అక్షయ తృతీయ నాటికి రూ.50,000కు బంగారం!

ABN , First Publish Date - 2020-03-11T06:30:55+05:30 IST

స్టాక్‌ మార్కెట్లు నేలచూపులు చూస్తుండగా.. పసిడి కొండెక్కుతోంది. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం నాడు రూ.45,000 స్థాయిని దాటేసింది.

అక్షయ తృతీయ నాటికి రూ.50,000కు బంగారం!

ప్రస్తుత ధర రూ.45వేలు 

పసిడి ధరలకు ఆజ్యం పోస్తున్న అంశాలు.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి

ప్రపంచ మాంద్యం భయాలు 

కుప్పకూలుతున్న స్టాక్‌ మార్కెట్లు 

క్రూడాయిల్‌ ధరల పతనం 

రూపాయి క్షీణత  

అంతర్జాతీయంగా పసిడికి పెరుగుతున్న డిమాండ్‌ 

కరోనా భయాలు, క్రూడ్‌ క్రాష్‌తో విలువైన లోహాల్లోకి పెట్టుబడులు 


స్టాక్‌ మార్కెట్లు నేలచూపులు చూస్తుండగా.. పసిడి కొండెక్కుతోంది. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం నాడు రూ.45,000 స్థాయిని దాటేసింది. ముంబైలో తులం పసిడి రూ.44,014 పలికింది. హోలీ సందర్భంగా మంగళవారం ఉత్తరాది  బులియన్‌ మార్కెట్లకు సెలవు.  ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందూ ధరలు అప్‌ట్రెండ్‌లోనే పయనించవచ్చని ముంబై జువెలర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. ఉగాదికి లేదంటే అక్షయ తృతీయ (ఏప్రిల్‌ 26) నాటికి బంగారం ధర  రూ.50,000కు చేరుకోవచ్చని జైన్‌ అభిప్రాయపడ్డారు.  


ఇదీ కారణం

కరోనా భయాలకు ముడి చమురు ధరల పతనం కూడా తోడవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో బంగారం, వెండి ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,700 డాలర్లకు ఎగబాకింది. మంగళవారం మళ్లీ కాస్త తగ్గి 1,670 డాలర్లకు జారింది. 


స్వల్పకాలంలో 1,780 డాలర్లకు..?

కరోనా వైరస్‌ ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. పైగా సౌదీ, రష్యా మధ్య మొదలైన ధరల యుద్ధంతో ముడి చమురు ధరలు 20 డాలర్ల వరకు పడిపోవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో సంక్షోభం మరింత తీవ్రతరం కావచ్చని, తత్ఫలితంగా పసిడికి డిమాండ్‌ పెరగవచ్చని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఔన్సు బంగారం ధర 1,700 డాలర్లకు కాస్త అటూ ఇటూగానే ట్రేడ్‌కావచ్చని, స్వల్పకాలంలో 1,780 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో 1,900 డాలర్ల ఎగువకు చేరుకునే అవకాశాలున్నాయని 

వారంటున్నారు. 


టీసీఎస్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిం ది. ఈ నెల 24న ఈ డివిడెండ్‌ను చెల్లించనుంది.

Updated Date - 2020-03-11T06:30:55+05:30 IST