కేసీఆర్‌ బొమ్మతో గెలిచే రోజులు పోయాయి

ABN , First Publish Date - 2021-10-19T06:02:20+05:30 IST

‘కేసీఆర్‌ బొమ్మ చూపించి గెలవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు అనుకుంటున్నారని, ఆ బొమ్మకు ఓట్లు పడే రోజులు పోయాయని అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

కేసీఆర్‌ బొమ్మతో గెలిచే రోజులు పోయాయి
వీణవంక మండలం చల్లూరు సభలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

వీణవంక, అక్టోబరు 18: ‘కేసీఆర్‌ బొమ్మ చూపించి గెలవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు అనుకుంటున్నారని, ఆ బొమ్మకు ఓట్లు పడే రోజులు పోయాయని అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం  వీణవంక మండలంలోని గంగారం, ఎలబాక, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పచ్చటి సంసారాల్లో కేసీఆర్‌ నిప్పు పెట్టారని, మానవ సంబంధాలకు మచ్చ తీసుకువస్తున్నారన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు టికెట్‌ ఇప్పించానని, ఆయన గెలవడానికి ప్రచారం చేశానని, ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి నన్ను ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తున్నాడన్నారు. ఆయనను చూసి పెద్దపల్లి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఉప ఎన్నిక తర్వాత పెద్దపల్లికి వస్తా.. కాసుకో అని హెచ్చరించారు. పంట చేతికొచ్చినా కొనే దిక్కు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మా రాజేందరన్నకు కేసీఆర్‌ అన్యాయం చేశారని, హుజూరాబాద్‌ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారన్నారు. ప్రచారం చేసుకోకుండా అధికార పార్టీ అడుగడుగునా అడ్డు పడుతోందన్నారు. అనంతరం చల్లూరు సభలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలో పింఛన్లు ఇవ్వలేని దద్దమ్మ మంత్రులుగా ఉన్నామని, ఇప్పుడు బయటికి వచ్చి గట్టిగా మాట్లాడి బానిసత్వం నుంచి బయటపడ్డందుకు గర్వంగా ఉందన్నారు. ఎంగిలి మేతుకుల కోసం ఆశపడే బ్రోకర్లు నా మీద నేనే దాడి చేసుకుంటానని చెబుతున్నారని, వాళ్ల భరతం పడుతానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు పుప్పాల రఘు, రామిడి ఆదిరెడ్డి, మారముల్ల కొంరయ్య, చొప్పరి జయశ్రీ, గౌతమ్‌రెడ్డి, పుల్లూరి కుమార్‌, గాజుల శ్యాంసన్‌, గడ్డం కుమారస్వామి, సదాశివారెడ్డి, రంగారెడ్డి, రాపర్తి అఖిల్‌, మహ్మద్‌ అఖిల్‌, నరేష్‌గౌడ్‌, నర్సింహరాజు  పాల్గొన్నారు.


అవినీతి సొమ్ము తీసుకొని ఈటలకు ఓటు వేయండి

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు


కాళేశ్వరం అవినీతి సొమ్ము తీసుకొని ఈటలకు ఓటు వేయండని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సోమవారం వీణవంక మండలం ఎలబాకలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే తరలిస్తున్నారన్నారు. హుజూరాబాద్‌లో ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడుతారని, పింఛన్లు రావని భయపెట్టారని, గెలిచి పది నెలలైనా మీటర్లు పెట్టలేదన్నారు. అబద్ధాల పునాదుల మీదనే టీఆర్‌ఎస్‌ పార్టీ బతుకుతుందన్నారు. కేసీఆర్‌ ధృతరాష్ట్ర సభ నడుపుతున్నాడని, సార్‌ను పొగిడిన వారే ప్రభుత్వంలో ఉంటారని, లేదంటే బయటకు పంపిస్తారన్నారు. చింతమడకలో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినట్లు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి 10లక్షలు ఇవ్వాలన్నారు. వీణవంక టీఆర్‌ఎస్‌ సభలో నిరోషా అనే చెల్లె ఉద్యోగం కోసం అడిగితే పోలీసులు కొట్టారని, ఇలాంటి చర్యలు మంచివి కావన్నారు. కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇల్లు, ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నాడని, తెలంగాణలోని పేద వారికి మాత్రం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వలేదన్నారు.

Updated Date - 2021-10-19T06:02:20+05:30 IST