భళా ‘గోంబే మెన్‌’ శిల్పులు

ABN , First Publish Date - 2020-08-12T08:06:05+05:30 IST

కర్ణాటకలోని కొప్పళ పట్టణానికి చెందిన శ్రీనివాస గుప్తా గృహప్రవేశం సందర్భంగా.. భార్యలేని లోటు కనిపించకూడదని ఆమె మైనపు బొమ్మను చేయించిన విషయం సోషల్‌ మీడియాలో...

భళా ‘గోంబే మెన్‌’ శిల్పులు

  • ఆ మైనపు బొమ్మను చేసింది వారే
  • నిర్వాహకుడి పూర్వీకులూ శిల్పులే

బెంగళూరు, ఆగస్టు 11: కర్ణాటకలోని కొప్పళ పట్టణానికి చెందిన శ్రీనివాస గుప్తా గృహప్రవేశం సందర్భంగా.. భార్యలేని లోటు కనిపించకూడదని ఆమె మైనపు బొమ్మను చేయించిన విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. జీవం ఉట్టిపడేలా ఆ మైనపు బొమ్మను తీర్చిదిద్దిన కళాకారులు ఎవరని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరులో విగ్రహాలు తయారు చేసే ప్రముఖ సంస్థ ‘గోంబే మెన్‌’ ఆ బొమ్మను తయారు చేసినట్టు తెలిసింది.


ప్రముఖ శిల్పి ఎం.శ్రీధర్‌ మూర్తి 2017లో ఈ సంస్థను స్థాపించారు. తమ పూర్వీకులూ శిల్పులేనని, మైసూరు రాజుల కొలువులో వారు పనిచేశారని శ్రీధర్‌ మూర్తి చెప్పారు. గత 200 సంవత్సరాలుగా తమ పూర్వీకులు ఇదే వృత్తిలో ఉన్నారని తెలిపారు. విజయనగర రాజుల కాలంలోనూ తమ పూర్వీకులు హంపిలో శిల్పులుగా కొనసాగారని పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్‌ దర్బారులో తన ముత్తాత తిప్పాజీ శిల్పిగా కొనసాగారని, టిప్పు సుల్తాన్‌ మరణానంతరం ముమ్ముడి కృష్ణరాజ్‌ వడయార్‌ దర్బారులో శిల్పిగా కొనసాగారని ఆయన తెలిపారు.  


సివిల్‌ ఇంజనీరు నుంచి శిల్పిగా..

శివమొగ్గ జిల్లా షికారీపూర్‌కు చెందిన శ్రీధర్‌ మూర్తి సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. ఆయన తండ్రి కాశీనాథ్‌ కూడా ప్రముఖ శిల్పే. మురుదేశ్వర్‌లోని శివుడి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పుల్లో కాశీనాథ్‌ ఒకరు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన శ్రీధర్‌ మూర్తి తానూ శిల్పి కావాలని నిర్ణయించుకొని 1980లలో బెంగళూరు లోని చిత్రకళా పరిషత్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యను అభ్య సించారు. 2000 సంవత్స రంలో తండ్రి గుండెపోటుతో మరణించాక, శిల్పకళా బాధ్యతలను తాను చేపట్టానని శ్రీధర్‌ వివరించారు. తన తండ్రి మరణించాక శివుడి విగ్రహాన్ని తాను పూర్తి చేశానని, దాన్ని మురుదేశ్వర్‌లో 2004లో ప్రతిష్ఠించారని చెప్పారు. గడగ్‌లోని బసవేశ్వర విగ్రహాన్ని, సిక్కింలోని సోలో ఫోక్‌ సెంటర్‌లో 85 అడుగుల శివుడి విగ్రహాన్ని, మధ్యప్రదేశ్‌లోని చైతన్య నగ రంలో 85అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని తానే తయారు చేశానని చెప్పారు. తన సేవలను గుర్తించిన కేంద్రం.. లండన్‌లో బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటులో తన సేవలను వినియోగించుకుందని శ్రీధర్‌ మూర్తి తెలిపారు. 2018లో సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియంను సందర్శించానని, అక్కడ జీవం ఉట్టిపడే మైనపు బొమ్మలను చూసి స్ఫూర్తి పొందానని, అప్పటి నుంచి మైనపు విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించానని చెప్పారు. 


Updated Date - 2020-08-12T08:06:05+05:30 IST