీయ అమ్మకాలు కూడా ఈ సంవత్సరం పసిడి నగల అమ్మకాలకు కలిసి రానుంది. ఈ ఒక్క పండగ అమ్మకాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పసిడి అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45 శాతం పెరుగుతాయని ఇక్రా అంచనా వేసింది. పెళ్లిళ్లు, పండగల సీజన్‌ అమ్మకాలు ఇందుకు మరింత దోహదం చేయబోతున్నాయి.


లాభాల్లోనూ వృద్ధి: గత ఆర్థిక సంవత్సరం నగల వ్యాపారులు మంచి లాభాలే కళ్ల జూశారు. ఈ లాభాలు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ఈ లాభాల వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగనుంది. పసిడి ధర రూ.52,000 మార్కు దాటినా పరిశ్రమ సగటు లాభం 7 నుంచి 7.5 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు వీలుగా అమ్మకాలు పెంచుకునేందుకు రిటైల్‌ సంస్థలు స్టోర్ల సంఖ్యను విస్తరిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం స్టోర్ల సంఖ్య 10 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. 

Read more