గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా?

ABN , First Publish Date - 2020-11-01T08:51:10+05:30 IST

ఆర్థిక అత్యవసరాలు తీర్చుకునేందుకు మెరుగైన ప్రత్యామ్నాయం గోల్డ్‌ లోన్‌. వ్యక్తిగత రుణం కంటే తక్కువ వడ్డీ రేటు. మంజూరూ సులభం. అయితే, బంగారం రుణం తీసుకునే ముందు ఆయా బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ చార్జీలను తప్పక పరిశీలించండి...

గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా?

ఆర్థిక అత్యవసరాలు తీర్చుకునేందుకు మెరుగైన ప్రత్యామ్నాయం గోల్డ్‌ లోన్‌. వ్యక్తిగత రుణం కంటే తక్కువ వడ్డీ రేటు. మంజూరూ సులభం. అయితే, బంగారం రుణం తీసుకునే ముందు ఆయా బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ చార్జీలను తప్పక పరిశీలించండి. ఆ తర్వాతే ఎక్కడి నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకోండి. 




గతంతో పోలిస్తే బంగారం తాకట్టుపై అధిక రుణం లభిస్తోంది. ఎందుకంటే, ఈ ఏడాదిలో పసిడి ధరలు అనూహ్యంగా పెరిగాయి. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ కూడా గోల్డ్‌ లోన్‌ నిబంధనలను సడలించింది. తాకట్టు పెట్టే బంగారంపై పొందగలిగే గరిష్ఠ రుణ పరిమితి ‘లోన్‌ టు వేల్యూ’ (ఎల్‌టీవీ) నిష్పత్తిని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. 2021 మార్చి 31 వరకు ఈ సడలింపు అమలులో ఉంటుంది. అంటే, ప్రస్తుతం తాకట్టు పెట్టే బంగారం మార్కెట్‌ విలువలో 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు, మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ లేని వారికి గోల్డ్‌ లోన్‌ మంచి ప్రత్యామ్నాయం. అయితే, రుణగ్రహీతలు ముందుగా దృష్టి సారించాల్సిన అంశాలు.. 


  1. ఆయా బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీలు, గోల్డ్‌ లోన్‌ కంపెనీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ రుసుము తదితర చార్జీలను పోల్చి చూసుకోవాలి. రుణ నిబంధనలనూ పరిశీలించాలి. తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ చార్జీలతో పాటు నిబంధనలపరంగానూ మీకు అనువైన బ్యాంక్‌ లేదా సంస్థను ఎంచుకోవాలి.
  2. తనఖా పెట్టబోయే బంగారం స్వచ్ఛతను పరిశీలించాలి. తద్వారా మీకు అవసరమైన నిధులు సమకూరుతాయో లేదో చూసుకోండి. 
  3. తాకట్టు పెట్టే బంగారం మార్కెట్‌ విలువలో గరిష్ఠ పరిమితి వరకు రుణం తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు రుణం తీసుకున్న తర్వాత మార్కెట్లో బంగారం ధర అమాంతం తగ్గితే రుణదాత మరింత బంగారాన్ని తాకట్టు పెట్టాలని లేదా సర్దుబాటు కోసం రుణాన్ని పాక్షికంగా తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేయవచ్చు. 
  4. రుణం తిరిగి చెల్లింపునకు సంబంధించి, మీ వెసులుబాటును బట్టి ముందస్తు ప్రణాళికను కలిగి ఉండటం మేలు. తిరిగి చెల్లింపులు జాప్యమైతే అదనపు వడ్డీ, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. చెల్లింపుల్లో పూర్తిగా విఫలమైతే, తాకట్టు పెట్టిన బంగారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తత్ఫలితంగా మీ క్రెడిట్‌ స్కోరూ తగ్గుతుంది. 

Updated Date - 2020-11-01T08:51:10+05:30 IST