గోల్డ్‌ జిగేల్‌

ABN , First Publish Date - 2022-07-29T08:42:48+05:30 IST

ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) భారత్‌లో పసిడి గిరాకీ 43 శాతం పెరిగి 170.7 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.

గోల్డ్‌ జిగేల్‌

క్యూ2లో 43% పెరిగిన పసిడి గిరాకీ జూ 170.7 టన్నులుగా నమోదు: డబ్ల్యూజీసీ 


ముంబై: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) భారత్‌లో పసిడి గిరాకీ 43 శాతం పెరిగి 170.7 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. గురువారం విడుదలైన డబ్యూజీసీ నివేదిక ప్రకారం.. 2021లో ఇదే కాలానికి గోల్డ్‌ డిమాండ్‌ 119.6 టన్నులుగా నమోదైంది. విక్రయాల విలువపరంగా చూస్తే, ఈ ఏప్రిల్‌-జూన్‌ కాలానికి బంగారం గిరాకీ 54 శాతం వృద్ధితో రూ.79,270 కోట్లకు పెరిగింది. గత ఏడాదిలో ఇదే త్రైమాసికానికి విక్రయాల విలువ రూ.51,540 కోట్లుగా ఉంది. రిపోర్టులోని మరిన్ని విషయాలు.. 


 అక్షయ తృతీయతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్ల దన్నుతో ఈ క్యూ2లో స్వర్ణాభరణాల గిరాకీ  49 శాతం పెరిగి 140.3 టన్నులకు చేరుకుంది. విలువపరంగా గిరాకీ 60 శాతం పెరిగి రూ.65,140 కోట్లుగా నమోదైంది. 

 పెట్టుబడి అవసరాల కోసం బంగారం కొనుగోళ్లు 20 శాతం పెరిగి  30.4 టన్నులకు చేరుకోగా.. విలువపరంగా 29 శాతం వృద్ధితో రూ.14,140 కోట్లకు పెరిగాయి. 

 దేశీయంగా గోల్డ్‌ రీసైక్లింగ్‌ 18 శాతం పెరిగి 23.3 టన్నులుగా నమోదైంది. విదేశాల నుంచి బంగారం దిగుమతులు 34 శాతం పెరుగుదలతో 170 టన్నులకు చేరుకున్నాయి. 

 క్యూ2లో ప్రపంచవ్యాప్త పసిడి గిరాకీ మాత్రం 8 శాతం తగ్గి 948.4 టన్నులకు పరిమితమైంది. అమెరికన్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్‌ క్రమంగా బలపడుతుండటం విలువైన లోహాల డిమాండ్‌ను తగ్గించింది. గత ఏడాది క్యూ2లో గోల్డ్‌ డిమాండ్‌ 1,031.8 టన్నులుగా ఉంది. 


సిల్వర్‌ హైజంప్‌: దేశీయంగా విలువైన లోహాల ధరలు గురువారం భారీ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ.592 పెరిగి రూ.51,750కి చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.1,335 ఎగబాకి రూ.56,937 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. అక్కడ ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 1,747 డాలర్లకు పుంజుకోగా.. సిల్వర్‌ 19.38 డాలర్ల వద్ద ట్రేడైంది. 


ద్వితీయార్ధంలో గిరాకీకి గండి 

ఈ ఏడాది ప్రథమార్ధానికి (జనవరి-జూన్‌) దేశంలో బంగారం గిరాకీ 42 శాతం వృద్ధితో 306.2 టన్నులకు చేరుకుంది. ద్వితీయార్ధం (జూలై-డిసెంబరు)లో మాత్రం పసిడి డిమాండ్‌కు గండి పడనుందని డబ్ల్యూజీసీ భావిస్తోంది. గత ఏడాది ద్వితీయార్ధం స్థాయి కంటే తగ్గనుందని అంటోంది. ధరాఘాతం, రూపాయి క్షీణత, ప్రభుత్వ విధానపరమైన చర్యలు తదితర అంశాలు బంగారం కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈఓ, ఇండియా, సోమసుందరం పీఆర్‌ అన్నారు. అధిక ధరలతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు రేటు తగ్గిందని, ఈ పరిణామం రూరల్‌ మార్కెట్లో బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపనుందన్నారు. ఈ ఏడాది పసిడి గిరాకీ 800-850 టన్నుల స్థాయిలో ఉండవచ్చని డబ్ల్యూజీసీ గతంలో అంచనా వేసింది. కానీ, ద్వితీయార్ధంలో డిమాండ్‌ తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో అంచనాను 800 టన్నులకు పరిమితం చేస్తున్నట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. 2021లో గోల్డ్‌ డిమాండ్‌ 797 టన్నులుగా నమోదైంది. 

Updated Date - 2022-07-29T08:42:48+05:30 IST