పీఎంఓలో గాడ్సే భక్తులు: జిగ్నేష్ మేవాని

ABN , First Publish Date - 2022-05-02T19:12:32+05:30 IST

రెండ్రోజుల క్రితం అసోం జైలు నుంచి విడుదలైన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మరోసారి బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై..

పీఎంఓలో గాడ్సే భక్తులు: జిగ్నేష్ మేవాని

న్యూఢిల్లీ: రెండ్రోజుల క్రితం అసోం జైలు నుంచి విడుదలైన గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మరోసారి బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. తన అరెస్టు వెనుక పీఎంఓలో కూర్చున్న కొందరు 'గాడ్సే' భక్తులు ఉన్నారని ఆరోపించారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ముందస్తు కుట్రలో భాగంగా తనపై కేసులు పెట్టారని అన్నారు.


పుష్ప డైలాగ్‌...

టాలీవుడ్ చిత్రం 'పుష్ప'లో అత్యంత ప్రచారంలోకి వచ్చిన డైలాగ్‌ను జిగ్నేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, తాను తగ్గేదే లేదని, తాను నిప్పని, ఫ్లవర్ (పుష్పం) కాదని అన్నారు. తన నుంచి, తన అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ప్రభుత్వం ఏదో ఒకటి అమర్చే అవకాశాలున్నాయని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.


గుజరాత్‌లో క్వచ్ఛన్ పేపర్లు లీక్ అయిన సంఘటనలు 22 వరకూ ఉన్నాయని, ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు కానీ, విచారణ కానీ జరగలేదని అన్నారు. ముంబై పోర్ట్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న విషయంలో కానీ, గుజరాత్ మంత్రిపై ఒక దళిత మహిళ చేసిన అత్యాచార ఆరోపణలపై కానీ ఎలాంటి దర్యాప్తు జరగలేదని, ఎలాంటి అరెస్టులు చేయలేదని చెప్పారు. ధర్మసంసధ్ నుంచి ఒకవర్గాన్ని ఊచకోత కోయాలంటూ ఇచ్చిన పిలుపుపైనా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన విమర్శించారు. కేవలం శాంతి సామరస్యాలను కాపాడాలనే తాను ప్రధానిని కోరుతూ ట్వీట్ చేశారని అన్నారు. ఆ ఒక్క కారణంతోనే తనను అరెస్టు చేశారని చెప్పారు. దీనిని బట్టే తనను అప్రతిష్టపాలు చేసేందుకే ముందస్తు కుట్ర చేసినట్టు అర్ధమవుతోందని, ఏ సెక్షన్‌పై తనను అరెస్టు చేశారో చెప్పలేదని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. కనీసం తన లాయర్‌తో కూడా మాట్లాడనీయలేదన్నారు. ఎమ్మెల్యేగా తనకున్న విశేషాధికారాన్ని సైతం గౌరవించలేదని, తన అరెస్టు గురించి కనీసం స్పీకర్ కూడా తెలియజేయలేదని అన్నారు. బహుశా తనను కస్టడీలోకి తీసుకుని అసోం తీసుకు వెళ్లిన తర్వాత ఆయనకు సమాచారం ఇచ్చి ఉంటారని చెప్పారు. గుజరాత్ గౌరవాన్ని ఇది కించపరచడమేనని, గుజరాత్ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు.


కాంగ్రెస్‌కు మద్దతిస్తామని మేవాని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రధానికి వ్యతిరేకంగా ట్వీ్ట్ చేశారంటూ కోక్రాఝర్ జిల్లా బీజేపీ నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో గత ఏప్రిల్ 20న అసోం పోలీసులు గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాలో మేవానిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 25న మేవానికి కోక్రాఝార్ కోర్టు బెయిలు మంజూరు చేయగా, ఒక మహిళా పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన మరో కేసులో ఆయనను తిరిగి అరెస్టు చేశారు.

Updated Date - 2022-05-02T19:12:32+05:30 IST