ధాన్యం విక్రయాల్లో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-01-13T06:59:54+05:30 IST

ధాన్యం విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగింది. విక్రయించకుండానే పేర్లు నమోదు చేసి డబ్బులు స్వాహా చేశారు. ధాన్యం అమ్మకుండానే రైతుల ఖాతాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ డబ్బులు జమ చేశాడు. సుమా రు రూ.85లక్షలు స్వాహా అయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తిం చారు.

ధాన్యం విక్రయాల్లో గోల్‌మాల్‌

ఆపరేటర్‌, రైస్‌మిల్లు యజమాని ప్రమేయం

విక్రయించకుండానే విక్రయించినట్లు మాయాజాలం

ధాన్యం విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగింది. విక్రయించకుండానే పేర్లు నమోదు చేసి డబ్బులు స్వాహా చేశారు. ధాన్యం అమ్మకుండానే రైతుల ఖాతాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ డబ్బులు జమ చేశాడు. సుమా రు రూ.85లక్షలు స్వాహా అయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తిం చారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే రూ.33లక్షలు రికవ రీ  చేసినట్లు సమాచారం. మిగిలిన డబ్బుల రికవరీ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

- సూర్యాపేట/ఆత్మకూర్‌(ఎస్‌)

ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని గట్టికల్‌, ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో సుమారు రూ.85లక్షలకు పైగా ధాన్యం విక్రయించకున్నా ప్రభుత్వం నుంచి బినామీల ఖాతాల్లోకి డబ్బులు జమ అయింది. పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలోని సూర్యాపేట మునిసిపల్‌ పరిధిలోని కుడకుడకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ యువకుడిని ఆపరేటర్‌గా నియమించారు. ముక్కుడుదేవులపల్లి గ్రామంలోని కేంద్రంలో సుమారుగా 29వేల బస్తాల ధాన్యం వాస్తవంగా కొనుగోలు చేయగా అదనంగా 4358బస్తాల ధాన్యం విక్రయించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అదే మండలంలోని గట్టికల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో 15వేల 360క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ముగిసి కేంద్రం ముగిసిన వారం రోజులకు 7వేల క్వింటాళ్ల ధాన్యం విక్రయించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ కేంద్రాలు కొనుగోలు పూర్తయ్యాక కేంద్రాలను మూసి వేసి మండల, జిల్లా అధికారులకు ధాన్యం విక్రయాల రికార్డులు అప్పగించారు. ఈతతంగం అంతా గతేడాది డిసెంబరు 25లోపు పూర్తైంది. రోజు వారీగా రిపోర్టు ప్రకారం విక్రయించిన ధాన్యం వివరాలు కింది స్థాయి సిబ్బంది జిల్లా అధికారులకు పంపించడంతో పాటు రికార్డులు, ట్రక్‌ షీట్లను అందజేసినట్లు సమాచారం. జిల్లాలో అన్ని కేంద్రాల నుంచి ఆపరేటర్ల వద్ద ఉన్న ట్యాబ్‌లను అధికారులు స్వాదీనం చేసుకొని ఈ రెండు కేంద్రాల్లో మాత్రం ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోకపోవడం విశేషం. ఈ రెండు కేంద్రాల నిర్వహణ పీఏసీఎస్‌, ఐకేపీ వేర్వేరు అయినప్పటికీ పీఏసీఎ్‌సలో పనిచేస్తున్న ఆపరేటర్‌ ఐకేపీ కేంద్రంలో పనిచేస్తున్న ఆపరేటర్‌ వద్ద ట్యాబ్‌ను తీసుకొని సుమారు ఒక కేంద్రంలో 7వేల క్వింటాళ్లు, మరో కేంద్రంలో 4358 బస్తాల ధాన్యం విక్రయించినట్లు నమోదు చేశారు. వాస్తవంగా విక్రయించిన ధాన్యం కంటే అదనంగా చూపించడంతో డిసెంబరు 31న జిల్లా అధికారులకు అనుమానం వచ్చింది. వాస్తవంగా వచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాలు మూసి వేశాక అదనంగా పెద్ద మొత్తంలో ధాన్యం విక్రయించినట్లు ట్యాబ్‌లో నమోదు కావడం ట్రక్‌ షీట్లు చూపించడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ అక్రమ నమోదులో నేరేడుచర్ల మండలం సమీపంలోని ఓ రైస్‌ మిల్లుకు సంబంధం ఉన్నట్లు తేలింది. అనుమానం వచ్చిన జిల్లా అధికారులు ఐకేపీ, పీఏసీఎస్‌ మండలానికి చెందిన సిబ్బందిని పిలిపించి విచారించినట్లు సమాచారం. అప్పటి కే సుమారు రూ.50లక్షలకు పైగా బినామీ రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఆపరేటర్‌ను పిలిపించి విచారించగా తాను చేసిన తప్పును ఒప్పుకోవడంతో విషయాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. మండల స్థాయిలో అధికారులు, సిబ్బంది ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. జిల్లా అధికారులు కుడకుడకు చెందిన ఆపరేటర్‌ వెనుక ఉన్న రాజకీయ నేతలను బయటికి రాకుండా ఆపరేటర్‌ ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ అక్రమ ట్రక్‌ షీట్ల ద్వారా కాజేసిన కొంత సొమ్మును రికవరీ చేయాలని ఆదేశించారు. రెండు రోజుల క్రితం రూ.33 లక్షలు బాధిత ఆపరేటర్‌ రికవరీ సొమ్మును బ్యాంక్‌లో జమ చేయగా ఇంకా కొంత జమ చేయాల్సి ఉంది. 

కేంద్రాల్లో ధాన్యం వివరాలు

పీఏసీఎస్‌ పరిధిలో ముక్కుడుదేవులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 29వేల బస్తాల ధాన్యం రైతులు నుంచి కొనుగోలు చేశారు. కేంద్రాలు ముగిశాక అక్రమంగా 4358 క్వింటాళ్లు అదనంగా వచ్చి చేరాయి. గట్టికల్‌లో గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో వాస్తవంగా 15వేల 360.80క్వింటాళ్లు కొనుగోలు చేయగా, కేంద్రం ముగిశాక వారం రోజులకు అదనంగా 7వేల క్వింటాళ్లు అక్రమంగా వచ్చి చేరాయి. పీఏసీఎస్‌ పరిధిలో రూ.34లక్షలు, ఐకేపీ పరిధిలో సుమారు కోటి 34లక్షలు అక్రమంగా నమోదైన ధాన్యానికి డబ్బులు దుర్వినియోగమయ్యాయి. ట్రక్‌ షీట్ల నెంబర్లు 28902, 28906, 28909, 28910, 28912లో 12మంది బినామీ రైతుల ఖాతాల్లో ధాన్యం అమ్మకున్న డబ్బులు జమఅయ్యాయి.

నెలకు రూ.10వేల వేతనంతో తాత్కాలిక ఉద్యోగం చేసే ట్యాబ్‌ ఆపరేటర్‌ ఒకేసారి రూ.85 లక్షల ధాన్యం విక్రయాల ప్రభుత్వ ధనాన్ని గోల్‌మాల్‌ చేయడంలో రాజకీయ హస్తం ఉందనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది, మండల స్థాయి అధికారులకు కొంత మేర సమాచారం ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రా లు ముగిసేన తర్వాత కూడా వెలుగులోకి రాకపోవడంపై అనుమానాలకు దారి తీస్తున్నాయి. సుమారు 20రోజుల క్రితం మూసి వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు జిల్లా స్థాయి అధికారులు హడావుడిగా విచారణ చేపట్టడం, వాటాలు కుదరలేదన్న అనుమానాలకు దారి తీస్తున్నాయి. కేంద్రాలు ముగిసినా రికార్డులు, ట్రక్‌ షీట్లు అధికారులకు అప్పగించినప్పటికీ కొనుగోలు కేం ద్రాలు ముగిసిన తర్వాత 7ట్రక్‌ షీట్లు ఆపరేటర్‌ చేతికి వచ్చాయి. ఆ ఏడు ట్రక్‌ షీట్లు సివిల్‌ సప్లయ్‌ కార్యాలయం నుంచి వచ్చినట్లు సమాచారం. సాధారణ ఆపరేటర్‌, రైస్‌ మిల్లు యజమాని వేలాది బ స్తాల ధాన్యాన్ని కొనుగోలు చేయకున్న కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి లక్షల రూపాయల దుర్వినియోగానికి పాల్పడేంత ధైర్యం ఉండకపోవచ్చని ఇందులో ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు గ్రామాల్లోనే రూ.కోటి 70లక్షలకు పైగా గోల్‌మాల్‌ కాగా జిల్లాలో 300కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ధాన్యం కొనుగోలు అక్రమాలపై మంత్రి జగదీష్‌రెడ్డి సీరియస్‌

ఆత్మకూర్‌(ఎస్‌)మండలంలో జరిగిన ధాన్యంకొనుగోలు అక్రమాలపై మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.విచారణ జరిపించి కఠిన చర్యలు చేపట్టాలంటూ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని ఆదే శించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అక్రమాలపై సంబంధిత దోషులను కఠినంగా శిక్షించాలని కొరినట్లు తెలుస్తోంది.

రూ. 85లక్షలు వేరే అకౌంట్‌లోకి జమ అయిన విషయం వాస్తవమే

పీఏసీఎ్‌సలో పని చేస్తున్న ఒక ఆపరేటర్‌ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం కొనుగోలు చేయకున్నా ఇతర ఖాతాల్లోకి నిధు లు మళ్లించాడు. సుమారు రూ.85లక్షలు దుర్వినియోగం జరిగింది. రూ.33 లక్షలు రికవరీ చేశాం. మిగిలినవి కూడా అనర్హుల నుంచి రాబడతాం. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. 

- రాంపతి, పౌర సరఫరాల శాఖ మేనేజర్‌  

Updated Date - 2022-01-13T06:59:54+05:30 IST