పొట్టకూటికోసం వెళుతూ తిరిగిరాని లోకాలకు....

ABN , First Publish Date - 2021-02-25T06:33:24+05:30 IST

పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళుతున్న విశాఖ జిల్లా కూలీలు...పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

పొట్టకూటికోసం వెళుతూ తిరిగిరాని లోకాలకు....
మృతులు రాజాన దేముళ్లు(పైల్‌పొటో),

‘పశ్చిమ’లో రోడ్డు ప్రమాదం

టి.అర్జాపురానికి చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి

మరో నలుగురికి తీవ్రగాయాలు


రావికమతం, ఫిబ్రవరి 24

పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళుతున్న విశాఖ జిల్లా కూలీలు...పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రావికమతం మండలం టి.అర్జాపురానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు, మృతుల కుటుంబీకులు చెప్పిన సమాచారం మేరకు వివరాలు...

రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామానికి చెందిన 12 మంది కూలీలు కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో మినుము పంట కోత పనులకోసం మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బొలేరో వాహనంలో బయలుదేరారు. వాహనం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్దకు చేరుకునే సరికి డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. కూలీలంతా ఒకరిపైమరొకరు పడిపోవడంతో వాహనం వెనుక డోర్‌ ఊడిపోయింది. దీంతో ఆరుగురు కూలీలు రోడ్డుపై పడిపోయారు. వీరిలో రాజాన దేముళ్లు (33), యర్రంశెట్టి నూకునాయుడు (41) తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. యర్రంశెట్టి కొండలరావు, రాజాన తాతలు, ఇల్లపు శ్రీను, రాజాన శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలినవారు ఈ ప్రమాదం గురించి గ్రామస్థులకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరు అయ్యారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, కూలి పనులు ముగించుకుని 15 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి....తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ రాజాన దేముళ్లు భార్య చేస్తున్న రోదనలు అక్కడున్న వారికి కంటి తడి పెట్టించాయి. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయాలని సర్పంచ్‌ మడగల అర్జున, రైతు సంఘం నాయకుడు రాజాన రవిప్రకాశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-02-25T06:33:24+05:30 IST