గోవిందుడి విమాన గోపురానికి బంగారు తాపడం

ABN , First Publish Date - 2021-07-25T07:13:17+05:30 IST

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

గోవిందుడి విమాన గోపురానికి బంగారు తాపడం
ఆలయంలో వివరాలు తెలుసుకుంటున్న జవహర్‌రెడ్డి

రూ.32 కోట్ల విలువైన వంద కిలోల పసిడితో ఏర్పాటు: ఈవో


తిరుపతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఆలయంలో శనివారం మధ్యాహ్నం జీయంగార్లు, వైఖానస ఆగమ సలహాదారు, అర్చకులు, అధికారులతో సమీక్షించారు. బంగారు తాపడం పనులు చేయటానికి ముందు బాలాలయం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీయర్లు, ఆగమపండితులు తెలిపారు. ఆలయ కల్యాణ మండపంలో బాలాలయ ఏర్పాటు ఈ ఏడాది సెప్టెంబరు 13వ తేదీలోపు పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అదేనెల 14 నుంచి బంగారు తాపడం పనులు ప్రారంభించాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు అవసరమైన రూ.32కోట్ల విలువైన వంద కిలోల బంగారాన్ని టీటీడీ ట్రెజరీ నుంచి తీసుకోవాలన్నారు. పనులు 2022 మేలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. భక్తులకు మూలమూర్తి దర్శనం ఉంటుందని, కైంకర్యాలు మాత్రం బాలాలయంలో నిర్వహించనున్నట్టు వివరించారు. అనంతరం అద్దాల మహల్‌ను ఈవో సందర్శించి.. మరింత ఆకర్షణీయంగా ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. పెద్ద, చిన్న జీయర్‌ స్వాములు, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుభట్టాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసదీక్షితులు, జేఈవో సదాభార్గవి, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్‌.ఎ.అండ్‌ సీఏవో బాలాజీ, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవోలు రాజేంద్రుడు, గోవిందరాజులు, ఏఈవో రవికుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T07:13:17+05:30 IST