బంగారం భగ్గు

ABN , First Publish Date - 2020-07-28T06:17:46+05:30 IST

పసిడి మిడిసిపడుతోంది. ధరలు భగ్గుమంటున్నాయి. దేశంలోని అన్ని నగరాల బులియన్‌ మార్కెట్లలో గోల్డ్‌ ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో తులం....

బంగారం భగ్గు

సరికొత్త ఆల్‌టైం గరిష్ఠానికి ధర 

హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.54,300

ఒకేరోజు రూ.3,500 పెరిగిన వెండి 

కేజీ ధర రూ.64,700కు చేరిక 


న్యూఢిల్లీ/ముంబై/హైదరాబాద్‌: పసిడి మిడిసిపడుతోంది. ధరలు భగ్గుమంటున్నాయి. దేశంలోని అన్ని నగరాల బులియన్‌ మార్కెట్లలో గోల్డ్‌ ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో తులం (10 గ్రాములు) మేలిమి (24 క్యారెట్లు) బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.730 ఎగబాకి రూ.49,780గా నమోదైంది. వెండిదీ మిడిసిపాటే. కేజీ సిల్వర్‌ ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ తీస్తుండటం ఇందుకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌  1,935 డాలర్లు, వెండి 24 డాలర్ల ఎగవన ట్రేడయ్యాయి. దాంతో ఇంటర్నేషనల్‌ మార్కెట్లోనూ 2011 సెప్టెంబరు నాటి గత ఆల్‌టైం రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై కమ్ముకున్న నీలినీడలు, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న బంగారం, వెండిలోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా, డిమాండ్‌ అన్యూహంగా పెరిగి ధరలు దూసుకెళ్తున్నాయి. మరికొద్ది వారాల్లోనే ఔన్స్‌ బంగారం 2,000 డాలర్ల మైలురాయికి చేరుకోవచ్చని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


హాల్‌మార్కింగ్‌కు 2021 జూన్‌ 1 వరకు గడువు 

బంగారు ఆభరణాలపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ నిబంధన అమలు గడువును 2021 జూన్‌ 1 వరకు పొడిగించారు. ఆభరణంలోని బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్‌. 2021 జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరని గత ఏడాది నవంబరులో ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గడువును పొడిగించినట్లు  వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. అంతేకాదు, అప్పటిలోగా జువెలర్లు.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ (బీఐఎస్‌) వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి కేవలం 14, 18, 22 క్యారెట్ల ఆభరణాల విక్రయానికే అనుమతిస్తామని మంత్రి వెల్లడించారు. 





Updated Date - 2020-07-28T06:17:46+05:30 IST