బంగారం బయటకు తీస్తామంటూ ఆశ పెట్టి.. చితకబాది హత్య!

ABN , First Publish Date - 2021-05-17T15:48:58+05:30 IST

ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 13న జరిగింది.

బంగారం బయటకు తీస్తామంటూ ఆశ పెట్టి.. చితకబాది హత్య!

  • హత్య కేసులో నిందితుల అరెస్ట్‌
  • బంగారం బయటకు తీస్తామంటూ ఆశ పెట్టారు..
  • క్షుద్ర పూజలకు డబ్బులు డిమాండ్‌..
  • ఇవ్వకపోవడంతో చితకబాది హత్య

హైదరాబాద్/ఏఎస్‌రావునగర్‌ : క్షుద్ర పూజల కోసం పిలిచాడు. డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆనక డబ్బులు ఇవ్వకపోవడంతో చితకబాది హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 13న జరిగింది. బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ ఆముదాలపాటి రామ్మూర్తి(61) హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. నిందితులను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలు, క్షుద్రపూజలకు ఉపయోగించే వస్తువులు, 6 సెల్‌ఫోన్‌లు, 7వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌యాదవ్‌ వివరాలను వెల్లడించారు. 


కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఆముదాల రామ్మూర్తి(61)కి అదే కాలనీకి చెందిన కొట్ర శ్రీనివా‌స్‌రెడ్డి (50) స్నేహితుడు. కుషాయిగూడ నాగార్జునగర్‌ కాలనీలో నివాసం ఉంటూ క్షుద్రపూజలు చేసే శ్రీకాంత్‌ ఎలియాస్‌ ఆంటోని(35)తో శ్రీనివా‌స్‌రెడ్డికి పరిచయం ఉంది. క్షుద్రపూజల కోసం వచ్చే వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు లాక్కోవడం శ్రీకాంత్‌కు అలవాటు. క్షుద్రపూజల కోసం పరిచయమున్న వ్యక్తులను తీసుకొచ్చే శ్రీనివా్‌సరెడ్డికి శ్రీకాంత్‌ కమీషన్‌ ఇస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీనివా‌స్‌రెడ్డి ఈ నెల 10న  ఆముదాల రామ్మూర్తిని తన ద్విచక్రవాహనంపై కుషాయిగూడ వాసవీశివనగర్‌కు తీసుకువచ్చాడు. అనంతరం శ్రీకాంత్‌కు పరిచయం చేశాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న భూమిలో బంగారం ఉందని, ఇందుకు క్షుద్రపూజలు చేస్తే బంగారం బయటికి తీయవచ్చని ఆశచూపారు. ఇందుకు రామ్మూర్తి అంగీకరించి క్షుద్రపూజలు చేయాలని కోరారు.


పూజలు చేస్తున్న క్రమంలో వీడియోలు తీశారు. ఆ తర్వాత ఆ వీడియోలను నెట్‌లో పెడతామని రామ్మూర్తిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజాలని ప్రయత్నించారు. ఒక గదిలో బంధించి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు రూ.7లక్షలు ఇవ్వడానికి రామ్మూర్తి అంగీకరించి తన బంధువులకు ఫోన్‌ చేశాడు. ఇలా రెండు రోజులపాటు ఈ వ్యవహారం నడిచింది. చివరకు డబ్బులు అందకపోవడంతో శ్రీకాంత్‌, అతడి భార్య అంటోని భాగ్య(34), వీరి ముఠా సభ్యులు శాగంటి వాణిసాగర్‌(37), కొట్ర శ్రీనివా్‌సరెడ్డి(50), జిట్టు సింగ్‌(21), మనోజ్‌సింగ్‌(23)లు కలిసి రామ్మూర్తిని 12వ తేదీన గదిలో చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ఆయన ప్రాణాలొదిలాడు. దీంతో ఆందోళన చెందిన దుండగులు మృతదేహాన్ని గుట్టు చప్పుడుగాకుండా నాగారంలోని అన్నారం చెరువులో పడేశారు. అప్పటికే కుషాయిగూడ పోలీ్‌సస్టేషన్‌లో రామ్మూర్తి అదృశ్యంపై ఫిర్యాదు ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 


చెరువులో దొరికిన మృతదేహం రామ్మూర్తిదేనని తేల్చారు. మృతదేహంపై గాయాలుండడంతో రామ్మూర్తితోపాటు వెంటవెళ్లిన శ్రీనివా్‌సరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కేసు బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులందరినీ వాసవీశివనగర్‌లో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ ఎలియాస్‌ ఆంటోనిపై గతంలో నాచారంతోపాటు, నగరంలోని ఓయూ, చిలకలగూడ, అంబర్‌పేట పీఎ్‌సల పరిధుల్లో పలు స్నాచింగ్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్‌ఐ మదన్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన కుషాయిగూడ పోలీసులను మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె. మూర్తి, ఏసీపీ శివకుమార్‌లు అభినందించారు.

Updated Date - 2021-05-17T15:48:58+05:30 IST