ఆదర్శ దంపతులు.. అడిగిన వారికి కాదనకుండా సాయం

ABN , First Publish Date - 2022-01-30T00:10:38+05:30 IST

మనం‌ అనుకునే రోజులు పోయి.. నేను.. నా కుటుంబం.. నా ఇల్లు అనుకునే రోజుల్లో ఉన్నాం. ఎవరికి వారే యమునా తీరే అనుకునే ఈ రోజుల్లో..

ఆదర్శ దంపతులు.. అడిగిన వారికి కాదనకుండా సాయం

మనం‌ అనుకునే రోజులు పోయి.. నేను.. నా కుటుంబం.. నా ఇల్లు అనుకునే రోజుల్లో ఉన్నాం.   ఎవరికి వారే యమునా తీరే అనుకునే ఈ రోజుల్లో తమ ఊరు.. తమ ప్రాంతంపై మమకారంతో ఊదారంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ దంపతులు. తమ గడప తొక్కిన వారికి కాదనకుండా తమ వంతు సాయం అందిస్తోన్న ఆ.. ఆదర్శ దంపతులపై ఏబీఎన్ ప్రత్యేక కధనం.


పుట్టిన ఊరుకు ఎంతోకొంత సాయం చేయకపోతే లావైపోతామనేది మహేష్ సినిమా  డైలాగ్. కానీ గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడి పంచాయతీ..  నల్లూరిపాలెంలోని ఓ దంపతులు మాత్రం మరీ లావైపోతామని భావించారో ఏమో తమ స్వగ్రామంతో పాటు చుట్టు పక్కల సుమారు 30గ్రామల్లో ఏదొక అభివృద్ధి కార్యక్రమానికి తమవంతు సాయం అందిస్తున్నారు. యలవర్తి వెంకట్రావు , లక్ష్మీకుమారి  దంపతులు వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఎన్నో కష్టనష్టాలు పడి వ్యాపారాలు చేశారు. కొన్నింటిలో తీవ్ర నష్టం వాటిల్లినా.. మళ్ళీ నిలదొక్కుకొని రియల్ ఎస్టేట్ రంగంలో బాగా స్థిరపడ్డారు.  ఇద్దరు సంతానం కొడుకు, కూతురులు  మంచి చదువులు చదివి  విదేశాలలో స్దిరపడ్డారు. దీంతో ఇక ఆర్థికంగా సంతోషంగా ఉన్నామని భావించిన ఆ దంపతులు తాము పుట్టి పెరిగిన స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని భావించారు. భర్త వెంకట్రావు తీసుకున్న నిర్ణయానికి భార్య లక్ష్మీకుమారి  సపోర్ట్ చేసి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.  ముందుగా గ్రామంలో ప్రజలకు రక్షణ కోసం గ్రామం మొత్తం సీసీ కెమెరాలు పెట్టించారు. వెంకట్రావు తల్లి కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడి మరణించడంతో మరొకరకి  గ్రామంలో ఆ పరిస్థితి రాకూడదని ప్రజలకు  స్వచ్చమైన మంచినీరు అందించాలని లక్ష్యంతో గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నారు. అలాగే గ్రామానికి స్వాగత ద్వారం ఏర్పాటు చేయించారు. దీంతో నల్లూరిపాలెం గ్రామం రూపురేఖలు మారాయి. సేవా కార్యక్రమాలు చేయడం తమకెంతో ఆనందంగా ఉందని వెంకట్రావు దంపతులు చెబుతున్నారు.


మరోవైపు గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా 30 అడుగుల భారీ హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేశారు. అభయ ఆంజనేయస్వామి విగ్రహం చుట్టు శిల్పాకళా నైపుణ్యం ఉట్టి పడేలా పలు దేవతా విగ్రహాలు చెక్కించారు. తూర్పు గోదావరి జిల్లా పరమేశ్వర శిల్ప కళాశాలకు చెందిన శిల్పులు ఈ విగ్రహాన్ని దాదాపు పూర్తి చేశారు. ఆభయ ఆంజనేయస్వామి ఆలయం  నిర్మాణంతో నల్లూరిపాలెం గ్రామానికే అందం వచ్చిందంటున్నారు.‌ 


ఇంకోవైపు స్వగ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవ్వరూ సాయం కోసం వచ్చినా తమ వంతు సాయం చేస్తున్నారు. రేపల్లె, వేమూరు, బాపట్ల ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాలలో హిందూ దేవాలయాలు, చర్చిల నిర్మాణాలు, మరమ్మత్తులు చేస్తున్నారు‌. శ్మశాన వాటికల అభివృద్ధి పనుల కోసం ఆర్థిక సాయం చేస్తూ రేపల్లె ప్రజల దృష్టిలో అపర దానకర్ణుడులా మారిపోయారు. పక్కనే ఉన్న ఊలుపాలెం గ్రామంలో చర్చి అభివృద్ధి పనులతో పాటు పలు అభివృద్ధి పనులు చేశారు. రేపల్లె మండలంలోని అరవపల్లె, నల్లూరిపాలెం, పోటుమెరక, వడ్డివారిపాలెం, నల్లూరు పంచాయతీల పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేశారు.


మరోవైపు రేపల్లె మున్సిపాలిటీ రెండో వార్డులో విద్యా భారతి ఆధ్వర్యంలో నడుస్తోన్న రామకృష్ణ విద్యాలయం రేకుల రెడ్డు ఉంది. రేకుల షెడ్డు స్థానంలో నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఈ స్కూల్ తో పాటు పలువురు పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తూ విద్యాభివృద్దికి కృషి చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అనేక మందికి చదువు కోసం సాయం చేస్తున్నారు యలవర్తి వెంకట్రావు దంపతులు. మరోవైపు ఇళ్ళు లేని అనేక కుటుంబాలకు ఇంటికి సంబంధించిన మెటీరియల్ అందించారు. తమ ఇంట్లో దశాబ్ధాలుగా పని చేస్తోన్న‌ వ్యక్తికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు యలవర్తి దంపతులు. గుంటూరు జిల్లాలో ఈ దంపతులు మరి కొంతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం.




Updated Date - 2022-01-30T00:10:38+05:30 IST