గోనె సంచినీ వదలరు!

ABN , First Publish Date - 2021-10-29T04:48:09+05:30 IST

గోనె సంచినీ వదలరు!

గోనె సంచినీ వదలరు!
ఇచ్ఛాపురంలో ఆందోళన చేస్తున్న డీలర్లు(ఫైల్‌)

- రేషన్‌ పంపిణీ పూర్తయిన తరువాత ఖాళీ సంచులు ఇవ్వాల్సిందే

- జీవో 10ను జారీ చేసిన ప్రభుత్వం

- ఆందోళన బాట పట్టిన డీలర్లు

- ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

(రాజాం/ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వానికి, రేషన్‌ డిపోల డీలర్లకు మధ్య గోనె సంచుల చిచ్చు రేగింది. బియ్యం పంపిణీ తరువాత ఖాళీ గోనె సంచులు వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ జీవో 10ను విడుదల చేశారు. తిరిగి ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్‌ బియ్యానికి సంబంధించి గోనె సంచులు కొనుగోలు చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై రేషన్‌ డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే డిపోలను ఎలా నడిపేది అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రోజులుగా ఉద్యమబాట పట్టారు. స్టాక్‌ పాయింట్ల వద్ద నిరసన తెలిపి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. వాస్తవానికి గత ఏడాది జీవో 10 విడుదలైంది. అప్పట్లో డీలర్లు వ్యతిరేకిస్తూ ఒక రోజు రేషన్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా జీవో జారీ చేయడమే కాకుండా స్పష్టమైన ఆదేశాలు రావడంతో డీలర్లలో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 8,87,019 రేషన్‌ కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 2,016 డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. నెలకు 1,079,000 క్వింటాళ్ల బియ్యం విడుదలవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నవంబరు వరకూ ఉచితంగా బియ్యం అందిస్తోంది. బియ్యం పంపిణీ పూర్తయిన తరువాత ఖాళీ గోనె సంచులను తిరిగి డిపోలకు అందించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జూట్‌మిల్లులు మూత పడినందున కలకత్తా నుంచి సంచులు తెచ్చుకోవాల్సి వస్తోంది. అందుకే ఒక్కో గోనె రూ.50కు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన గోనె సంచులకే రూ.1.79 కోట్లు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుతో పాటు లెవీ సేకరణకు గోనె సంచులు అవసరమవుతున్న దృష్ట్యా డీలర్లు ఎట్టి పరిస్థితుల్లో సంచులు ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలోనే ఒక్కో ఖాళీ గోనె సంచికి రూ.20 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అమలుకావడం లేదు. ఇప్పుడు ఏకంగా సంచులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలివ్వడంపై డీలర్లు మండిపడుతున్నారు. ఇలా అయితే డిపోల అద్దె, కరెంట్‌ బిల్లులు ఎలా కడతామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఆందోళనలు చేపడుతున్నారు. 


ఆది నుంచీ విమర్శలు

పౌర సరఫరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల ద్వారా ఇంటింటా రేషన్‌ సరఫరాకు శ్రీకారం చుట్టింది.  తరువాత మొబైల్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చి ఇంటింటా రేషన్‌ సరుకులు అందజేస్తోంది. ఈ వాహనాలు కొండ శిఖర, మారుమూల గిరిజన గ్రామాలకు మాత్రం వెళ్లడం లేదు. అటు వైపు వెళ్లలేమని ఆపరేటర్లు చెబుతుండగా.. తమకు పౌర సేవలు అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో ప్రభుత్వం అందించే మొత్తం ఏ మూలకు చాలడం లేదని ఆపరేటర్లు వాహనాలను తిరిగి అప్పగించారు. దీంతో ప్రభుత్వం వారి వేతనాలను పెంచింది. ఇవన్నీ తమను నిర్వీర్యం చేసే పనిలో భాగమేనని డీలర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


కమీషన్ల చెల్లింపులేవీ? : 

కరోనా విపత్కర పరిస్థితుల్లో కార్డుదారులకు సరుకులు ఇచ్చిన డీలర్లకు కమీషన్‌ చెల్లింపు విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పీఎంజేకేఏవై కింద గత ఏడాది ఐదారు నెలల కమీషన్‌ బకాయి ఉంది. ప్రస్తుతం మే నుంచి కూడా బకాయిలు చెల్లించాల్సి ఉంది. రేషన్‌షాపుల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండగా, కమీషన్‌ కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో డీలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జీవో నెంబరు 10ని ఉపసంహరించుకోవడంతో పాటు తమకు రావాల్సిన కమీషన్‌ను వెంటనే చెల్లించాలని గోడౌన్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  


 జీవో నెంబరు 10 రద్దు చేయాలి 

ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో నెంబరు 10ను వెంటనే రద్దు చేయాలి. కమీషన్ల బకాయిలు త్వరగా చెల్లించాలి. లేదంటే పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వ తీరుతో చాలా మంది డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.  

- జి.దిలీప్‌, డీలర్ల సంఘం, కార్యదర్శి, ఇచ్ఛాపురం.


స్పష్టమైన నిబంధనలు రాలేదు 

గోనె సంచులపై ప్రభుత్వం జీవో నెంబరు 10 విడుదల చేసినా, దానిపై ఇంత వరకు స్పష్టమైన నిబంధనలు రాలేదు. రెండు, మూడు రోజులలో దీనిపై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు డీలర్లు సమన్వయంతో ఉండాలి. 

- డి.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి, శ్రీకాకుళం

Updated Date - 2021-10-29T04:48:09+05:30 IST