గో.. గో... గోల్డ్‌!

ABN , First Publish Date - 2020-08-07T11:39:06+05:30 IST

బంగారం ధర ఉరుకులు పరుగులు పెడుతోంది. కరోనా కష్టకాలంలోనూ ఎక్కడా ఆగడం లేదు. బంగారం ధర గురువారం ..

గో.. గో... గోల్డ్‌!

గ్రాము బంగారం రూ. 5800.. కేజీ వెండి రూ.74 వేలు

డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే కారణం


నరసాపురం, ఆగస్టు 6 : బంగారం ధర ఉరుకులు పరుగులు పెడుతోంది. కరోనా కష్టకాలంలోనూ ఎక్కడా ఆగడం లేదు. బంగారం ధర గురువారం రికార్డు స్థాయికి చేరింది. బిస్కెట్‌ బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాములు రూ.58 వేలకు చేరింది. అంటే గ్రాము రూ.5,800 పలికింది. బులియన్‌ మార్కెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక రేటు. గత వారంతో పోలిస్తే గ్రాముకు నాలుగు వందలు పెరిగింది. ఇటు వెండి ధర కూడా కొండెక్కింది. గురువారం మార్కెట్‌లో కేజీ ధర రూ.74 వేలు పలికింది. ఈ స్థాయిలో వెండి ధర పదేళ్ల కిందట నమోదైంది. మళ్లీ ఆ స్థాయికి చేరడంతో రానున్న రోజుల్లో కేజీ ధర రూ.లక్షకు చేరవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.


లాక్‌డౌన్‌కు ముందు అంటే మార్చి నెల ఆరంభంలో గ్రాము బంగారం (బిస్కెట్‌) ధర రూ.3,600 నుంచి రూ.3,900 మధ్య ఉండేది. కరోనాతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఒక్కసారిగా పసిడికి డిమాండ్‌ ఏర్పడింది. ఎక్కువ మంది మదుపుదారులు బంగారంపై పెట్టుబడులను సేఫ్‌గా భావించారు. దీంతో అంతర్జాతీయంగా పసిడి, వెండిలకు డిమా ండ్‌ ఏర్పడింది. ఇటు బంగారు గనుల్లో ఉత్పత్తి తగ్గడం, అంతర్జాతీయ రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాకపోవడంతో దిగుమతులు తగ్గాయి. ఈ కారణంగా దేశీయంగా ఉన్న నిల్వలకు డిమాండ్‌ ఏర్పడింది. ఇటు మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధర రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇదే పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగితే పసిడి గ్రాము ధర  రూ.6 వేలను త్వరలో దాటే అవకాశం ఉందని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఇటు వెండి కూడా అతి దగ్గరలో కేజీ రూ.80 వేలు దాటేయవచ్చునంటున్నారు.


Updated Date - 2020-08-07T11:39:06+05:30 IST