Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 17 Jun 2022 14:34:23 IST

సినిమా రివ్యూ : ‘గాడ్సే’ (Godse)

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రం : ‘గాడ్సే’ 

విడుదల తేదీ : జూన్ 17, 2022

నటీనటులు : సత్యదేవ్, ఐశ్వర్యాలక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, సిజ్జు మీనన్, నోయల్, చైతన్య కృష్ణ, మ్యాథ్యూ వర్గీస్, నాగేంద్రబాబు, పృధ్విరాజ్, ప్రియదర్శి, పవన్ సంతోష్, గురుచరణ్, శశికుమార్ రాజేంద్రన్ తదితరులు.

సంగీతం : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ : సురేశ్ సారంగం

నిర్మాణం : సీకే స్ర్కీన్స్

దర్శకత్వం : గోపీ గణేశ్ పట్టాభి 

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ చాలా ప్రత్యేకం. వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని సరికొత్తగా అలరించాలని ప్రయత్నిస్తుంటాడు. గత చిత్రాలు ‘తిమ్మరుసు, స్కైలాబ్’ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. తాజాగా సత్యదేవ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్సే’ నేడే (జూన్ 17) థియేటర్స్ లోకి వచ్చింది. కొంత యాక్షన్ , కొంత సందేశం మిళితం అయిన ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చాడు? చిత్రం వారికి ఏ మేరకు కనెక్ట్ అవుతుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (Movie Review)

కథ 

రాష్ట్ర మంత్రులు, ఒక యస్పీ, మరికొందరిని కిడ్నాప్ చేస్తాడు ‘గాడ్సే’ (సత్యదేవ్). పెళ్ళిచూపుల్ని సైతం పక్కనపెట్టి ఒక ఆపరేషన్ లో పాలు పంచుకొన్న పోలీసాఫీసర్ వైశాలి (ఐశ్వర్యాలక్ష్మి) చేతుల్లో ఒక గర్భవతి మరణిస్తుంది. దాని కారణంగా రాజీనామా చేసిన ఆమెకు ఈ కేస్ ను అప్పగిస్తారు. లైవ్ లోకి వచ్చిన గాడ్సే డిమాండ్స్ ను, అతడి ఉద్దేశాన్ని నెగోషియేషన్ ఆఫీసర్ గా తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది ఆమె. ఈ క్రమంలో ఆమె గాడ్సే నేపథ్యాన్ని తెలుసుకుంటుంది. అతడు అంతలా మారడానికి కారణాల్ని అన్వేషిస్తుంది. దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని తెలుస్తుంది. అసలు గాడ్సే వారిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? దీని వెనుక ఏ రాజకీయ శక్తుల హస్తం ఉంది? ఈ దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యపై అతడు ఎందుకు పోరాటం చేశాడు? చివరికి గాడ్సే లక్ష్యం నెరవేరిందా? అనేది మిగతా కథ. (Movie Review)

విశ్లేషణ 

మొదటి భాగం మొదలు పెడుతూనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు గోపీ గణేశ్. పోలీసాఫీసరైన వైశాలి పెళ్ళిచూపుల సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఆమెను చూడ్డానికి వచ్చిన అబ్బాయి కార్లోనే వెళ్ళి.. ఆమె ఒక ఆపరేషన్‌ను మొదలుపెట్టడం కొత్తగా అనిపిస్తుంది. కొందరు దుండగులు ఒక ఇంట్లోకి చొరబడి ఒక నిండు గర్భిణిని హోస్టేజ్‌గా తీసుకుంటారు. ఆమెను కాపాడడానికి ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆమె చేతుల్లో గర్భిణి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. దాంతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఉద్యోగం పట్ల ఆమెకు గల నిబద్ధతను, సిన్సియారిటీని ఈ సన్నివేశంతో తెలియచెప్పాడు దర్శకుడు గోపీ గణేశ్. సత్యదేవ్ పాత్ర ఎంటరైన దగ్గర నుంచి సినిమాలో మరింతగా లీనమవుతారు ప్రేక్షకులు. అతడు కిడ్నాపులు ఎందుకు చేస్తున్నాడు, దానికి కారణమేంటి? అనే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను రేపుతాయి. అదే సమయంలో గతంలో వచ్చిన నారా రోహిత్ ‘ప్రతినిధి’ సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇంకా విజయ్ ఆంటోనీ ‘డాక్టర్ సలీమ్’ చిత్రం కూడా గుర్తుకు వస్తుంది. అయితే సత్యదేవ్  నటన వాటిన్నిటినీ మరుగున పరుస్తుంది. పోలీసాఫీసర్ వైశాలిని పరిచయం చేసుకొనే క్రమంలో వల్గర్ గా మాట్లాడిన.. సత్యదేవ్  పాత్రమీద ప్రేక్షకుల్లో అనుమానం కలుగుతుంది. దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మొదటి భాగం ముగుస్తుంది. (Movie Review)


రెండో భాగం ప్రారంభం నుంచి సత్యదేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది తెలుస్తుంది. అతడి ఫ్లాష్ బ్యాక్ మొదలైనప్పటి నుంచి అతడి మీదున్న నెగెటివ్ ఫీలింగ్ పోయి.. జాలి కలగడం మొదలవుతుంది. అసలతడు అలా మారడానికి కారణమేంటి? అతడు పోగొట్టుకున్నదేంటి? అనే అంశాల్ని చాలా కన్విన్సింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తం కథాంశాన్ని గాడ్సే అన్న ఒక బిజినెస్ మ్యాన్ పెర్సనల్ రివెంజ్‌గా కాకుండా.. కొందరు రాజకీయ నాయకుల మీద, ఈ వ్యవస్థ మీద అతడు సాగించే పోరాటంగా చూపించడం దర్శకుడి మంచి ప్రయత్నంగా చెప్పాలి. ఎంతో మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ తాము చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు రాక.. జీవితంతో రాజీపడి తమ చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని లక్షల ఉద్యోగాల ప్రకటననిచ్చి.. ఏవో కారణాలతో వాటిని భర్తీ చేయక పెండింగ్ లో పెడుతున్నారు. వాటి వల్ల యువత ఎన్ని బాధలు పడుతున్నారు? అన్న అంశాన్ని ఈ సినిమాతో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అయితే కథనాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండనిపిస్తుంది. అలాగే.. కాన్ఫ్లిక్ట్ మరింత బలమైనదైతే ఇంకా బాగుండేది.  క్లైమాక్స్‌ను సింపుల్ గా తేల్చేయడం, అందులో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకున్న మరో మైనస్ పాయింట్. (Movie Review)


గాడ్సేగా సత్యదేవ్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌నిచ్చాడు. అతడు పలికే డైలాగ్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. తను నటించేంత సేపు కొత్తగా చేయడానికి ప్రయత్నించడం అతడి ప్రత్యేకత. పోలీసాఫీసర్ వైశాలిగా మలయాళ బ్యూటీ ఐశ్వర్యాలక్ష్మి బాగా చేసింది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా కావడంతో ఆమె పాత్ర కొత్తగా అనిపించింది. సత్యదేవ్ ఫ్రెండ్స్ గా నోయల్, గురుచరణ్, చైతన్యకృష్ణ, పవన్ సంతోష్ పాత్రలు ఎమోనల్‌గా ఆకట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా మలయాళ నటుడు సిజ్జు మీనన్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, మిర్చి మాధవి, శశికుమార్ రాజేంద్రన్, పృధ్విరాజ్, నాగబాబు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత సి కళ్యాణ్ ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు గాడ్సే చిత్రం బెటర్ ఆప్షన్. (Movie Review)

ట్యాగ్‌లైన్ : ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement