ఉపాధి కోసం వెళుతూ అనంతలోకాలకు

ABN , First Publish Date - 2022-05-25T06:37:16+05:30 IST

జీవనోపాధికోసం వలస వెళుతూ ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ఉపాధి కోసం వెళుతూ అనంతలోకాలకు
మిర్యాలగూడలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

 రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడి మృతి 

మరో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన

మిర్యాలగూడ అర్బన్‌, మే 24: జీవనోపాధికోసం వలస వెళుతూ ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండజిల్లా మిర్యాలగూడ పరిధిలోని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం ఈ ఘటన జరిగింది. ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుగొండ మండలం జెడ్డవారిపాలెం గ్రామానికి చెందిన వల్లపు ఆంజనేయులు(31) ద్విచక్రవాహనంపై తోటికార్మికుడు దేవర్ల నాని, గుంజ జానకి రాములుతో కలిసి మెదక్‌జిల్లా కేంద్రానికి బయలుదేరాడు. కొన్ని నెలలుగా మెదక్‌జిల్లాకేంద్రంలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్న ఆంజనేయులు, నాని ఇటీవలే స్వగ్రామానికి వచ్చి తమకుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకొని తిరిగి పనిలో చేరేందుకు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఏడుకోట్లతండా వద్ద ఓ ఆటో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, నాని, జానకిరాములు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ఆంజనేయులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిగిడాల సురేష్‌ తెలిపారు. 

Updated Date - 2022-05-25T06:37:16+05:30 IST