Abn logo
Dec 23 2020 @ 00:00AM

సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశాన్ని చూశా

రెండేళ్ల కాలంలో 20 రాష్ట్రాల్లోని ద్వాదశ జ్యోతిర్లింగాలనూ, అష్టాదశ శక్తిపీఠాలనూ కేవలం రూ. లక్షా నలభై మూడువేల ఖర్చుతో చుట్టి వచ్చేశారు ముత్యం లలిత రత్నం...పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తితో పాటు ఆసక్తి, ఓపిక, పట్టుదల కలిగి ఉండాలని నిరూపిస్తున్న ఆమె నవ్యతో పంచుకున్న యాత్రా విశేషాలివి...


శ్రీలంకలో సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం ఎంతో ప్రశస్థమైనది. ఆ దేశ సుప్రీం కోర్టు సైతం ఆ ప్రాంతంలో చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. విభీషుణుడిని అక్కడివారు ‘ట్రైటర్‌ ఆఫ్‌ లంక’ (దేశద్రోహి)గా అభివర్ణిస్తారు.ఈ కారణంగానే అతని గుడి బౌద్ధ ఆరామాల వెనక మరుగున పడి ఉంటుంది.


చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, నదులు, వాటి విశిష్టతలు... వీటి సంగతులు వింటూనే నా బాల్యం గడిచింది. ఇందుకు కారణం మా నాన్నమ్మ, తాతయ్యలే! తాతయ్య తేజోమూర్తుల చలమయ్య శాస్త్రి సంస్కృత,  జ్యోతిష పండితుడు. ఆయన దగ్గర పురాణాలు, పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు తెలుసుకుంటూ పెరిగాను. నాన్నమ్మ వెంకటరత్నంతో కలిసి చిన్నప్పటి నుంచే పూజలు, ఉపవాసాలు చేసేదాన్ని. ఆమె నదులు, వాటి విశిష్టత గురించి చెప్పేవారు. వారి సహచర్యంలో నాకు దేవుళ్లు, పురాణాలు, పుణ్యక్షేత్రాల పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లల పెంపకంతో వాటి గురించి చదివి, లోతుగా తెలుసుకోవడం వరకే నా ఆసక్తి పరిమితమైపోయింది. పిల్లలు జీవితాల్లో స్థిరపడిన తర్వాత కాస్త తీరిక చిక్కింది. ఇక యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే దానికి చాలా ఖర్చవుతుందని నాకు తెలుసు. ఒక ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేసి, రిటైర్‌ అయిన నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా యాత్రలు చేయాలనే నియమం పెట్టుకున్నాను. అందుకోసం డబ్బులు కూడబెట్టడం మొదలుపెట్టాను. మొదటిసారి 2012లో శ్రీశైలం వెళ్లి శివదీక్ష తీసుకున్నాను. అష్ఠాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జోతిర్లింగాలను దర్శించుకునే వరం ప్రసాదించమని అమ్మవారిని కోరుకున్నాను.


సీత అగ్నిప్రవేశం చేసిన చోట...

 ఒరిస్సాలోని గిరిజాదేవి శక్తిపీఠాన్ని 2012 మార్చిలో సందర్శించి అక్కడి వైతరిణీ నదిలో మునిగాను. ఆ తర్వాత అస్సాంలోని కామాఖ్యదేవి శక్తిపీఠం దర్శించుకుని, బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేశాను. కోల్‌కతా గంగాసాగర్‌, దక్షిణేశ్వర్‌ సందర్శించాను. రామకృష్ణ పరమహంస అమ్మవారికి ఉపాసన చేసిన గుడి అది. అక్కడే కలకత్తా కాళినీ దర్శించుకున్నాను. నాందేడ్‌ దగ్గర మాహూర్యంలో ఉన్న ఏకవీరాదేవి శక్తిపీఠం చూసి వచ్చాను. తర్వాత కొల్హాపూర్‌లోని మహాలక్ష్మీదేవి శక్తిపీఠం దర్శించుకున్నాను. నర్మదా నది పుష్కరాల సమయంలో ఉజ్జయిని వెళ్లాను. అక్కడ అమ్మవారి శక్తిపీఠం, మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగాలు చూశాను. నర్మదా నదిలో స్నానం చేశాను.


ఇక అమర్‌నాథ్‌ యాత్ర నా జీవితంలో మర్చిపోలేనిది. అక్కడికి ఎవరికి వారు స్వతంత్రంగా వెళ్లే వీలు లేదు. కాబట్టి ట్రావెల్స్‌ కంపెనీల ద్వారా వెళ్లాను. వైష్ణోదేవి, హిమాచల్‌ ప్రదేశ్‌లో జ్వాలాముఖి శక్తిపీఠాలు దర్శించుకున్నాను. శ్రీలంక పర్యటన కూడా ట్రావెల్స్‌ సహాయంతోనే జరిగింది. శక్తిపీఠాల్లో మొదటిదైన శాంకరీదేవి శక్తిపీఠం, సీతాదేవి అశోకవనంలో ఉన్న చోటు, రావణాసురుడు తొమ్మిది బావులు తవ్విన ప్రాంతం, సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం చూశాను. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం ఎంతో ప్రశస్థమైనది. ఆ దేశ సుప్రీం కోర్టు సైతం ఆ ప్రాంతంలో చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. విభీషుణుడిని అక్కడివారు ‘ట్రైటర్‌ ఆఫ్‌ లంక’ (దేశద్రోహి)గా అభివర్ణిస్తారు. ఈ కారణంగానే అతని గుడి బౌద్ధ ఆరామాల వెనక మరుగున పడి ఉంటుంది. ఆ గుడినీ దర్శించుకున్నాను. 


రెండు కుట్టు పడ్డాయి...

శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయానికి కాలి నడకన వెళ్లాను. అక్కడి అమ్మవారికి నుదుటన బొట్టు పెడితే, వేలికి చర్మం తగిలిన స్పర్శ తెలుస్తుంది. అయితే అంతటి విశిష్టత కలిగిన ఆ ఆలయం చేరుకోవడానికి ప్రయాణ సాధనంగా జీప్‌లు ఉండేవి. కానీ ఆ సమయంలో వాహనాలకు అనుమతి లేకపోవడంతో, అడవిలో 30 కిలీమీటర్ల దూరం నడిచాను. నాందేడ్‌ దగ్గర మాహ్యూర్యంలో అమ్మవారి శక్తిపీఠాన్ని చూసేందుకు రెండు వందల మెట్లు ఎక్కవలసి వచ్చింది. అహోబిలంలో నవనారసింహాస్వామి సందర్భన కోసం కూడా మెట్లు ఎక్కవలసిందే! ఇవన్నీ ఒక ఎత్తయితే చార్‌ధామ్‌, అమర్‌నాఽథ్‌ యాత్రలు మరొక ఎత్తు. ఘాట్‌ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా సాగేది. అమర్‌నాథ్‌ యాత్రలో గుర్రం మీద నుంచి పడిపోయాను. దాంతో రాయి గుచ్చుకొని రక్తస్రావం మొదలైంది. కానీ వెనక్కి మళ్లితే, మళ్ళీ అమర్‌నాథ్‌ను దర్శించుకునే అవకాశం దొరకదని, అలాగే ప్రయాణం కొనసాగించాను. తిరుగు ప్రయాణంలో ఆ దెబ్బకు రెండు కుట్లు వేయించుకున్నాను.


పక్కా ప్లాన్‌తో,తక్కువ బడ్జెట్‌లో...

ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా, ముందుగా ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం సేకరించేదాన్ని. ప్రయాణ సాధనాలు మొదలు ఆ ప్రాంతాల్లో ప్రజారవాణా వ్యవస్థ వివరాలు, పుణ్యక్షేత్రాల ప్రాశస్థ్యం.... ఇలా మొత్తం సమాచారం తెలుసుకున్నాక... పక్కాగా, ప్రణాళికాబద్ధంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకొనేదాన్ని. రైలు, బస్‌ టిక్కెట్లను ముందుగానే రిజర్వ్‌ చేయించుకునేదాన్ని. గమ్యం చేరిన తర్వాత సామాన్లు క్లాక్‌ రూమ్‌లో ఉంచేదాన్ని. రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్లలో ఉండే స్నానపు గదులే వాడుకొనేదాన్ని. వెళ్లిన పుణ్యక్షేత్రం దగ్గర నది ఉంటే, అక్కడే నా స్నానం. ప్రయాణాల్లో ఇబ్బందులు సహజం. ఓ ప్రయాణంలో నా లగేజీ బ్యాగ్‌ పోయింది. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న కూతురు సహాయం చేసింది. భోజనానికి ఇబ్బందిపడిన సందర్భం కోల్‌కతాలో ఎదురైంది. అక్కడి భోజనంలో చేపలు కచ్చితంగా ఉండవలసిందే! పెరుగన్నం తిందామన్నా, ‘పూర్తి భోజనం వడ్డిస్తాం’ అనేవారు. దాంతో భోజనం మానుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పుణ్యక్షేత్రాలు సందర్శనతో కలిగే ఆనందం ముందు ఈ చిన్నపాటి ఇబ్బందులు లెక్కలోకి రావు. రెండేళ్ల నా ప్రయాణాలన్నిటికీ అయిన మొత్తం ఖర్చు ఒక లక్షా 43 వేలు మాత్రమే! వీటిలో పెద్ద మొత్తాలు ట్రావెల్‌ కంపెనీలకి చెల్లించినవే!


అది నా  జీవిత లక్ష్యం!

మాది శ్రీకాకుళం. ముప్పై ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వలస వచ్చాం. మా దంపతులిద్దరం ప్రైవేట్‌ స్కూలు టీచర్లుగా పనిచేసి, రిటైరయ్యాం. నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి పోలాండ్‌లో ఉంటోంది. చిన్నమ్మాయితో కలిసి నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని, కుటుంబం తోడ్పాటు అందించబట్టే ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోగలిగాను. మానససరోవరం సందర్శన నా జీవిత లక్ష్యం. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న ప్రయాణం. సహృదయుల విరాళాలతో ఆ ప్రయాణానికి సరిపడా డబ్బు పోగుచేసుకుంటున్న సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. దాంతో ప్రయాణం వాయిదా పడింది. కానీ ఎలాగైనా ప్రయాణానికి అవసరమైన రెండు లక్షలూ సేకరించి, నా లక్ష్యాన్ని ముగించగలననే అనుకుంటున్నాను. మానససరోవరంలో కైలాసగిరి ప్రదక్షిణ కోసం 51 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. పైగా అక్కడి గాలిలో ఆక్సిజన్‌ శాతం తక్కువ. కాబట్టి ఆ వాతావరణానికి ఊపిరితిత్తులను సిద్ధం చేయడం కోసం ప్రయాణానికి నెలల ముందు నుంచే నడక సాధన చేయవలసి ఉంటుంది. అందుకే ప్రస్తుతం రోజూ ఎనిమిది కిలోమీటర్లు నడుస్తున్నాను.

-గోగుమళ్ల కవిత

ప్రత్యేకం మరిన్ని...