ఇంట్లో పరిశీలిస్తున్న క్లూస్ టీం
రూ. 30 వేల నగదూ..
రాపూరు, మే 26: కాబోయే అల్లుడి కోసం చేయించిన బంగారు నగలు అపహరణకు గురైన సంఘటన రాపూరులోని పడమర అగర్తకట్టలోని ఓ ఇంట్లో గురువారం తెల్లవారుజామున జరిగింది. రోశయ్య, ఆయన కుటుంబ సభ్యులంతా బుధవారం సమీప గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టారు. సీసీ కెమెరాలు ఉండొచ్చన్న అనుమానంతో విద్యుత్ వైర్లు కట్‌చేశారు. ఇంట్లో బెడ్ కింద ఉన్న ఆరున్నర సవర్ల బంగారంతోపాటు, రూ.30వేల నగదు దోచుకెళ్లారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానికులు కుటుంబ యజమానికి ఫోన్ చేసి సమాచారం చెప్పారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి వివరాలు సేకరించింది. వచ్చే నెలలో తన ఇంట్లో శుభకార్యం ఉన్నందున కాబోయే అల్లుడి కోసం చేసిన బంగారు ఆభరణాలు చేయించి పెట్టినట్టు బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 30ఏళ్ల కిందట ఏర్పడిన కాలనీలో తొలిసారిగా చోరీ జరగడంతో కాలనీ వాసులు హడలిపోతున్నారు.