వేటకు వెళాయే

ABN , First Publish Date - 2021-06-14T03:46:04+05:30 IST

సముద్రతీరంలో మళ్లీ సందడి రానుంది. సుదీర్ఘ విరామం తరువాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. రెండు నెలలపాటు అమలైన వేట నిషేధానికి సోమవారం అర్థరాత్రితో గడువు ముగియనుంది.

వేటకు వెళాయే
డొంకూరు తీరంలో వలలు సిద్ధం చేస్తున్న మత్స్యకారులు

- నేటి అర్ధరాత్రి నుంచి పునఃప్రారంభం

- తీరంలో సిద్ధమవుతున్న మత్స్యకారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

సముద్రతీరంలో మళ్లీ సందడి రానుంది. సుదీర్ఘ విరామం తరువాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. రెండు నెలలపాటు అమలైన వేట నిషేధానికి సోమవారం అర్థరాత్రితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వేటను పునః ప్రారంభించేందుకు   మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వలలు, తెప్పలను మరమ్మత్తులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మళ్లీ వేలాది బోట్లు సముద్రంలో కనువిందు చేయనున్నాయి. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, రణస్థలం, శ్రీకాకుళం తదితర మండలాల్లో 104 గ్రామాల్లో 4698 రిజిష్టర్‌ బోట్లు, మరో చిన్న చిన్న తెప్పలు 1500 ఉన్నాయి. ఇందులో 16,630 మంది మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తున్నారు. సుమారు లక్ష మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సముద్రంలో ఉండే చేపలు, రొయ్యలు ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో వేట చేస్తే మత్స్య సంపద దెబ్బతింటుంది. ఫలితంగా మత్స్యకారులకు సరైన ఉపాధి లభించదు. దీంతో రెండు నెలలపాటు వేట నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈమేరకు మత్స్యకారులకు రూ. 10 వేలు చొప్పున వైఎస్‌ఆర్‌ భరోసా(భృతి) సాయాన్ని అందజేస్తుంది. అయితే భరోసా జిల్లాలో అర్హులందరికీ చేరలేదు. సుమారు 3,035 మంది సాయం అందక ఎదురు చూస్తున్నారు. వారందరికీ తక్షణమే భరోసా అందజేయాలని వారు కోరుతున్నారు.  


వేటకు సిద్ధమవుతున్నాం

రెండు నెలలు విరామం తరువాత సోమవారం రాత్రి నుంచి సముద్రంలో వేటకు బోట్లు, వలలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుత వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో వేటకు సిద్ధమవుతున్నాం.  

- చలపరాయి.గురుమూర్తి, మత్స్యకార సొసైటి అధ్యక్షులు, డొంకూరు.

 

Updated Date - 2021-06-14T03:46:04+05:30 IST