బంగారం @రూ.68,000!

ABN , First Publish Date - 2020-06-26T06:01:03+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంది. ఇప్పట్లో బయటపడే అవకాశాలు కన్పించడం లేదు. ఈ అనిశ్చితిలో భద్రమైన పెట్టుబడి సాధనమేదైనా ఉందా..? అంటే అది బంగారమే...

బంగారం @రూ.68,000!

  • రెండేళ్లలో చేరుకునే చాన్స్‌


ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంది. ఇప్పట్లో బయటపడే అవకాశాలు కన్పించడం లేదు. ఈ అనిశ్చితిలో భద్రమైన పెట్టుబడి సాధనమేదైనా ఉందా..? అంటే అది బంగారమే. ఈక్విటీ మార్కెట్లో తీవ్ర ఊగిసలాటల నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పసిడిలోకి మళ్లిస్తున్నారు. దాంతో, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డెన్‌ ర్యాలీ కొనసాగుతోంది. దేశీయంగానూ పుత్తడి రేటు రూ.50,000 మైలురాయిని దాటేసి సరికొత్త ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. 


మున్ముందూ అప్‌ట్రెండే..

బంగారం ధరల్లో అప్‌ట్రెండ్‌ మున్ముందూ కొనసాగనుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ‘‘మార్కెట్‌ ట్రెండ్‌  బంగారానికి  సానుకూలంగా కన్పిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ప్రపంచ వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్‌ భారీగా కోత పెట్టడంతో పసిడికి డిమాండ్‌ మరింత పెరగనుంది. వచ్చే 1-2 నెలల్లో 10 గ్రాముల బంగారం రూ.51,000 స్థాయికి ఎగబాకవచ్చ’’ని ఏంజెల్‌ బ్రోకింగ్‌ కమోడిటీస్‌, కరెన్సీ రీసెర్చ్‌ విభాగ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూజ్‌ గుప్తా అన్నారు. 

పసిడి ధరల ర్యాలీ స్వల్పకాలానికి మించి కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీస్‌, కరెన్సీ విభాగ అధిపతి కిశోర్‌ నార్నే అన్నారు. వచ్చే 18-24 నెలల్లో దేశీయంగా ధర రూ.65,000-68,000కు చేరుకునే అవకాశాలు లేకపోలేవంటున్నారు. అయితే, ఇది డాలర్‌-రూపాయి మారకం రేటు కదలికలపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. 


కొవిడ్‌  తర్వాత కొనసాగనున్న ర్యాలీ 

కరోనా తగ్గుముఖం పట్టాక కూడా బంగారంలో పెట్టుబడులు మంచి రిటర్నులు పంచనున్నాయని నార్నే అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చాలా సమయం పట్టేలా ఉందని, కరోనా నుంచి ఊరట కల్పించేందుకు అగ్ర రాజ్యాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ప్రకటించిన ద్రవ్య సడలింపు చర్యలు కనీసం రెండేళ్ల వరకు కొనసాగవచ్చన్నారు. ఈ చర్యలు మార్కెట్లో పసిడి ధరలను ప్రోత్సహించవచ్చన్నారు. 


కాస్త దిగొచ్చే..

ఈ వారంలో ఆల్‌టైం రికార్డుకు చేరిన బంగారం ధరలు గురువారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాములకు రూ.293 తగ్గి రూ.49,072కు జారుకుంది. వెండి కిలోకు రూ.598 తగ్గి రూ.48,705గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ తగ్గడం ఇందుకు కారణమైంది. అక్కడ ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు 1,767 డాలర్లకు, సిల్వర్‌ 17.58 డాలర్లకు దిగివచ్చింది. బుధవారం నాడు ఢిల్లీలో తులం బంగారం రూ.49,365గా, కేజీ సిల్వర్‌ రూ.49,303గా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం బంగారం రూ.50 వేల ఎగువనే కొనసాగుతోంది. కాకపోతే, 24 క్యారెట్ల ధర రూ.50,370కి, 22 క్యారెట్ల రేటు రూ.46,160కి దిగివచ్చింది. 


Updated Date - 2020-06-26T06:01:03+05:30 IST