Abn logo
Oct 24 2020 @ 02:03AM

పసిడికి పండగ కళ

  • ఊపందుకున్న కొనుగోళ్లు.. కలిసొస్తున్న ధర 


ముంబై: దసరా, దీపావళి పండగల సీజన్‌తో నగల దుకాణాలు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. గత వారం నుంచే అమ్మకాలు ఊపందుకున్నాయి. కరోనా, లాక్‌డౌన్లతో కొనుగోళ్లు వాయిదా వేసుకున్న ప్రజలు మళ్లీ కొనుగోళ్లకు దిగారు. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.49,200 నుంచి రూ.51,000 మధ్య స్థిరంగా ఉండడం కూడా ఇందు కు కలిసొస్తోంది. ఈ సంవత్సరం అమ్మకాల్లో 60 -65 శాతం ఈ పండగల సీజన్‌లోనే పూర్తవుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే నిన్నమొన్నటి వరకు అమ్మకాలు 20-25 శాతం మించేవి కావు. గత వారం రోజుల నుంచి మాత్రం అమ్మకాలు కొవిడ్‌ ముందు తో పోలిస్తే 40 శాతానికి చేరాయి. పెళ్లిళ్ల సీజన్‌ కూ డా ప్రారంభమైతే అమ్మకాలు మరింత పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


తయారీనే సమస్య 

డిమాండ్‌ పుంజుకున్నా నగల తయారీ వ్యాపారులకు అందుకు తగ్గట్టుగా ఆభరణాలను తయారు చేయలేకపోవటం పెద్ద సమస్యగా మారింది. కరోనా దెబ్బతో నగల తయారీ కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారిలో ఇంకా చాలా మంది ఇంకా తిరిగి రాలేదు. నగల వ్యాపారులు కూడా డిమాండ్‌ ఇప్పట్లో కోలుకోదనే అంచనాతో వారిని మళ్లీ పనుల్లోకి తీసుకొచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు నగలు అందించడం పెద్ద సమస్యగా మారింది. కార్మికులు పూర్తిగా పనుల్లోకి వస్తే తప్ప, ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం లేదని భావిస్తున్నారు. దీపావళి నాటికి ఈ సమస్య తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement